Putin and Modi : మోదీపై అమెరికన్ మీడియా ప్రశంసల జల్లు

ABN , First Publish Date - 2022-09-17T17:01:56+05:30 IST

ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఇది సమయం కాదని రష్యా అధ్యక్షుడు

Putin and Modi : మోదీపై అమెరికన్ మీడియా ప్రశంసల జల్లు

వాషింగ్టన్ : ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఇది సమయం కాదని రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్‌కు చెప్పినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అమెరికన్ మీడియా ప్రశంసల్లో ముంచెత్తింది. షాంఘై సహకార సంఘం (SCO) సమావేశాల నేపథ్యంలో ఈ నేతలిద్దరూ జరిపిన చర్చలను అమెరికన్ మీడియా విస్తృతంగా ప్రచురించింది. 


‘వాషింగ్టన్ పోస్ట్’ హెడ్‌లైన్‌లో, ఉక్రెయిన్‌లో యుద్ధంపై పుతిన్‌ను మోదీ విమర్శించారని పేర్కొంది. ‘యూఎస్ డైలీ’లో, ‘అవాక్కయ్యే బహిరంగ విమర్శ, పుతిన్‌తో మోదీ : ఇది యుద్ధం చేసే కాలం కాదు, దీని గురించి నేను మీతో ఫోన్‌లో మాట్లాడాను’’ అని పేర్కొంది. అరుదైన ఈ మందలింపు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. 


మోదీ వ్యాఖ్యలపై పుతిన్ స్పందిస్తూ, ‘‘ఉక్రెయిన్ సంఘర్షణపై మీ వైఖరి నాకు తెలుసు, మీరు నిరంతరం వ్యక్తం చేస్తున్న ఆందోళన గురించి నాకు తెలుసు. సాధ్యమైనంత త్వరగా దీనిని ఆపేయడానికి మేం గట్టిగా కృషి చేస్తాం. దురదృష్టవశాత్తూ, ఎదుటి పక్షం, ఉక్రెయిన్ నాయకత్వం, చర్చల ప్రక్రియను వదులుకుంటున్నట్లు ప్రకటించింది. సైనికపరంగానే తన లక్ష్యాలను సాధించుకుంటామని ప్రకటించింది. యుద్ధరంగంలో తేల్చుకుంటామని చెప్పింది. అయినప్పటికీ, అక్కడ ఏం జరుగుతోందో ఎల్లప్పుడూ మీకు సమాచారం ఇస్తూనే ఉంటాం’’ అని చెప్పారు. 


వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్ వెబ్‌సైట్లలో దీనిని లీడ్ స్టోరీగా ప్రచురించాయి. న్యూయార్క్ టైమ్స్ వెబ్‌సైట్ హెడ్‌లైన్‌లో, ఇది యుద్ధం చేసే కాలం కాదని పుతిన్‌కు భారత దేశ నేత చెప్పారని తెలిపింది. మోదీ, పుతిన్ సమావేశం స్నేహపూర్వకంగానే జరిగిందని తెలిపింది. ఇరు దేశాల మధ్యగల సుదీర్ఘ చరిత్రను ప్రస్తావించుకున్నారని తెలిపింది. మోదీ ఈ వ్యాఖ్యలు చేయడానికి ముందే పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌లో యుద్ధంపై భారత దేశ ఆందోళన గురించి తాను అర్థం చేసుకున్నానని చెప్పారని యూఎస్ డైలీ పేర్కొంది. 


పుతిన్‌తో చర్చల్లో ఉక్రెయిన్ గురించి  చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కనీసం ప్రస్తావించలేదని ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది.


Updated Date - 2022-09-17T17:01:56+05:30 IST