Samajwadi Party : ఎస్‌పీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన అఖిలేశ్ యాదవ్... బీజేపీని గద్దె దించాలని పిలుపు...

ABN , First Publish Date - 2022-09-29T20:28:24+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధ్యక్షునిగా అఖిలేశ్ యాదవ్ (

Samajwadi Party : ఎస్‌పీ అధ్యక్షునిగా మరోసారి ఎన్నికైన అఖిలేశ్ యాదవ్... బీజేపీని గద్దె దించాలని పిలుపు...

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ  (Samajwadi Party) అధ్యక్షునిగా అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న ఐదేళ్ళలో తమ పార్టీ జాతీయ పార్టీగా ఎదగడానికి కృషి చేయాలని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకే ఓటు వేశారని, అయినప్పటికీ తమ నుంచి ప్రభుత్వాన్ని బీజేపీ లాక్కుందని చెప్పారు. అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి, తప్పుడు మార్గాల్లో ప్రభుత్వాన్ని బీజేపీ లాక్కుందన్నారు. 


అఖిలేశ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనంతరం గురువారం ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు.  శాసన సభ ఎన్నికల్లో ప్రజలు సమాజ్‌వాదీ పార్టీకి పట్టం కట్టినప్పటికీ, ప్రభుత్వాన్ని బీజేపీ లాక్కోవడానికి కారణాన్ని వివరించారు. ఉత్తర ప్రదేశ్‌లో గద్దె దిగడమంటే, కేంద్రంలో ప్రభుత్వాన్ని కోల్పోయినట్లేనని, అందుకే వాళ్ళు ఈ పని చేశారని చెప్పారు. అందుకే వాళ్ళు చేయగలిగినదంతా చేశారన్నారు. 


కేంద్ర ఎన్నికల కమిషన్ (ECI) అంటే తమకు గొప్ప నమ్మకం ఉందని, అయితే అది బీజేపీ బూత్ ఇన్‌ఛార్జిలకు కొమ్ముకాసిందని అన్నారు. అందుకే ఇప్పుడు మనం బూత్ స్థాయిలో కూడా చాలా బలంగా తయారవాలన్నారు. 


జైళ్లకు వెళ్ళవలసి వచ్చినప్పటికీ తాము కేంద్ర, రాష్ట్రాల్లోని బీజేపీ ప్రభుత్వాలపై పోరాడుతూనే ఉంటామని చెప్పారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రమాదంలో పడ్డాయన్నారు. ఢిల్లీ, లక్నోల్లో (కేంద్ర, రాష్ట్రాల్లో) ఉన్న ప్రభుత్వాలు వ్యవస్థలను కబ్జా చేశాయని చెప్పారు. పోరాడటానికి తాము భయపడబోమని చెప్పారు. 


సోషలిస్టులు, దళితుల మధ్య ఐకమత్యం రావాలన్నారు. ఈ వర్గాలవారు తమ పార్టీలో పెద్ద సంఖ్యలో చేరుతున్నారని చెప్పారు. బీజేపీ నేతలు అబద్ధాలకోరులని, ప్రచార యావ ఎక్కువ అని మండిపడ్డారు. దుర్గా మాత పూజలు చేసుకుంటున్న ప్రస్తుత సమయంలో బీజేపీ నేతలు అబద్ధాలు ఆపాలని ప్రార్థన చేద్దామని అన్నారు. రైతులు అనేక కష్టాల్లో ఉన్నారని, అయినప్పటికీ రుణ మాఫీలు ఎక్కువగా గుజరాతీ వ్యాపారవేత్తలకే అందుతున్నాయని అన్నారు. పరిశ్రమలను గుజరాత్‌కు తీసుకెళ్లిపోతున్నారన్నారు. ఉత్తర ప్రదేశ్‌కు పరిశ్రమలను ఎందుకు తేవడం లేదని ప్రశ్నించారు. ఉత్తర ప్రదేశ్‌ బీజేపీకి అత్యధిక స్థానాలను ఇచ్చిందని, ప్రభుత్వ ఏర్పాటుకు సహాయపడిందని గుర్తు చేశారు. 


అంతకుముందు సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ (Ram Gopal Yadav) మాట్లాడుతూ, పార్టీ జాతీయ అధ్యక్షునిగా అఖిలేశ్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆ పార్టీ ఉత్తర ప్రదేశ్ శాఖ అధ్యక్షునిగా నరేశ్ ఉత్తమ్ పటేల్ బుధవారం ఎన్నికైన సంగతి తెలిసిందే.


Read more