Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీలో అన్ని విభాగాల రద్దు

ABN , First Publish Date - 2022-07-03T20:39:49+05:30 IST

సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party)లోని అన్ని విభాగాలను ఆదివారం

Akhilesh Yadav : సమాజ్‌వాదీ పార్టీలో అన్ని విభాగాల రద్దు

లక్నో : సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party)లోని అన్ని విభాగాలను ఆదివారం రద్దు చేశారు. పార్టీ ఉత్తర ప్రదేశ్ శాఖను మాత్రం కొనసాగించారు. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) ఈ చర్య తీసుకున్నట్లు ఆ పార్టీ ట్విటర్ వేదికగా వెల్లడించింది. పార్టీకి సంబంధించిన అన్ని విభాగాల జాతీయ, రాష్ట్ర అధ్యక్షులను తొలగించినట్లు తెలిపింది. రాష్ట్ర, జిల్లా కార్యవర్గ విభాగాలు, యువజన, మహిళా విభాగాలు, ఇతర శాఖలను రద్దు చేసినట్లు పేర్కొంది. 


ఈ భారీ ప్రక్షాళనకు కారణాలేమిటో ఆ పార్టీ వెల్లడించలేదు. అయితే 2024 లోక్‌సభ ఎన్నికల కోసం సమాయత్తమయ్యేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అజంగఢ్, రామ్‌పూర్ లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవి చూడటంతో పార్టీని ప్రక్షాళన చేస్తున్నారని భావిస్తున్నారు. 


ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అజంగఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి దినేశ్ లాల్ యాదవ్ గెలిచారు. ఈ స్థానంలో అఖిలేశ్ యాదవ్ బంధువు  సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి ధర్మేంద్ర యాదవ్ 8,679 ఓట్ల తేడాతో పరాజయంపాలయ్యారు. అంతకుముందు అఖిలేశ్ యాదవ్ ఈ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యంవహించేవారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో ఎంపీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అవసరమైంది. 


సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత  అజం ఖాన్ కూడా ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో, రామ్‌పూర్ ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి అసిం రజా ఓటమి పాలయ్యారు. ఆయనపై 42,192 ఓట్ల ఆధిక్యంతో బీజేపీ అభ్యర్థి ఘనశ్యామ్ లోఢీ గెలిచారు. 


Updated Date - 2022-07-03T20:39:49+05:30 IST