Akhilesh కు షాక్... Droupadi Murmu కు మద్దతు ప్రకటించిన Rajbhar

ABN , First Publish Date - 2022-07-15T21:06:37+05:30 IST

అఖిలేష్ యాదవ్ సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీకి ఓం ప్రకాష్ రాజ్‌భర్‌కు చెందిన సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ..

Akhilesh కు షాక్... Droupadi Murmu కు మద్దతు ప్రకటించిన Rajbhar

లక్నో: అఖిలేష్ యాదవ్ (Akilesh Yadav) సారథ్యంలోని సమాజ్‌వాదీ పార్టీ (SP)కి ఓం ప్రకాష్ రాజ్‌భర్‌ (Om Prakash Rajbhar)కు చెందిన సుహల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రపతి ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) అభ్యర్థి ద్రౌపది ముర్ము (Droupadi Murmu)కు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు రాజ్‌భర్ శుక్రవారంనాడు ప్రకటించారు. పార్టీ నేతలు, ఆఫీస్ బేరర్లతో సంప్రదించిన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన చెప్పారు. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఎస్‌బీఎస్‌పీకి ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు.


ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గత శుక్రవారంనాడు లక్నోలో ఇచ్చిన విందుకు ఓం ప్రకాష్ రాజ్‌భర్ హాజరుకావడం విపక్ష నేతల్లో చర్చనీయాంశమైంది. విపక్ష కూటమిలో చీలికలు రావచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన విపక్ష కూటమిలో రాజ్‌భర్ పార్టీ భాగస్వామిగా ఉంది. కాగా, ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇచ్చిన డిన్నర్‌లో ఎస్‌పీ మాజీ భాగస్వామిగా ఉన్న ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ (లోహియా) అధినేత శివపాల్ యాదవ్, జనతా దళ్ లోక్‌తాంత్రిక్ చీఫ్ రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజా భయ్యా), బీఎస్‌పీ ఏకైక ఎమ్మెల్యే ఉమా శంకర్ సింగ్ కూడా హాజరయ్యారు. ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.

Read more