Rajasthn political crisis: ట్రబుల్ షూటర్‌కు కబురెట్టిన సోనియా

ABN , First Publish Date - 2022-09-28T01:06:13+05:30 IST

ష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వాడే నిజమైన ఫ్రెండ్. రాజస్థాన్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభాన్ని

Rajasthn political crisis: ట్రబుల్ షూటర్‌కు కబురెట్టిన సోనియా

న్యూఢిల్లీ: కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వాడే నిజమైన ఫ్రెండ్. రాజస్థాన్ కాంగ్రెస్‌లో తలెత్తిన సంక్షోభాన్ని తెరదించేందుకు తలమునకలవుతున్న సోనియాగాంధీకి కాంగ్రెస్ పార్టీ 'రియల్ ఫ్రండ్' గుర్తుకు వచ్చారు. పార్టీలో ఏ సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరించే ట్రబుల్ షూటర్‌గా, విధేయుడుగా, నిష్కలంక చరిత్ర ఉన్నవ్యక్తిగా ఆయనకు ఉన్న పేరును మరోసారి గుర్తుతెచ్చుకున్నారు. వెంటనే ఆయనను ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పెట్టారు. ఆయన మరెవరో కాదు..కేరళ దిగ్గజ నేత..ఏకే ఆంటోనీ (AK antony). ఇటీవల ఆయన రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. సోనియాగాంధీ పిలుపుమేరకు ఆయన మంగళవారం సాయంత్రమే కేరళ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.


రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను ఢిల్లీకి (పార్టీ అధ్యక్షుడిగా) రప్పించి, గెహ్లాట్  స్థానంలో యువనేత సచిన్ పైలట్‌కు రాజస్థాన్ పగ్గాలు అప్పగించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్ఠానం ఉంది. అయితే, రాజస్థాన్ వదిలిపెట్టినా తన మనిషే సీఎం కావాలనే పట్టుదలను గెహ్లాట్ ప్రదర్శిస్తుండటంతో కాంగ్రెస్ కన్నెర్ర చేస్తోంది. గెహ్లాట్ మద్దతుదారులుగా ప్రకటించుకుని రాజీనామాలకు సిద్ధమైన ఎమ్మెల్యేలపై క్రమశిక్షణా చర్యలకు కూడా సిద్ధమవుతోంది. దీంతో గెహ్లాట్, ఆయన అనుచరగణం (ఎమ్మెల్యేలు) రక్షణాత్మక చర్యల్లో పడ్డారని చెబుతున్నారు. వర్గ విభేదాలకు తావు లేకుండా సచిన్ పైలట్‌కు మద్దతుగా ఎమ్మెల్యేలనందరినీ ఏకతాటిపై వచ్చేలా చూసేందుకు, గెహ్లాట్‌ను దారిలోకి తెచ్చేందుకు అధిష్ఠానం పార్టీ దూతలను కూడా పంపింది. ఈ క్రమంలో ఏకే ఆంటోనిని సోనియాగాంధీ పిలిపించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 81 ఏళ్ల ఆంటోని కేంద్ర మాజీ రక్షణ మంత్రిగా, కేరళ ముఖ్యమంత్రిగా సేవలందించారు. రాజకీయాలకు ఇటీవల స్వస్తి చెప్పినట్టు ప్రకటించిన ఆయన తిరిగి కేరళకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరిగా పేరున్న ఆంటోనికి మిస్టర్ క్లీన్ ఇమేజ్‌తోపాటు, చిక్కుల్లో ఆదుకునే ట్రబుల్ షూటర్‌‌గా కూడా పేరుంది. పార్టీ కూడా ఆయన అంటే ఇప్పటికీ ఎంతో గౌరవం ప్రదర్శిస్తూనే ఉంది.

Updated Date - 2022-09-28T01:06:13+05:30 IST