Air India : నల్లతాడు కట్టుకోవద్దు... ఎయిరిండియా సిబ్బందికి 40 పేజీల మార్గదర్శకాలు...

ABN , First Publish Date - 2022-11-25T16:54:30+05:30 IST

టాటా (Tata) యాజమాన్యంలోని ఎయిరిండియా (Air India) కేబిన్ సిబ్బంది పాటించవలసిన నూతన మార్గర్శకాలు

Air India : నల్లతాడు కట్టుకోవద్దు... ఎయిరిండియా సిబ్బందికి 40 పేజీల మార్గదర్శకాలు...
Air India

న్యూఢిల్లీ : టాటా (Tata) యాజమాన్యంలోని ఎయిరిండియా (Air India) కేబిన్ సిబ్బంది పాటించవలసిన నూతన మార్గర్శకాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ ఆదేశాల ప్రకారం విమానాల కేబిన్‌లో పని చేసే స్త్రీ, పురుషులు మతపరమైన తాళ్ళు కట్టుకోరాదు. జుత్తుకు సహజసిద్ధమైన వర్ణంలో రంగు వేసుకోవాలి. బట్టతల ఉన్నవారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. ముక్కు పుడకలు ధరించరాదు.

చేతికి, మెడలో, పాదాలకు పైభాగంలో నల్లని, మతపరమైన తాళ్ళను కట్టుకోకూడదు. ముత్యాలు, రత్నాలు, పగడాలు వంటి రంగు రంగుల మతపరమైన ఉంగరాలను ధరించరాదు. ముక్కు పుడకలు, మెడలో ధరించే ఆభరణాలను ధరించరాదు. బొటనవేలుకు కూడా ఉంగరాలు పెట్టుకోకూడదు. వెలసిన రంగులో జుత్తు ఉండకూడదు. క్రమం తప్పకుండా సహజసిద్ధమైన వర్ణంలో రంగు వేసుకోవాలి.

కేబిన్ సిబ్బందిలో పురుషులు అన్ని కేబిన్లలోనూ నల్లని యూనిఫాం జాకెట్లను విడవకుండా ధరించాలి. బోర్డింగ్ నుంచి ప్రారంభించి, సర్వీస్, డీప్లేనింగ్ వరకు వీటిని ధరించాలి. పర్సనల్ టై పిన్స్‌ను అనుమతించరు. టై పిన్ లేకుండా టై ధరించవచ్చు. పురుషులు చక్కగా కురుచగా జుత్తును కత్తిరించుకోవాలి, పక్క పాపిడి తీసుకోవాలి. బట్టతల ఉన్నవారు పూర్తిగా గుండు చేయించుకోవాలి. ప్రతి రోజూ గుండును గీసుకోవాలి. క్రూ కట్‌ను అనుమతించరు.

ఫ్యాషన్ కలర్స్ అనుమతించరు. పురుషులు ప్రతి రోజూ గెడ్డం గీసుకోవాలి, హెయిర్ జెల్ తప్పనిసరిగా వాడాలి. వెడ్డింగ్ బ్యాండ్ డిజైన్‌లో ఒకే ఒక ఉంగరాన్ని మాత్రమే పురుష సిబ్బంది ధరించవచ్చు. మండ గొలుసు (బ్రేస్‌లెట్)లను అనుమతించరు. సిక్కు కడాను ఒకదానిని మాత్రమే అనుమతిస్తారు. ఇది బంగారం లేదా వెండితో తయారు చేసినదై ఉండాలి, గరిష్ఠంగా 0.5 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే ఉండాలి. దీనిపైన ఎటువంటి డిజైన్లు, లోగోలు, రాళ్లు, వజ్రాలు, ముత్యాలు, రత్నాలు వంటివి ఉండకూడదు. బ్లాండే హెయిర్ కలర్, స్ట్రీకింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. కంపెనీ మార్గదర్శకాలకు అనుగుణంగా నాజూకుగా జుత్తు ఉండాలి. డ్యూటీ ఫ్రీ దుకాణాల్లోకి కేబిన్ క్రూ వెళ్ళకూడదు. ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్స్ పూర్తయిన తర్వాత వెంటనే బోర్డింగ్ గేట్‌కు వెళ్లిపోవాలి.

Updated Date - 2022-11-25T17:11:01+05:30 IST