Delhi Waqf board case: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్

ABN , First Publish Date - 2022-09-28T22:38:51+05:30 IST

ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసులో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత ..

Delhi Waqf board case: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు బెయిల్

న్యూఢిల్లీ: ఢిల్లీ వక్ఫ్ బోర్డు కేసులో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణపై అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత అమానతుల్లా ఖాన్ (Amanatullah Khan)కు ఢిల్లీ కోర్టు బుధవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. అమానతుల్లా ఖాన్ తరఫున కోర్టుకు హాజరైన న్యాయవాది రాహుల్ మెహ్రా తన క్లయింట్ ఎలాంటి తప్పూ చేయలేదని కోర్టుకు తెలియజేశారు. ఎలాంటి నిధుల దుర్వినియోగం జరగలేదని, ప్రతి పైసాకు లెక్కలున్నాయని చెప్పారు.


అవినీతి నిరోధక విభాగం ఈనెల 16న ఖాన్‌ నివాసంపై దాడులు జరిపింది. 24 లక్షల రూపాయల నగదు, రెండు లైసెన్సులు లేని తుపాకులు, కార్టిడ్జ్‌లు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకుంది. అనంతరం ఆయనను అరెస్టు చేసింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా ఖాన్ ఉన్నప్పుడు నిబంధనలను ఉల్లంఘించి 32 మందిని అక్రమంగా రిక్రూట్ చేసినట్టు ఏసీబీ తమ ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులను చట్టవిరుద్ధంగా అద్దెలకు ఇచ్చారని, అవినీతి, ఆశ్రితపక్షపాతానికి ఆయన పాల్పడ్డారని ఆరోపించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన నిధులను ఆప్ ఎమ్మెల్యే దుర్వినియోగం చేసినట్టు  కూడా ఎఫ్ఐఆర్‌లో తెలిపింది.


కాగా, అమానతుల్లా ఖాన్ సహచరుడు కౌషర్ ఇమామ్ సిద్ధిఖిని సెప్టెంబర్ 21న తెలంగాణలో అరెస్టు చేశారు. జామియా ప్రాంతంలో రెయిడ్స్ సందర్భంగా ఏసీబీ బృందంపై దాడి చేసిన నలుగురు వ్యక్తులను కూడా ఢిల్లీ పోలీసులు  అరెస్టు  చేశారు.

Updated Date - 2022-09-28T22:38:51+05:30 IST