Gujarat Assembly elections : రానున్నది ఆప్ ప్రభుత్వమే : కేజ్రీవాల్

ABN , First Publish Date - 2022-10-02T21:38:04+05:30 IST

గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ

Gujarat Assembly elections : రానున్నది ఆప్ ప్రభుత్వమే : కేజ్రీవాల్

గాంధీ నగర్ : గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. తమ పార్టీ స్వల్ప తేడాతో విజయం సాధించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక చెప్పిందన్నారు. ఎన్నికలు జరగడానికి మరికొంత సమయం ఉంది కాబట్టి పెద్ద ఎత్తున మద్దతు పలకాలని ప్రజలను కోరారు. 


కేజ్రీవాల్ (Arvind Kejriwal) గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఓట్లను కాజేయడం కోసం బీజేపీ (BJP), కాంగ్రెస్ (Congress) కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. తనకు విశ్వసనీయ వర్గాలు ఓ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక గురించి చెప్పాయన్నారు. గుజరాత్ శాసన సభ ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వమే ఏర్పాటవుతుందని, అయితే స్వల్ప తేడాతో మాత్రమే గెలుస్తుందని ఈ నివేదిక చెప్పినట్లు ఆ వర్గాలు తనకు చెప్పాయని తెలిపారు. ఈ నివేదికను చూసిన బీజేపీ అవాక్కయిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహించుకోవడం ప్రారంభించాయని తెలిపారు. బీజేపీ వ్యతిరేక ఓటును చీల్చేందుకు ఆ పార్టీ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. 


తమ పార్టీని ఓడించడం కోసం కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని తెలిపారు. తమ పార్టీ ఓట్లను కాజేయాలని కాంగ్రెస్‌కు బీజేపీ చెప్పిందని తెలిపారు. ఢిల్లీలో ఒక్కొక్క ఆవుకు రోజుకు రూ.40 చొప్పున చెల్లిస్తున్నామని, గుజరాత్‌లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. వట్టిపోయిన, రోడ్లపై తిరిగే ఆవుల కోసం ప్రతి జిల్లాలోనూ శాలలను నిర్మిస్తామని తెలిపారు. గోవుల ప్రయోజనాల కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. 


182 స్థానాలు ఉన్న గుజరాత్ శాసన సభకు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు 10 కన్నా ఎక్కువ స్థానాలు లభించవని చెప్పారు. గెలిచినవారు కూడా బీజేపీలో చేరిపోతారన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేయడం నిరర్థకమని చెప్పారు. 


గుజరాత్ శాసన సభ ఎన్నికలు డిసెంబరులో జరిగే అవకాశం ఉంది.

Updated Date - 2022-10-02T21:38:04+05:30 IST