Australia లో విప్లవాత్మక పరిణామం.. కొత్త చట్టంతో అవినీతి రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు.. మన దేశంలో ఇది సాధ్యమేనా..?

ABN , First Publish Date - 2022-09-29T22:47:37+05:30 IST

ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంలే ప్రభుత్వాల పనితీరు పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాధినేతలతోపాటు క్రింది స్థాయి అధికార యంత్రాంగం

Australia లో విప్లవాత్మక పరిణామం.. కొత్త చట్టంతో అవినీతి రాజకీయ నేతల గుండెల్లో రైళ్లు.. మన దేశంలో ఇది సాధ్యమేనా..?

న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంలే ప్రభుత్వాల పనితీరు పారదర్శకంగా ఉండాలి. ప్రభుత్వాధినేతలతోపాటు క్రింది స్థాయి అధికార యంత్రాంగం వరకు ప్రజాధనాన్ని ప్రజల కోసమే సద్వినియోగం చేయాలి. దేశం అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే పని చేయాలి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రుల్లో చాలా మంది అవినీతిపరులేననే గట్టి నమ్మకం ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. ప్రపంచ దేశాల్లో అత్యున్నత స్థాయిలో సైతం అవినీతి పెరిగిపోతోంది. ఇటువంటి సమయంలో ఆస్ట్రేలియా ఈ శకానికి గొప్పది అని చెప్పుకోదగిన చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. దీని ద్వారా జాతీయ స్థాయిలో అవినీతి నిరోధక కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అవినీతి ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు చేసే అధికారాన్ని కట్టబెట్టాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో అవినీతి ఆరోపణలు, ప్రభుత్వ పారదర్శకత ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.


ఇటీవల ఆస్ట్రేలియాలో ప్రధాన మంత్రి, మంత్రులపై అవినీతి ఆరోపణలు విపరీతమయ్యాయి. అనుచిత ప్రవర్తన, క్రీడలు, కార్ పార్కింగ్ లాట్స్ కేటాయింపు, స్నేహితురాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చుకోవడం వంటి అవినీతి కార్యకలాపాలకు మంత్రులు, ఎంపీలు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రధాన మంత్రి ఏకంగా ఆరు మంత్రిత్వ శాఖలను గుట్టుగా తనకు తానే ఇచ్చుకున్నారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ విధంగా రహస్య కార్యకలాపాలు పెచ్చుమీరిపోతున్నాయని, ప్రజలకు రాజకీయాలపట్ల నమ్మకం సన్నగిల్లుతోందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. 


ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం

ఆస్ట్రేలియాలో దాదాపు 15 సంవత్సరాలపాటు అవినీతి వ్యతిరేక ఉద్యమకారులు, వివిధ వర్గాలవారు పోరాడిన తర్వాత ఫెడరల్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. నేషనల్ యాంటీ కరప్షన్ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. దీనికోసం ఓ బిల్లును రూపొందించింది. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యాన్ని సృష్టించడానికి ఈ బిల్లు దోహదపడుతుందని చెప్తోంది. 


అవినీతిని నిరోధించేందుకు ఫెడరల్ ఇంటెగ్రిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయడానికి సంబంధించిన బిల్లును బుధవారం పార్లమెంటులో లేబర్ గవర్నమెంట్  ప్రతిపాదించింది. ఈ కమిషన్ సర్వస్వతంత్రంగా పని చేస్తుందని ఈ బిల్లు చెప్తోంది. తీవ్రమైన, లేదా, వ్యవస్థాగత అవినీతి ఆరోపణలపై స్వతంత్రంగా దర్యాప్తు చేసేందుకు కావలసిన అన్ని వనరులను పుష్కలంగా సమకూర్చుతామని తెలిపింది. ఎంపీల వంటి ప్రజా ప్రతినిధులపై వచ్చే ఆరోపణలపై మాత్రమే కాకుండా ప్రాపర్టీ డెవలపర్స్, లాబీయిస్టులు, యూనియన్ల వంటి మూడో పక్షాలపై వచ్చే ఆరోపణలపై కూడా దర్యాప్తు జరిపేందుకు ఈ కమిషన్‌కు అధికారం ఉంటుందని తెలిపింది. అనామక వ్యక్తులు ఇచ్చే సమాచారంపై కూడా విచారణ జరిపే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుందని ప్రభుత్వం చెప్తోంది. 


మరింత అవసరమంటున్న ఉద్యమకారులు

అయితే మరింత పారదర్శకత అవసరమని ఉద్యమకారులు చెప్తున్నారు. అసాధారణ విచారణలను మాత్రమే బహిరంగంగా జరిపేందుకు ఈ బిల్లులో అవకాశం ఉందని, రహస్య విచారణ విధానం ఉండటం శ్రేయస్కరం కాదని చెప్తున్నారు. కమిషన్ పట్ల ప్రజలకు నమ్మకం కుదరాలంటే కచ్చితంగా విచారణలు బహిరంగంగానే జరగాలని అంటున్నారు. దీనివల్ల అవినీతి పట్ల ప్రజలకు అవగాహన పెరుగుతుందని, తద్వారా అవినీతిని నిరోధించడం సాధ్యమవుతుందని చెప్తున్నారు. బహిరంగ విచారణలు ప్రజాహితం కోసమేనని, 30 ఏళ్ళలో ఆస్ట్రేలియా సాధించిన అనుభవాన్ని రంగరించి పార్లమెంటరీ కమిటీ ఓ ఉత్తమ విధానాన్ని సూచిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్తున్నారు. 


మన దేశంలో...

ప్రజలకు అనుకూలమైన, ప్రజల కోసం పని చేసే ఏ ప్రభుత్వానికైనా పారదర్శకత, జవాబుదారీతనం అనేవి రెండు మూల స్తంభాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశ్వసిస్తారని పీఎంఇండియా వెబ్‌సైట్‌లో కనిపిస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనం ప్రజలను ప్రభుత్వానికి సన్నిహితం చేయడం మాత్రమే కాకుండా, వారిని విధాన నిర్ణయ ప్రక్రియలో సమాన భాగస్వాములను చేస్తాయని ఈ వెబ్‌సైట్‌లో ఉంటుంది. అయితే ఆయన నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడిచిందనే ఆరోపణలు ఉన్నాయి. 


సమాచార హక్కు చట్టానికి 2019లో చేసిన సవరణతో ఈ చట్టం ఓ కాగితపు పులిలా తయారైందనే ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు; రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్ల పదవీ కాలాలు, నియమ, నిబంధనలు, జీతభత్యాలు, సర్వీస్ కండిషన్స్ వంటివాటిని నిర్ణయించే అధికారం ఈ సవరణ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి లభించాయి. ఆర్టీఐ దరఖాస్తు చేయవలసిన అవసరం లేకుండానే చాలా సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఈ చట్టం దోహదపడుతుందని ప్రభుత్వం చెప్తోంది. 


ఈ బిల్లును 2019లో లోక్‌సభలో ప్రవేశపెట్టినపుడు ప్రతిపక్షాలు స్పందిస్తూ, సమాచార కమిషన్ల పనితీరును బలహీనపరచడమే నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యమని  ఆరోపించాయి. ఈ బిల్లును పార్లమెంటరీ సెలెక్ట్ కమిటీకి నివేదించాలని డిమాండ్ చేశాయి. కానీ ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈ చట్టం అమల్లోకి వచ్చింది. 


దర్యాప్తు సంస్థలపై...

కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) వంటి అవినీతి నిరోధక, దర్యాప్తు సంస్థలు కేంద్ర ప్రభుత్వ జేబు సంస్థలనే ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరోవైపు ఆర్థిక వ్యవస్థ, నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు వంటివాటిపై నివేదికలు పారదర్శకంగా ఉండటం లేదని ఆరోపణలు కూడా వస్తున్నాయి. 


చెప్పవలసినవాటినీ దాచేస్తున్నారు!

ప్రభుత్వం చట్టబద్ధంగా కచ్చితంగా వెల్లడించవలసిన సమాచారాన్ని కూడా ప్రజలకు అందుబాటులో ఉంచడం లేదని చాలా అధ్యయనాలు చెప్తున్నాయి. మొత్తం ఆర్టీఐ దరఖాస్తుల్లో 50 శాతం దరఖాస్తులు ఇటువంటి సమాచారం కోసం దాఖలవుతున్నవేనని చెప్తున్నాయి. 


రాష్ట్ర ప్రభుత్వాలదీ అదే తీరు!

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సమాచార హక్కును ప్రజలకు అందజేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. 2021 ఆగస్టులో సుప్రీంకోర్టు ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించింది. రాష్ట్ర సమాచార కమిషనర్లను నియమించని రాష్ట్ర ప్రభుత్వాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. 


పారదర్శకత, జవాబుదారీతనం అనేవి అక్షరాల రూపంలోనే కాకుండా స్ఫూర్తిదాయకంగా అమలైనపుడు మాత్రమే ప్రభుత్వాలు ప్రజలకు అనుకూలమైనవిగా మన్నన పొందగలవు. అది మన దేశంలో కూడా సాధ్యమవాలని ఆశిద్దాం.

                                  - యెనుముల పల్లి వేంకట రమణ మూర్తి

Read more