Bilkis Bano case : దోషుల విడుదలపై సుప్రీంకోర్టులో సవాల్

ABN , First Publish Date - 2022-08-23T17:50:50+05:30 IST

గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక

Bilkis Bano case : దోషుల విడుదలపై సుప్రీంకోర్టులో సవాల్

న్యూఢిల్లీ : గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషులను విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ దాఖలైంది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ ఎన్‌వీ రమణ (NV Ramana) ఈ పిటిషన్‌పై విచారణ జరిపేందుకు పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. జీవిత ఖైదు అనుభవిస్తున్న దోషులను గుజరాత్ ప్రభుత్వ రిమీషన్ పాలసీ ప్రకారం స్వాతంత్ర్య దినోత్సవాలనాడు విడుదల చేసిన సంగతి తెలిసిందే. 


ఈ 11 మంది దోషులను విడుదల చేయడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బిల్కిస్ బానో మాట్లాడుతూ, వీరిని విడుదల చేయడం వల్ల తన జీవితంలో శాంతి తనకు దూరమైందని, న్యాయ వ్యవస్థపై తనకు నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన బాధ, ఆవేదన కేవలం తనకోసం మాత్రమే కాకుండా న్యాయస్థానాల్లో న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి మహిళ కోసం అని చెప్పారు. 


ఈ దోషులు 15 సంవత్సరాలపాటు జైలు జీవితం గడిపారు. అనంతరం వీరిలో ఒక దోషి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను విడుదల చేయాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం రిమీషన్ గురించి పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 


ఈ రిమీషన్‌ను ఉపసంహరించాలని కోరుతూ దాదాపు 6,000 మంది సుప్రీంకోర్టును కోరారు. ఈ స్టేట్‌మెంట్‌పై సంతకాలు చేసినవారిలో యాక్టివిస్టులు సయేదా హమీద్, జఫరుల్ ఇస్లామ్ ఖాన్, రూప్ రేఖ, దేవకి జైన్, ఉమా చక్రవర్తి, సుభాషిణి అలీ, కవిత కృష్ణన్, మైమూనా మొల్లా, హసీనా ఖాన్, రచన ముద్రబోయిన, షబ్నమ్ హష్మి తదితరులు ఉన్నారు. 


Updated Date - 2022-08-23T17:50:50+05:30 IST