కుమారుడి మృతదేహం చూసి ఆగిన తల్లి గుండె

ABN , First Publish Date - 2022-07-18T18:13:10+05:30 IST

కుమారుడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేని ఓ తల్లి గుండెపోటుతో మృతిచెందిన ఘటన విషాదం నింపింది. చెంగల్పట్టు

కుమారుడి మృతదేహం చూసి ఆగిన తల్లి గుండె

చెన్నై/పెరంబూర్‌: కుమారుడి మృతదేహాన్ని చూసి తట్టుకోలేని ఓ తల్లి గుండెపోటుతో మృతిచెందిన ఘటన విషాదం నింపింది. చెంగల్పట్టు జిల్లా సింగపెరుమాళ్‌ పంచాయతీ జేజే నగర్‌ ఎంజీఆర్‌ వీధికి చెందిన రాజా-శాంతి (35) దంపతులకు జయగణేశ్‌ (15), తరుణ్‌ (12) అనే ఇద్దరు కుమారులున్నారు. జయగణేశ్‌ సింగపెరుమాళ్‌కోయిల్‌ ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో పదో తరగతి  ఉత్తీర్ణుడై, డిప్లొమో కోర్సులో చేరేందుకు కళాశాలలో దరఖాస్తు చేసుకోగా, తరుణ్‌ అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం తరుణ్‌తో ఆడుకుంటున్న జయగణేశ్‌ హఠాత్తుగా కిందపడి స్పృహ తప్పాడు. చుట్టుపక్కల వారు అతడిని వెంటనే చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం శనివారం సాయంత్రం జయగణేశ్‌ మృతదేహాన్ని ఇంటికి తీసుకురాగా, తల్లి శాంతి కుమారుడి మృతదేహాన్ని పట్టుకొని బోరున విలపిస్తూ అక్కడే కుప్పకూలి పడిపోయింది. బంధువులు ఆమెను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా పరీక్షించి వైద్యులు గుండెపోటుతో శాంతి మృతిచెందినట్లు తెలిపారు. ఒక రోజు వ్యవధిలో తల్లి, కుమారుడు హఠాత్తుగా మృతిచెందడం ఆ ప్రాంతవాసులకు కంటతడిపెట్టించింది.

Read more