Sar tan se juda : హిందువులకు మద్దతిచ్చిన డాక్టర్‌కు బెదిరింపులు

ABN , First Publish Date - 2022-09-13T18:53:09+05:30 IST

హిందూ సంస్థలకు మద్దతిచ్చిన ఓ వైద్యునికి అమెరికా ఫోన్ నంబరుతో

Sar tan se juda : హిందువులకు మద్దతిచ్చిన డాక్టర్‌కు బెదిరింపులు

ఘజియాబాద్ : హిందూ సంస్థలకు మద్దతిచ్చిన ఓ వైద్యునికి అమెరికా ఫోన్ నంబరుతో బెదిరింపులు వచ్చాయి. హిందూ సంస్థలకు మద్దతివ్వడం మానుకోకపోతే శరీరం నుంచి తలను వేరు చేస్తామని, ఇప్పటికే రెక్కీ చేశామని బెదిరించారు. తమను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కానీ, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కానీ ఆపలేరని బెదిరించారు. దీంతో ఆ డాక్టర్ పోలీసులను ఆశ్రయించారు. 


ఉత్తర ప్రదేశ్‌లోని సిహానీ గేట్ పోలీస్ స్టేషన్ అధికారి అలోక్ దూబే మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, డాక్టర్ అరవింద్ వాట్స్ లోహియా నగర్ పోలీస్ ఔట్‌పోస్ట్ వద్ద రెండు దశాబ్దాల నుంచి సొంతంగా క్లినిక్‌ను నిర్వహిస్తున్నారు. తనకు అమెరికా ఫోన్ నంబరుతో ఈ నెల 1న రెండు మిస్‌డ్ కాల్స్ వచ్చినట్లు  డాక్టర్ అరవింద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను నిద్రపోయినందువల్ల ఆ కాల్స్‌కు తాను స్పందించలేకపోయానని చెప్పారు. ఆ తర్వాత ఆ నెంబరుకు తాను ఫోన్ చేశానని, కనెక్ట్ కాలేదని తెలిపారు. ఈ నెల 7న మళ్ళీ అదే ఫోన్ నంబరు నుంచి ఫోన్ వచ్చిందన్నారు. హిందూ సంస్థలకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ కాలర్ బెదిరించాడని చెప్పారు. 


ఈ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. డాక్టర్ అరవింద్‌కు కాల్ చేసిన వాట్సాప్ నంబరును గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఘజియాబాద్ ఎస్ఎస్పీ మునిరాజ్ తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. 


Read more