ప్రాణాల కోసం 75 ఏళ్ల వృద్ధురాలి పోరాటం

ABN , First Publish Date - 2022-10-11T09:19:35+05:30 IST

ఆమె పేరు శాంతిదేవి. వయసు 75. అనుకోకుండా వేగంగా ప్రవహించే గంగానదిలో పడిపోయింది.

ప్రాణాల కోసం 75 ఏళ్ల వృద్ధురాలి పోరాటం

చిన్న చెక్కతో నదిలో 40 కిలో మీటర్ల మేర ప్రయాణం

కౌశంబి, అక్టోబరు 10: ఆమె పేరు శాంతిదేవి. వయసు 75. అనుకోకుండా వేగంగా ప్రవహించే గంగానదిలో పడిపోయింది. వేరొకరైతే ఆశలు, ప్రాణాలు వదిలేసుకునేవారేమో. కానీ ఆమె పరిస్థితులతో పోరాడింది.  ఆ పోరాటంలో గెలిచి, తన ప్రాణాలను దక్కించుకోగలిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి సామాపూర్‌ గ్రామానికి చెందిన శాంతిదేవి, తమ ఊరికి సమీపంలోనే ప్రవహిస్తున్న గంగానది వద్దకు ఆదివారం రాత్రి కాలకృత్యాలకు వెళ్లింది. ఈ క్రమంలో కాలుజారి నదిలోకి పడిపోయింది. పరవళ్లు తొక్కుతున్న గంగమ్మ, ఆమెను శరవేగంగా తీసుకెళ్లిపోయింది. ఊపిరి కోసం కొట్టుమిట్టాడుతున్న శాంతిదేవికి ఒక చెక్క దుంగ వంటిది దొరికింది. దాన్నే పట్టుకుని ఏకంగా 40 కిలోమీటర్ల మేర నది ప్రవాహంతోపాటు వెళ్లిపోయింది. సోమవారం ఉదయం కౌశంబి ప్రాంతంలోని గంగా ఘాట్‌ సమీపంలో ఒడ్డు మీది నుంచి ఆమెను గుర్తించిన కొంతమంది స్థానికులు రక్షించారు. అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఆమె చికిత్స పొందుతున్నారు. 

Read more