గ్యాంగ్‌రేప్‌.. శిరోముండనం చేసి ఊరేగింపు

ABN , First Publish Date - 2022-01-28T09:00:02+05:30 IST

ఆమెకు 20 ఏళ్లు! పెళ్లయింది. అత్తగారింట్లో ఉన్న ఆమెను కొందరు అపహరించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఆపై శిరోముండనం చేసి,

గ్యాంగ్‌రేప్‌.. శిరోముండనం చేసి ఊరేగింపు

  • ఢిల్లీలో 20 ఏళ్ల యువతి పట్ల అమానుషం 
  • బాలుడి ఆత్మహత్యకు ఆమే కారణమని కక్ష


న్యూఢిల్లీ, జనవరి 27: ఆమెకు 20 ఏళ్లు! పెళ్లయింది. అత్తగారింట్లో ఉన్న ఆమెను కొందరు అపహరించి.. సామూహిక అత్యాచారం చేశారు. ఆపై శిరోముండనం చేసి, మెడలో చెప్పులదండ వేసి వీధుల్లో తిప్పారు. ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాదు.. దేశరాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగింది. బాధితురాలి పట్ల కక్ష పెట్టుకొని ఇంతటి దారుణానికి ఒడిగట్టారు. ఆనంద్‌ విహార్‌ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన యువతి, ఓ బాలుడు స్నేహితులు. గత ఏడాది నవంబరులో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బాలుడి చావుకు యువతే కారణమని అతడి కుటుంబసభ్యులు కక్ష పెంచుకున్నారు. ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలనే నిర్ణయానికొచ్చి ఇంతటి ఘోరానికి ఒడిట్టారు. బాధితురాలికి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అత్యంత అవమానకర రీతిలో ఆమెను వీధుల్లో ఊరేగించిన తాలూకు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.


ఈ ఘటనకు సంబంధించి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు మహిళ ఉన్నట్లు తెలుస్తోంది.  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఢిల్లీ మహిళా కమిషన్‌ (డీసీడబ్ల్యూ) నోటీసులు పంపింది. అయితే అక్రమంగా మద్యం విక్రయాలు జరిపే ఓ ముఠానే ఈ ఘటనకు పాల్పడినట్లుగా డీసీబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మాలీవాల్‌ వెల్లడించారు. 

Read more