Former CM: 72 రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి మాజీ సీఎం

ABN , First Publish Date - 2022-09-09T14:08:19+05:30 IST

అన్నాడీఎంకేను చీల్చేందుకు కుట్ర జరుగుతోందని, అందులో డీఎంకే కూడా వుందని అన్నాడీంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి

Former CM: 72 రోజుల తర్వాత పార్టీ కార్యాలయానికి మాజీ సీఎం

- అన్నాడీఎంకే చీలికకు కుట్ర

- ఓపీఎస్‏ను మళ్లీ చేర్చుకునే ప్రసక్తే లేదు: ఈపీఎస్‌   

- కార్యకర్తల సంబరాలు 


చెన్నై, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): అన్నాడీఎంకేను చీల్చేందుకు కుట్ర జరుగుతోందని, అందులో డీఎంకే కూడా వుందని అన్నాడీంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) ఆరోపించారు. హైకోర్టు తీర్పుతో రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వైపు రాని ఈపీఎస్‌.. గురువారం కార్యకర్తల బాజాభజంత్రీలు, మేళతాళాల మధ్య మళ్లీ అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఈపీఎస్‌ మీడియాతో మాట్లాడుతూ.. అన్నాడీఎంకే(AIADMK)ను శాశ్వతంగా లేకుండా చేయాలని కొందరు కుట్ర పన్నుతున్నారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీని స్థాపించి అర్థ శతాబ్దమైందన్నారు. 50 యేళ్ళలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని నిలిచి, ఎన్నికల్లో విజయం సాధించిందన్నారు. డీఎంకే ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే పార్టీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తోందని మండిపడ్డారు. ఎంజీఆర్‌ హయాంలోనూ, జయ మరణానంతరం కూడా డీఎంకే నేతలు ఇలాంటి కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. పార్టీ స్థాపించిన యాభయ్యేళ్లు పూర్తి కాగా, అందులో 32 ఏళ్లపాటు అధికారంలో వున్నామని, ఆ కాలంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశామన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎపుడు వచ్చినా తమకు విజయం తధ్యమన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించిన స్టాలిన్‌(Stalin) ప్రజలకు ఒక్క మంచి పనికూడా చేయలేదన్నారు. కరోనా మహమ్మారి వల్ల కష్టాల్లో కూరుకుని పోయిన ప్రజలపై విద్యుత్‌ చార్జీల భారాన్ని ప్రభుత్వం మోపేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను అటకెక్కించారని, వాటిలో అమ్మా క్యాంటీన్‌ పథకం ఉందన్నారు.  


సారీ చెప్పినా చేర్చుకునే ప్రసక్తే లేదు

మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వంపై ఈపీఎస్‌ మరోమారు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఓపీఎస్‌ ఒక ఊసరవెల్లి అని ధ్వజమెత్తారు. ఆయన క్షమాపణ చెప్పినా మళ్ళీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదన్నారు. పార్టీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో అధికార పార్టీ అండతో కొందరు పార్టీ కార్యాలయంలోకి చొరబడి సామగ్రిని ధ్వంసం చేశారన్నారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. పార్టీలోని 96 శాతం మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, సర్వ సభ్య సభ్యులు, కార్యవర్గ సభ్యులు, కార్యకర్తల మద్దతు తనకు ఉందన్నారు. అన్నాడీఎంకే అనేది ఒక వ్యక్తి పార్టీ కాదన్నారు. లక్షలాది మంది కార్యకర్తలదని, పార్టీలోని ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. అన్నాడీఎంకే(AIADMK)లో ఏక నాయకత్వంపై వివాదం చెలరేగడం, అనంతరం న్యాయస్థానాల తీర్పుల నేపథ్యంలో 72 రోజులుగా పార్టీ ప్రధాన కార్యాలయానికి రాని ఈపీఎస్‌.. హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం తీర్పుతో ఊపిరి పీల్చుకుని, గురువారం కార్యాలయానికి చేరుకున్నారు.  


నేతల విగ్రహాలకు నివాళి

పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎంజీఆర్‌, జయలలిత విగ్రహాలకు ఈపీఎస్‌ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడ నుంచి కార్యాలయంలోకి వెళ్ళారు. అక్కడ ఈపీఎస్‏ను పార్టీ ప్రిసీడియం ఛైర్మెన్‌ తమిళ్‌ మగన్‌ హుస్సేన్‌, సీనియర్‌ నేత జయకుమార్‌ తదితరులు సాదర స్వాగతం పలికారు. అనంతరం సమావేశ మందిరంలో ఎంజీఆర్‌, జయ ఫొటోలకు నివాళులర్పించి, పార్టీకి కొత్తగా ఎన్నికైన నిర్వాహకులకు ఈపీఎస్‌ అభినందనలు తెలిపారు. 

Updated Date - 2022-09-09T14:08:19+05:30 IST