ఖర్గోన్ హింసాకాండ : 64 కేసుల నమోదు, 175 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2022-04-24T18:15:59+05:30 IST

శ్రీరామ నవమి సందర్భంగా మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన

ఖర్గోన్ హింసాకాండ : 64 కేసుల నమోదు, 175 మంది అరెస్ట్

భోపాల్ : శ్రీరామ నవమి సందర్భంగా మధ్య ప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో జరిగిన హింసాకాండపై 64 కేసులను నమోదు చేసి, 175 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పగటిపూట కర్ఫ్యూను ఆదివారం వరుసగా రెండో రోజు ఎక్కువసేపు సడలించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. 


ఇన్‌ఛార్జి పోలీస్ సూపరింటెండెంట్ రోహిత్ కశ్వానీ మాట్లాడుతూ, ఈ నెల 10న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి 64 ఎఫ్ఐఆర్‌లను నమోదు చేశామని, 175 మందిని అరెస్టు చేశామని చెప్పారు. శనివారం నుంచి కర్ఫ్యూను సడలిస్తున్నామని, ఆదివారం పగటి పూట తొమ్మిది గంటలపాటు ఈ నిబంధనలను సడలించామని చెప్పారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కర్ఫ్యూను సడలించినట్లు తెలిపారు. 


ఖర్గోన్ పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ చౌదరిపై కాల్పులు జరిపిన కేసులో నిందితుడు మొహిసిన్ వురపు వసీమ్‌ను శనివారం కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. అతనిని మూడు రోజులపాటు పోలీసు రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. నిందితులను ప్రశ్నిస్తున్నామని, తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. టెక్నికల్ సాక్ష్యాధారాల ఆధారంగా ఇతర నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. 


శ్రీరామ నవమినాడు జరిగిన మత ఘర్షణల్లో హింసాకాండ చెలరేగింది. దుకాణాలు, ఇళ్ళు, వాహనాలను తగులబెట్టారు. పోలీసు అధికారి సిద్ధార్థ్ చౌదరిపై ఓ దుండగుడు కాల్పులు జరపడంతో ఆయన కాలికి గాయమైంది. ఆయన చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం సెలవులో ఉన్నారు. నగరంలో కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఏప్రిల్ 14 నుంచి కొద్ది సేపు సడలిస్తున్నారు. అయితే శని వారం నుంచి ఎక్కువ సమయం సడలింపు ఇస్తున్నారు. 


Updated Date - 2022-04-24T18:15:59+05:30 IST