42% యువతకు ఉపాధి లేదు

ABN , First Publish Date - 2022-09-11T08:46:26+05:30 IST

దేశంలో 42 శాతం మంది యువత నిరుద్యోగంతో బాధ పడుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు.

42% యువతకు ఉపాధి లేదు

దేశ భవిష్యత్తు సురక్షితమేనా?: రాహుల్‌ 

పాదయాత్రలో వివిధ వర్గాలతో మాటామంతి 

తమిళనాడులో ముగిసిన ‘భారత్‌ జోడో’ యాత్ర

నేటి నుంచి కేరళలో.. 18 రోజులు కొనసాగింపు 


చెన్నై, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో 42 శాతం మంది యువత నిరుద్యోగంతో బాధ పడుతోందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ భవిష్యత్తు సురక్షితమేనా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. ‘భారత్‌ జోడో’ యాత్రలో భాగంగా నాలుగో రోజు శనివారం ఆయన తమిళనాడులో పాదయాత్ర చేశారు. వివిధ వర్గాల ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ములుగుమేడులో ప్రారంభమైన పాదయాత్రలో కొంతమంది నిరుద్యోగులు ‘ఐయాం వాకింగ్‌ ఫర్‌ జాబ్‌’ అని ముద్రించిన టీ షర్టులు ధరించి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు తమ కష్టాలను రాహుల్‌కు వివరించారు. ఆ తర్వాత దేశంలో నిరుద్యోగ సమస్య గురించి రాహుల్‌ ట్వీట్‌ చేశారు. పాదయాత్ర మార్గంలో తమిళ జానపద కళాకారులు సిలంబాట్టమ్‌ (కర్రసాము విన్యాసాలు) చేస్తూ రాహుల్‌కు స్వాగతం పలికారు. గ్రామీణ కళాకారులు తమిళ సంప్రదాయక నృత్యాలతో ఆయనను ఉత్సాహపరిచారు. పాదయాత్రలో చిన్నారులతో రాహుల్‌ కాసేపు ముచ్చటించారు. పారిశుధ్య మహిళా కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి కోరిక మేరకు సెల్ఫీ దిగారు. శనివారం రాత్రి కేరళ సరిహద్దు ప్రాంతమైన సెరువారకోణం సామువేల్‌ ఎల్‌ఎంఎస్‌ పాఠశాల వద్ద రాహుల్‌ బస చేశారు. తమిళనాడులో నాలుగు రోజుల పాదయాత్ర ముగిసింది. ఆదివారం కేరళలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. ఆ రాష్ట్రంలో పాదయాత్ర 18 రోజులు కొనసాగనుంది. పాదయాత్రలో మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్‌ సింగ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ దినేష్‌ గుండూరావు, టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి తదితరులు పాల్గొన్నారు. 


వివాదాస్పద మతబోధకుడితో భేటీయా?: బీజేపీ 

పాదయాత్రలో రాహుల్‌ గాంధీ వివాదాస్పద క్రైస్తవ మతబోధకుడు జార్జ్‌ పొన్నయ్యతో భేటీ కావడాన్ని బీజేపీ తప్పుబట్టింది. వీరిద్దరి భేటీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  ‘ఏసుక్రీస్తు భగవంతుని రూపమా? అది నిజమేనా?’ అని ఆ వీడియోలో రాహుల్‌ ప్రశ్నించగా... ‘అవును. ఆయన ఒక్కడే నిజమైన దేవుడు’ అని పొన్నయ్య సమాధానమిచ్చారు. పొన్నయ్య వ్యాఖ్యలను బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్‌ పూనావాలా తప్పుబట్టారు.  


విదేశీ బ్రాండ్‌ కాదు.. లోకల్‌ మేడ్‌: టీఎన్‌సీసీ 

చెన్నై, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘భారత్‌ జోడో’ యాత్రలో రాహుల్‌ గాంధీ ధరిస్తున్న టీ షర్టులను తమిళనాడులోనే తయారు చేశారని టీఎన్‌సీసీ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి చెప్పారు. బీజేపీ నేతలు చెబుతున్నట్లుగా విదేశీ బ్రాండ్‌ కాదని స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ రూ.40 వేల ఖరీదు టీ షర్టు ధరించి, పేదల గురించి మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై శనివారం అళగిరి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీ ధరించే టీ షర్టులు తిరుప్పూర్‌లో తయారు చేశారని చెప్పారు. తమిళ చేనేత కార్మికులకు గుర్తింపు తేవాలన్న ఉద్దేశంతో పాదయాత్రలో రాహుల్‌ వాటిని ధరిస్తున్నారని వివరించారు. మోదీలా రూ.10 లక్షల విలువ చేసే కోటును రాహుల్‌ ధరించలేదని ఎద్దేవా చేశారు. 

Read more