Rajasthan: బావిలో నిర్జీవంగా ఇద్దరు పిల్లలు, ముగ్గురు అక్కచెల్లెళ్ళు... వరకట్నం వేధింపుల కేసు నమోదు...

ABN , First Publish Date - 2022-05-28T22:56:03+05:30 IST

రాజస్థాన్‌లోని డూడూ సమీపంలో ఓ బావిలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు,

Rajasthan: బావిలో నిర్జీవంగా ఇద్దరు పిల్లలు, ముగ్గురు అక్కచెల్లెళ్ళు... వరకట్నం వేధింపుల కేసు నమోదు...

జైపూర్ : రాజస్థాన్‌లోని డూడూ సమీపంలో ఓ బావిలో ముగ్గురు అక్కచెల్లెళ్ళు, ఇద్దరు పిల్లల మృతదేహాలు కనిపించాయి. ఈ అక్కచెల్లెళ్ళలో ఇద్దరు ప్రస్తుతం గర్భిణులు. ఈ ముగ్గురూ ఒకే కుటుంబంలోని ముగ్గురు అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు. వీరి మృతికి వరకట్న వేధింపులే కారణమని ఫిర్యాదు నమోదైంది.


కలు మీనా (25), మమత మీనా (23), కమలేశ్ మీనా (20), నాలుగేళ్ళు, 22 రోజుల వయసుగల కలు కుమారుల మృతదేహాలు ఓ బావిలో కనిపించాయని పోలీసులు తెలిపారు. ఈ అక్కచెల్లెళ్ళ భర్తలపైనా, వారి కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. భర్త లేదా అతని కుటుంబ సభ్యులు క్రూరత్వం ప్రదర్శించడం, సహా వివిధ నేరారోపణలను నమోదు చేసినట్లు తెలిపారు. 


ఈ అక్కచెల్లెళ్ళ తండ్రి దాఖలు చేసిన ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణల ప్రకారం, వారి భర్తలు వారిని వరకట్నం కోసం వేధించేవారు. మే 25న కమలేశ్ తన తండ్రికి ఫోన్ చేసి, తమను తమ భర్తలు, వారి బంధువులు కొడుతున్నారని, తమకు చాలా భయంగా ఉందని చెప్పారు. ఆయన వెంటనే  డూడూ గ్రామానికి చేరుకుని, తన అల్లుళ్ళను తన కుమార్తెల గురించి అడిగారు. దీంతో వారు ఆయనను దుర్భాషలాడుతూ, ‘‘వాళ్ళు చనిపోయారు, మాకేమీ తెలియదు. నువ్వు వెళ్ళిపో, లేదంటే నువ్వు కూడా చస్తావు’’ అని బెదిరించారు. పెద్ద కుమార్తె కలు మీనాకు ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరి వయసు నాలుగేళ్ళు, మరొకరి వయసు 22 రోజులు. కాగా, మమత, కమలేశ్ 8, 9 నెలల గర్భిణులు. తన కుమార్తెలను, వారి పిల్లలను తమ అల్లుళ్ళు, వారి బంధువులే ముందస్తు ప్రణాళికతో హత్య చేసి ఉంటారని ఆ తండ్రి తన ఫిర్యాదులో తెలిపారు. 


ఈ అక్కచెల్లెళ్ళు, వారి పిల్లలు కనిపించడం లేదని బుధవారం ఓ ఫిర్యాదు డూడూ పోలీస్ స్టేషన్‌లో దాఖలైంది. అనంతరం గురువారం భారత శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్లు 498ఏ (ఓ మహిళ యొక్క భర్త లేదా అతని బంధువులు ఆమెపట్ల క్రూరత్వం ప్రదర్శించడం), 406 (నేరపూరితంగా నమ్మకద్రోహానికి పాల్పడటం), 323 (ఉద్దేశపూర్వకంగా గాయపరచడం) క్రింద కేసు నమోదు చేశారు. 


జైపూర్ రూరల్ ఎస్పీ మనీశ్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రాథమికంగా చూసినపుడు వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చిన తర్వాత స్పష్టమైన కారణాలు తెలుస్తాయన్నారు. మృతుల్లో ఓ మహిళ పెట్టిన వాట్సాప్ స్టేటస్‌లో తమను తమ బంధువులు ఇబ్బంది పెడుతున్నారని, చావడమే మంచిదని పేర్కొన్నట్లు తెలిపారు. మృతుల భర్తల కుటుంబ సభ్యుల్లో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. 


పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కార్యకర్త కవిత శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ సంఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఇద్దరు గర్భిణులు కావడం వల్ల వారి గర్భాల్లో ఇద్దరు ఉన్నారని వివరించారు. ఈ అక్కచెల్లెళ్ళు అనుభవించిన బాధను అర్థం చేసుకోగలమని, ఇది అత్యంత దారుణమైన నేరమని తెలిపారు. ఈ దారుణం జరగడానికి కారణం భర్తలు, వారి బంధువులు అత్యంత కిరాతకంగా వీరిని హింసించడమేనని ఆరోపించారు. ఈ దారుణంపై ఉన్నతాధికారులు నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలన్నారు. ఈ కేసును వేరొక పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. 


Read more