నెలలో 24 టికెట్లు

ABN , First Publish Date - 2022-06-07T08:34:20+05:30 IST

తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి శుభవార్త. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే టికెట్ల పరిమితిని ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) పెంచింది.

నెలలో 24 టికెట్లు

రైలు ప్రయాణికులకు శుభవార్త


ఆధార్‌ లింక్‌ చేసుకున్నవారికి బుక్‌ చేసుకునే అవకాశం

లేకపోతే 12 టికెట్ల వరకు అనుమతి

లగేజీ పరిమితి దాటితే జరిమానా

తక్కువ లగేజీతో జర్నీ ఎంజాయ్‌ చేయండి: రైల్వే శాఖ సూచన


న్యూఢిల్లీ, జూన్‌ 6: తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి శుభవార్త. ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకునే టికెట్ల పరిమితిని ఇండియన్‌ రైల్వేస్‌ క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) పెంచింది. ఇప్పటివరకు ఆన్‌లైన్‌ యూజర్లు నెలలో 6 టికెట్లు మాత్రమే బుక్‌ చేసుకోవడం వీలవుతుంది. యూజర్‌ ఐడీని ఆధార్‌ నంబర్‌తో లింక్‌ చేస్తే 12 టికెట్ల వరకు బుక్‌ చేసుకోవచ్చు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ పరిమితిని రెట్టింపు చేస్తున్నట్టు ఐఆర్‌సీటీసీ సోమవారం ప్రకటించింది. దీన్ని అనుసరించి... ఆధార్‌తో సంబంధం

లేకుండా ఒక యూజర్‌ ఒక నెలలో 12 టికెట్ల వరకు బుక్‌ చేయవచ్చు. అలాగే యూజర్‌ ఐడీతో ఆధార్‌ నంబర్‌ను లింక్‌ చేసుకుంటే 24 టికెట్ల వరకు బుక్‌ చేసుకోవచ్చు. దీనికోసం సంబంధిత ప్రయాణికుల్లో ఎవరైనా ఒకరి ఆధార్‌ నంబర్‌ను వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకునేవారికి తాజా నిబంధనలు వర్తిస్తాయి. తరచుగా రైలు ప్రయాణాలు చేసేవారికి ఈ నిర్ణయం వల్ల ప్రయోజనం ఉంటుందని ఐఆర్‌సీటీసీ పేర్కొంది. కాగా... రైళ్లలో పరిమితికి మించి లగేజీని తీసుకెళ్తే భారీగా జరిమానా విధించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ప్రయాణించే క్లాసును బట్టి లగేజీకి పరిమితులు విధించింది. ఏసీ ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణికులు 70 కేజీల వరకు లగేజీని తీసుకెళ్లవచ్చు. ఏసీ 2 టైర్‌ అయితే 50 కేజీలు; 3 టైర్‌, చైర్‌ కార్‌, స్లీపర్‌ అయితే 40 కేజీలు, సెకండ్‌ క్లాస్‌ అయితే 35 కేజీల వరకు లగేజీని అనుమతిస్తారు. దీనికి కనీస చార్జీ రూ.30 వసూలుచేస్తారు. లగేజీ పరిమితి దాటితే ప్రత్యేకంగా బుకింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దూరాన్ని బట్టి దీనికి చార్జీ నిర్ణయిస్తారు. అలాగే పరిమితికి మించి లగేజీ తెచ్చినందుకు జరిమానా కూడా విధిస్తారు. కాగా... తక్కువ లగేజీతో రైళ్లలో ప్రయాణించి జర్నీని ఎంజాయ్‌ చేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. లగేజీ ఎక్కువగా ఉంటే తోటి ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుందని పేర్కొంది. అలాగే లగేజీ ఎక్కువగా ఉండటంతో చాలా సందర్భాల్లో దాన్ని ఎత్తడానికి, దించడానికి సమయం సరిపోక ప్రయాణికులు చెయిన్‌ లాగుతున్నారని రైల్వే శాఖ వెల్లడించింది.

Read more