Japanese Encephalitis వ్యాధితో 23 మంది మృతి

ABN , First Publish Date - 2022-07-16T20:59:01+05:30 IST

అసోంలో రదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి విజృంభిస్తోంది. ఈ ఏడాది..

Japanese Encephalitis వ్యాధితో 23 మంది మృతి

గౌహతి: అసోంలో (Assam) వరదల పరిస్థితి కొంత మెరుగుపడినప్పటికీ జపనీస్ మెదడువాపు వ్యాధి (Japanese Encephalitis-JE) విజృంభిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంతవరకూ 23 మంది ఈ వ్యాధితో మృతిచెందారు. దోమల వల్ల వచ్చే ప్రాణాంతకమైన వ్యాధి మెదడువాపు. ఈ వ్యాధి వల్ల మెదడులోని నాడీ కణాల్లో వాపు ఏర్పాటు వాటి పనితీరులో అవరోధాలు ఏర్పాడతాయి. మెద‌డువాపు సోకిన వారిలో సాధార‌ణంగా త‌ల‌నొప్పి, జ్వరం, వాంతులు, మ‌తిస్థిమితం త‌ప్పడం, అప‌స్మార‌క స్థితి, మూర్చ వంటి ల‌క్షణాలు క‌నిపిస్తుంటాయి.


వైరల్ బ్రైన్ ఇన్‌ఫెక్షన్‌తో అసోంలో గత ఏప్రిల్ నుంచి 23 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అసోం నేషనల్ హెల్త్ మిషన్ తెలిపింది. గత 24 గంటల్లో వరదబాధిత ప్రాంతాలైన మొరిగావ్ జిల్లా నుంచి ఇద్దరు, నల్బరి జిల్లా నుంచి ఇద్దరు ఇన్‌ఫెక్షన్‌తో మరణించరని, దీంతో వ్యాధి సోకి మృతి చెందిన వారి సంఖ్య 23కు చేరిందని నేషనల్ హెల్త్ మిషన్ నివేదిక పేర్కొంది. కేవలం గత 24 గంటల్లోనే 16 కొత్త కేసులు వెలుగుచూశాయని తెలిపింది. వీటిలో నాలుగు కేసులు నాగోవ్‌లోనూ, నల్బరి, ఉదల్ గిరిలో మూడేసి, శివసాగర్‌లో రెండు, బార్‌పేట, కుమ్రుప్ (మెట్రో), కార్బి ఆంగ్లాంగ్ ఈస్ట్, హొజాయి జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయని నివేదిక చెప్పింది. దీంతో రాష్ట్రంలో జపాన్ ఎన్‌సైఫలైటిస్‌‌ కేసుల సంఖ్య 160కి చేరింది.


కాగా, ప్రజలు జపాన్ ఎన్‌సైఫలైటిస్ (JE), యాక్యూట్ ఎన్‌సైఫలిటిస్ సిండ్రోమ్ (AES) బారిన పడకుండా తక్షణ స్పందన బృందాలను ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల యంత్రాగాలను రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. డైరెక్టరేట్ ఆఫ్ నేషనల్ వెక్టర్ బార్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం నివేదిక ప్రకారం, గత నాలుగేళ్లలో JE, AES కారణంగా రాష్ట్రలో 1,069 మంది ప్రాణాలు కోల్పోయారు. 2018లో 277 మంది, 2019లో 514 మంది, 2020లో 147, 2021లో 131 మంది మృత్యువాత పడ్డారు.

Updated Date - 2022-07-16T20:59:01+05:30 IST