కాంగ్రెస్‌కు అవే చివరి ఎన్నికలు అవుతాయి.. జాగ్రత్త: హెచ్చరించిన దిగ్విజయ్ సింగ్

ABN , First Publish Date - 2022-02-19T23:53:58+05:30 IST

కార్యకర్తలందరూ కలిసి పనిచేయకుంటే 2023 ఎన్నికలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చివరివి

కాంగ్రెస్‌కు అవే చివరి ఎన్నికలు అవుతాయి.. జాగ్రత్త: హెచ్చరించిన దిగ్విజయ్ సింగ్

భోపాల్: కార్యకర్తలందరూ కలిసి పనిచేయకుంటే 2023 ఎన్నికలే మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు చివరివి అవుతాయంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్ హెచ్చరించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో తెగ తిరుగుతోంది. ఆ వీడియోలో ఆయన కాంగ్రెస్ కార్యకర్తలతో మాట్లాడుతూ.. కార్యకర్తలందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేయకుంటే మధ్యప్రదేశ్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలే చివరివి అవుతాయని చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది. 


దిగ్విజయ్ సింగ్ రాట్లాం జిల్లా పర్యటన సందర్భంగా స్థానిక కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఎవరూ ముఖాముఖి మాట్లాడుకోవడం లేదని, ఒకరు ఇక్కడుంటే మరొకరు అక్కడ ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో వ్యక్తి ఇంకెక్కడో ఉంటాడని, పనిచేసే విధానం ఇది కాదని అన్నారు.


‘‘మీరు కలిసికట్టుగా పనిచేయకుంటే ఇవే చివరి అసెంబ్లీ ఎన్నికలు అవుతాయి. నిజాయతీగా పోటీ చేయలేకపోతే ఇంట్లో కూర్చోండి. కాంగ్రెస్ ఇక ఎప్పటికీ అధికారంలోకి రాదు. అప్పుడు కార్యకర్తలు అనేవారు కనిపించరు’’ అని పేర్కొన్నారు. రాట్లాంలో కాంగ్రెస్ కార్యకర్తలు తనను కలిసేందుకు వేర్వేరుగా రావడంతో ఆయన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. 


మధ్యప్రదేశ్‌లో వచ్చే ఏడాది చివరల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2018 ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. అయితే, 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ గూటికి చేరడంతో 15 నెలల తర్వాత కమల్‌నాథ్ ప్రభుత్వం కుప్పకూలింది. 

Read more