శిక్షాకాలం పూర్తికాగానే Abu salem విడుదలకు కేంద్రం కట్టుబడాలి: Supreme court

ABN , First Publish Date - 2022-07-11T21:28:22+05:30 IST

1993 ముంబై పేలుళ్ల కేసులో యావజ్జీవ జైలుశిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేమ్‌ను 25 ఏళ్ల శిక్షాకాలం పూర్తికాగానే..

శిక్షాకాలం పూర్తికాగానే Abu salem విడుదలకు కేంద్రం కట్టుబడాలి: Supreme court

న్యూఢిల్లీ: 1993 ముంబై పేలుళ్ల కేసులో యావజ్జీవ జైలుశిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేమ్‌ను 25 ఏళ్ల శిక్షాకాలం పూర్తికాగానే పోర్చుగీస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీకి కట్టుబడి విడుదల చేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని సుప్రీంకోర్టు సోమవారంనాడు తెలిపింది.


పోర్చుగల్ ప్రభుత్వం 2002లో తనను భారత్‌కు అప్పగించిందని, శిక్షాకాలం 25 ఏళ్లకు మించదని పోర్చుగల్ ప్రభుత్వానికి అప్పట్లో భారత ప్రభుత్వం హామీ ఇచ్చిందని అబూ సలీమ్ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. దీనిపై న్యాయమూర్తులు ఎస్‌కె కౌల్, ఎంఎం సుందరేష్‌తో కూడిన ధర్మాసనం స్పందిస్తూ, అబూ సలేం శిక్షాకాలంపై జాతీయ హామీని పరిగణలోకి తీసుకుని, రాజ్యాంగంలోని 72వ అధికరణం కింద అధికార వినియోగంపై భారత రాష్ట్రపతికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది. ''25 సంవత్సరాలు పూర్తయిన ఒక నెలలో అవసరమైన పత్రాలు ఫార్వార్డ్ అవుతాయి. నిజానికి, 25 ఏళ్ల గడిచిన తర్వాత ఒక నెలలోపు ప్రభుత్వమే సీఆర్‌పీసీ (CRPC) కింద చట్టబద్ధమైన అధికారాన్ని వినియోగించుకోవచ్చు''అని ధర్మాసనం పేర్కొంది.


ముంబైకి చెందిన బిల్టర్ ప్రదీప్ జైన్‌ను 1995లో తన డ్రైవర్ మెహ్నిది హస్సన్‌తో కలిసి హత్య చేసిన మరో కేసులో అబూ సలేమ్‌కు 2015 ఫిబ్రవరిలో టాడా (TADA) కోర్టు యావజ్జీవ జైలుశిక్ష విధించింది. 1993లో ముంబై గొలుసుకట్టు పేలుళ్ల కేసులోనూ సలీం దోషిగా నిర్ధారణ అయింది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం అబూ సలేంను పోర్చుగీసు ప్రభుత్వం 2005 నవంబర్ 11న భారత్‌కు అప్పగించింది.

Updated Date - 2022-07-11T21:28:22+05:30 IST