Supreme Court PMLA Verdict: ఈ తీర్పు చాలా ప్రమాదకరం : ప్రతిపక్షాలు

ABN , First Publish Date - 2022-08-03T22:47:52+05:30 IST

మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)కు 2019లో చేసిన సవరణలను

Supreme Court PMLA Verdict: ఈ తీర్పు చాలా ప్రమాదకరం : ప్రతిపక్షాలు

న్యూఢిల్లీ : మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA)కు 2019లో చేసిన సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు అత్యంత ప్రమాదకరమైనదని దాదాపు 17 ప్రతిపక్ష పార్టీలు హెచ్చరించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate-ఈడీ) వంటి దర్యాప్తు సంస్థలకు అధిక అధికారాలను ఈ చట్టం కట్టబెడుతోందని ఆరోపించాయి. ఈ ప్రమాదకర తీర్పు అంతమైపోయి, రాజ్యాంగ నిబంధనలు త్వరగా అమల్లోకి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాయి. 


సవరించిన పీఎంఎల్ చట్టం ద్వారా ఈడీకి కల్పించిన విస్తృత అధికారాలు చెల్లుబాటవుతాయని సుప్రీంకోర్టు జూలై 27న తీర్పు చెప్పింది. దాదాపు 250 పిటిషన్లపై విచారణ జరిపి ఈ తీర్పునిచ్చింది. అరెస్టు చేసే అధికారం ఉండటం, ‘నేర ప్రతిఫలం’ నిర్వచనం అస్పష్టంగా ఉండటం వల్ల ఈ చట్టం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని పిటిషనర్లు చేసిన ఆరోపణలను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. 


ఈ తీర్పు అత్యంత ప్రమాదకరమైనదని హెచ్చరిస్తూ 17 ప్రతిపక్షాలు ఓ ప్రకటనను విడుదల చేశాయి. దీనిపై కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ (Congress, Trinamool Congress, DMK, Aam Aadmi Party, CPI(M), Samajwadi Party, RJD) తదితర పార్టీల ప్రతినిధులు సంతకాలు చేశారు. 


కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ ఇచ్చిన ట్వీట్‌లో, పీఎంఎల్ఏ, 2002కు సవరణలను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దీర్ఘకాలిక ప్రభావాలపై తీవ్ర భయాందోళనలను వ్యక్తం చేస్తూ ఉమ్మడి ప్రకటనపై టీఎంసీ, ఆప్, ఓ స్వతంత్ర రాజ్యసభ సభ్యుడు సహా 17 ప్రతిపక్ష పార్టీలు సంతకాలు చేశాయని తెలిపారు. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరారు. 


ఈ చట్టాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కొన్ని పార్టీలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ చట్టం ప్రకారం నేర నిర్థరణ జరిగిన కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉందని కూడా తెలిపాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సమక్షంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ హాజరవడంతో ఈ చట్టం దుర్వినియోగంపై మరింత ఆందోళన పెరుగుతోంది. 


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎనిమిదేళ్ళ పాలనా కాలంలో ఈడీ దాడులు అంతకుముందు ప్రభుత్వ కాలంతో పోల్చుకుంటే 26 రెట్లు పెరిగాయి. మనీలాండరింగ్ సంబంధిత సోదాలు 3,010 జరిగాయి కానీ, కేవలం 23 మంది నిందితులపై ఆరోపణలు మాత్రమే రుజువయ్యాయి. 112 దాడుల్లో మనీలాండరింగ్ నిర్ధరణ కాలేదు. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం రాజ్య సభకు తెలిపింది. 


పీఎంఎల్ఏకు సవరణలను పార్లమెంటులో ప్రవేశపెట్టిన తీరును కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సవరణలను ద్రవ్య బిల్లు రూపంలో ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం పార్లమెంటులో ప్రవేశపెట్టినట్లు చెప్పాయి. ఈ ప్రశ్న ఇప్పటికే సుప్రీంకోర్టు సమక్షంలో ఉంది. 


17 ప్రతిపక్షాలు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో, ద్రవ్య బిల్లు ద్వారా ప్రవేశపెట్టిన సవరణలు చట్టరీత్యా సరైనవి కాదని భవిష్యత్తులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పినట్లయితే, మొత్తం కసరత్తు నిష్ఫలమవుతుందని, న్యాయ వ్యవస్థ సమయం వృథా అవుతుందని పేర్కొన్నారు. ఏకీకృత నిధి, పన్నుల నుంచి నిధులను తీసుకోవడానికి మాత్రమే ద్రవ్య బిల్లును ఉపయోగించాలని, ఇతర అంశాల్లో దీనిని వాడుకోకూడదని తెలిపారు. సుప్రీంకోర్టు పట్ల తమకు సమున్నత గౌరవం ఉందన్నారు. ఈ సవరణలను చేపట్టడానికి ద్రవ్య బిల్లును ఉపయోగించుకోవడం సరైనదా? కాదా? అనే అంశంపై విస్తృత ధర్మాసనం తీర్పు వెలువడే వరకు పీఎంఎల్ చట్టంపై తీర్పును వాయిదా వేసి ఉండవలసిందని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ప్రభుత్వాన్ని ఈ సవరణలు మరింత బలోపేతం చేస్తున్నాయని ఆరోపించారు. క్రూరమైన సవరణలకు మద్దతుగా కార్యనిర్వాహక శాఖ చేసిన వాదనలనే సుప్రీంకోర్టు యథాతథంగా పునరుద్ఘాటించిందని, ఇది చాలా నిరాశ కలిగించిందని తెలిపారు. 


ఇదిలావుండగా, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో, మనీలాండరింగ్ ప్రభావం కేవలం మన దేశ సాంఘిక, ఆర్థిక కలనేతను మాత్రమే కాకుండా, ఉగ్రవాదం, మాదక ద్రవ్యాలు వంటి ఇతర అమానుష నేరాలను ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కేసు రిపోర్టు కాపీని నిందితునికి ఇవ్వకుండా ఆ నిందితుడిని అరెస్టు చేసే అధికారాలు రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్లు చేసిన వాదనను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ప్రతి కేసులోనూ ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు (ECIR)ను నిందితునికి అందచేయడం తప్పనిసరి కాదని, ఇది అంతర్గత డాక్యుమెంట్ అని వివరించింది. ECIR అనేది ఎఫ్ఐఆర్‌వంటిదేనని, దీని కాపీని పొందే హక్కు నిందితునికి ఉందని పిటిషనర్లు చేసిన వాదనను కూడా తోసిపుచ్చింది. నిందితుడిని అరెస్టు చేసేటపుడు అందుకు కారణాలను ఈడీ తెలియజేస్తే సరిపోతుందని చెప్పింది. నిరూపణ భారాన్ని నిందితులకు అప్పగించడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేననే వాదనను కూడా తోసిపుచ్చింది. 


కేంద్ర ప్రభుత్వం వాదనలు వినిపిస్తూ, మనీలాండరింగ్ నేరాలు చాలా తీవ్రమైనవని, వీటిని నిరోధించడం సామాజిక అవసరమని, అందువల్ల నిరూపణ భారాన్ని నిందితునికి అప్పగించడం సమర్థనీయమేనని తెలిపింది. 




Updated Date - 2022-08-03T22:47:52+05:30 IST