తెలంగాణకు 13 స్వచ్ఛ గ్రామీణ అవార్డులు

ABN , First Publish Date - 2022-10-03T09:21:26+05:30 IST

తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డుల్లో వివిధ కేటగిరీల్లో 13 అవార్డులు సొంతం చేసుకుంది.

తెలంగాణకు 13 స్వచ్ఛ గ్రామీణ అవార్డులు

అన్ని విభాగాల్లో కలిపి దేశంలోనే ప్రథమ స్థానం.. అత్యుత్తమ జిల్లాల్లో జగిత్యాల, నిజామాబాద్‌

జల్‌ జీవన్‌ పురస్కారం స్వీకరించిన ఈఎన్‌సీ

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ అవార్డుల్లో వివిధ కేటగిరీల్లో 13 అవార్డులు సొంతం చేసుకుంది. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో ఆదివారం తాగునీరు, పారిశుద్ధ్య శాఖ, కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్‌ దివస్‌ వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిఽథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు కేంద్ర మంత్రులు గజేంద్రసింగ్‌ షెకావత్‌, గిరిరాజ్‌ సింగ్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, బిశ్వేశ్వర్‌ తుడు హాజరయ్యారు. గత నెల స్వచ్ఛ భారత్‌ గ్రామీణ మిషన్‌లో భాగంగా కేంద్రం రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామ పంచాయతీలకు అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలంగాణను 13 అవార్డులు వరించాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ ర్యాంకింగ్‌లలో అన్ని విభాగాల్లో కలిపి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. పలు విభాగాల్లో దక్కిన రాష్ట్రస్థాయి అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా తెలంగాణ పంచాయతీరాజ్‌ ప్రిన్సిపల్‌ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ ఎం హన్మంతరావు అందుకున్నారు. అత్యుత్తమ జిల్లాల విభాగంలో జగిత్యాల రెండో స్థానంలో నిలిచింది. నిజామాబాద్‌కు మూడో స్థానం దక్కింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ (ఎస్‌ఎ్‌సజీ) దక్షిణ భారత ఓవరాల్‌ విభాగంలో (సౌత్‌ జోన్‌ ర్యాంకింగ్స్‌) రెండో స్థానంలో నిజామాబాద్‌, మూడో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం నిలిచాయి. స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ ర్యాంకింగ్‌లతో పాటు, వాల్‌ పెయింటింగ్‌, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్‌), వ్యర్థాల నిర్వహణ, గోబర్‌ ధన్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ వంటి కేటగిరీల్లో అవార్డులు వరించాయి. షార్ట్‌ ఫిలిం విభాగంలో ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నూకాలంపాడు గ్రామం ద్వితీయ స్థానాన్ని దక్కించుకుంది. ఈ అవార్డులను తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక కమిషనర్‌ వీఎ్‌సఎన్‌వీ ప్రసాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌ అనిరుధ్‌, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ జి.రవి, నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ చిత్రా మిశ్రా, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ (గ్రామీణ) డైరెక్టర్‌ సి.సురే్‌షబాబు, నూకలంపాడు సర్పంచ్‌ శేషగిరిరావు అందుకున్నారు. 


జల్‌ జీవన్‌ మిషన్‌ పురస్కారం

ఇంటింటికీ క్రమం తప్పకుండా మంచినీరు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు జల్‌జీవన్‌ మిషన్‌ పురస్కారం దక్కింది. ఆదివారం ఢిల్లీలో  కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ చేతులమీదుగా మిషన్‌ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్‌ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. 

Read more