ఆప్‌కు 10కోట్ల జైలు కప్పం కట్టా

ABN , First Publish Date - 2022-11-02T05:36:36+05:30 IST

ఆప్‌లో మంచి పోస్టు ఇస్తామంటూ రూ. 50 కోట్లు, జైలులో తనను ఏమీచేయకుండా ఉండేందుకు రూ. 10 కోట్లు వసూలు చేశారంటూ ఈసీకి ముడుపుల కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ అనే వ్యక్తి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు రాసిన లేఖ కలకలం రేపుతోంది.

ఆప్‌కు 10కోట్ల జైలు కప్పం కట్టా

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు సుకేశ్‌ లేఖ.. జైలు అధికారులపై విచారణకు ఆదేశం

న్యూఢిల్లీ, నవంబరు 1: ఆప్‌లో మంచి పోస్టు ఇస్తామంటూ రూ. 50 కోట్లు, జైలులో తనను ఏమీచేయకుండా ఉండేందుకు రూ. 10 కోట్లు వసూలు చేశారంటూ ఈసీకి ముడుపుల కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న సుకేశ్‌ చంద్రశేఖర్‌ అనే వ్యక్తి ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనాకు రాసిన లేఖ కలకలం రేపుతోంది. గుజరాత్‌ ఎన్నికల ముందు ఈ వ్యవహా రం తెరపైకి రావడంతో రాజకీయ దుమారం రేపుతోంది. అయితే, చంద్రశేఖర్‌ ఒక వంచకుడు అని, ప్రభుత్వంలో ఉన్న పెద్దల పేర్లు, అఽధికారుల పేర్లు చెప్పుకొని మోసాలు చేస్తూ జైలులో ఉన్నాడంటూ ఆప్‌ ఎదురుదాడి చేసింది. ‘‘నాకు 2015 నుంచి ఆప్‌ నేతలు తెలుసు. ఢిల్లీ దక్షిణ ప్రాంత పార్టీ యూనిట్‌లో మంచి పోస్టు ఇస్తామని రూ. 50 కోట్లు గుంజారు. వేరే కేసులో 2017లో నేను తిహార్‌ జైలులో ఉన్నప్పుడు అప్పటి జైళ్ల మంత్రి సత్యేందర్‌ జైన్‌ తరచూ కలిసేవారు. నన్ను జైలులో ఏమీ చేయకుండా ఉండాలంటే నెలకు రూ. రెండు కోట్లు చెల్లించాలని ఆయన బెదిరించారు.

జైన్‌ ఒత్తిడి వల్ల దాదాపు రూ.10 కోట్లు చెల్లించాను’’ అని ఆ లేఖలో సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆరోపించారు. ప్రస్తుతం సుకేశ్‌, జైన్‌ ఇద్దరూ వేర్వేరు కేసుల్లో జైలులోనే ఉండటం గమనార్హం. ‘‘చెల్లింపుల వ్యవహారం గత నెల సీబీఐ అధికారుల దృష్టికి తెచ్చాను. దీనిపై సీబీఐ దర్యాప్తును కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశాను. ఈ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవాలంటూ ఆప్‌ నేతలు నాపై ఒత్తిడి తెస్తున్నారు. వేధింపులకు పాల్పడుతున్నారు’’ అని ఆ లేఖలో చంద్రశేఖర్‌ తెలిపారు. కాగా, లేఖ ఆధారంగా 82 మంది జైలు అధికారులపై విచారణకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశించారు. మరోవైపు సుకేశ్‌ చంద్రశేఖర్‌ ఆరోపణలను ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌.. ఎన్నికల గిమ్మిక్కుగా కొట్టిపడేశారు. గుజరాత్‌ ఎన్నికలముందు జరిగిన మోర్బీ ఘోరవిషాదం నుంచి దృష్టి మళ్లించడానికి చివరకు ఒక మోసగాడిపై ఆధారపడాల్సిన పరిస్థితికి బీజేపీ చేరుకుందంటూ కేజ్రీవాల్‌ ఘాటుగా స్పందించారు. కాగా, అవినీతి వ్యతిరేక నినాదంతో అధికారంలోకి వచ్చిన ఆప్‌ చివరకు జైళ్లను కూడా వదిలిపెట్టలేదని ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షుడు సునీల్‌ విమర్శించారు.

Updated Date - 2022-11-02T05:36:37+05:30 IST