విద్యుదాఘాతంతో హెల్పర్‌ మృతి

ABN , First Publish Date - 2022-09-11T09:52:03+05:30 IST

విద్యుదాఘాతంతో హెల్పర్‌ మృతి

విద్యుదాఘాతంతో హెల్పర్‌ మృతి

ఆరున్నర గంటల పాటు తీగలపైనే మృతదేహం


శామీర్‌పేట, సెప్టెంబరు10: విద్యుత్తు స్తంభంపై మరమ్మతులు చేస్తున్న ఓ హెల్పర్‌ విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యారు. స్థానికుల కథనం ప్రకారం.. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం దేవరయాంజాల గ్రామానికి చెందిన ఇరగళ్ల రాజేంద్రప్రసాద్‌(23) ఆరునెలలుగా ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో విద్యుత్తు హెల్పర్‌గా పనిచేస్తున్నారు. స్థానికంగా ఉండే గోదాముల సమీపంలోని 11కేవీ విద్యుత్తు లైన్‌ జంపర్‌ తెగిపోయి.. సరఫరాలో అంతరాయమేర్పడింది. దాంతో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆనంద్‌, హెల్పర్‌ రాజేంద్రప్రసాద్‌ పరిశీలించారు. సబ్‌-స్టేషన్‌లో లైన్‌-క్లియరెన్స్‌(ఎల్‌సీ) తీసుకుని, విద్యుత్తు ప్రసారం నిలిచిపోయిందని నిర్ధారించుకున్నాక మధ్యాహ్నం 3.30 సమయంలో రాజేంద్రప్రసాద్‌ స్తంభం ఎక్కారు. అయితే.. విద్యుత్తు నిలిచిపోవడంతో.. గోదాముల్లో సిబ్బంది జనరేటర్‌ను ఆన్‌ చేశారు. దీంతో విద్యుత్తు రివర్స్‌ సరఫరా జరిగి.. రాజేంద్రప్రసాద్‌ విద్యుదాఘాతానికి గురై.. అక్కడికక్కడే మృతిచెందారు. రాత్రి 9.30 గంటల వరకు కూడా మృతదేహం విద్యుత్తు తీగలపైనే వేళాడింది. ఈ మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-09-11T09:52:03+05:30 IST