హాస్టల్లో పాముకాటుకు విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-09-11T09:50:06+05:30 IST

హాస్టల్లో పాముకాటుకు విద్యార్థి మృతి

హాస్టల్లో పాముకాటుకు విద్యార్థి మృతి

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో విషాదం

సమీప అడవుల్లోంచి తలుపు సందు గుండా లోపలికి కట్లపాము

ఆ సమయంలో గదిలో నేలపై నిద్రించిన 35 మంది పిల్లలు

వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలి.. హాస్టల్‌ వద్ద తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన 

10 లక్షల పరిహారం.. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ప్రకటించిన స్పీకర్‌ పోచారం 

హాస్టల్‌ వార్డెన్‌ను సస్పెండ్‌ చేసిన కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ వి. పాటిల్‌

బీర్కూర్‌లో మరో ఇద్దరికి పాముకాటు.. ఆస్పత్రికి తరలింపు.. మెరుగ్గానే పరిస్థితి


బీర్కూర్‌, బర్కత్‌పుర, సెప్టెంబరు 10: ఓ హాస్టల్లో పాము కాటుతో విద్యార్థి మృతిచెందాడు. కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లోని బీసీ హాస్టల్‌లో శనివారం ఈ విషాదం జరిగింది. జిల్లాలోని నస్రుల్లాబాద్‌ మండలం దుర్కి గ్రామానికి చెందిన జింక మురళి, గంగామణి దంపతులు వ్యవసాయం చేస్తారు. వీరికి కుమారుడు సాయిరాజ్‌ (10) ఉన్నాడు. బీర్కూర్‌లోని బీసీ బాలుర వసతి గృహంలో సాయిరాజ్‌ ఐదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం రాత్రి సాయిరాజ్‌ హాస్టల్‌లోని తన గదిలో నిద్రించాడు. తెల్లవారుజామున సమీప అటవీ ప్రాంతం నుంచి హాస్టల్‌ గది తలుపు కింది సందు గుండా ఓ కట్లపాటు లోపలికి వచ్చి నిద్రలో ఉన్న సాయిరాజ్‌ను కాటేసింది. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన సాయిరాజ్‌ నిద్రించిన చోటే మృతిచెందాడు. హాస్టల్‌లో మొత్తం 120 మంది విద్యార్థులు ఉండగా.. ఘటన జరిగిన గదిలో ఆ సమయంలో సాయిరాజ్‌ సహా 35 మంది పిల్లలు నిద్రపోయారు. హాస్టల్‌లో మంచాలు లేక అందరూ నేలపైనే పడుకున్నారు. తలుపు సందులోంచి లోపలికి వచ్చిన పాము.. తలుపు సమీపంలోనే నిద్రిస్తున్న సాయిరాజ్‌ను కాటేసింది. తర్వాత గుర్తించిన సిబ్బంది ఆ పామును చంపేశారు. అనంతరం విషయాన్ని వెంటనే  సాయిరాజ్‌ తల్లిదండ్రులకు చేరవేశారు. మృతుడి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో హాస్టల్‌ వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. హాస్టల్‌ వార్డెన్‌, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు మండిపడ్డారు. ఘటన కు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తమకు న్యాయం చేసేంత వరకూ మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని రెండు గంటల పాటు బైఠాయించారు. సీఐ మురళి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా ఘటనా స్థలికి తరలొచ్చారు. కాగా బీర్కూర్‌ ఎంపీపీ రఘు.. జరిగిన ఘటనను స్పీకర్‌ పోచారం శ్రీనివా్‌సరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ జితేశ్‌ వి. పాటిల్‌ దృష్టికి తీసుకెళ్లా రు. స్పీకర్‌, కలెక్టర్‌ వేర్వేరుగా విద్యార్థి తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి సర్ది చెప్పారు. మృతుడి కుటుంబంలో ఒకరికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం, రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని స్పీకర్‌ పోచారం హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. అనంతరం సాయిరాజ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం ని మిత్తం పోలీసులు బాన్సువాడ ఏరియాస్పత్రికి తరలించారు. కాగా.. సాయిరాజ్‌ విద్యార్థి మృతికి బీర్కూర్‌ బీసీ బాలుర వసతి గృహ వార్డెన్‌ సందీప్‌ నిర్లక్ష్యమే కారణమని పేర్కొంటూ వార్డెన్‌ను సస్పెన్షన్‌ చేస్తున్నట్లు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా బీర్కూర్‌ మండల కేంద్రంలో మరో ఇద్దరిని పాము కాటేసింది. శనివారం సాయంత్రం బీర్కూర్‌ గ్రామ పంచాయతీలో పరిసరాలను పరిశుభ్రం చేస్తుండగా జ్యోతి అనే పారిశుధ్య కార్మికురాలు పాము కాటుకు గురైంది. కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫయాజ్‌ అనే వ్యక్తి కూడా పాము కాటుకు గురయ్యాడు. ఇద్దరినీ స్థానికులు 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిద్దరి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. 


నరక కూపాలుగా హాస్టళ్లు, గురుకులాలు

రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖ అనాఽథ శాఖగా మారిపోయిందని, హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోలేని స్థితిలో ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్‌ కృష్ణయ్య ఆరోపించారు. బీర్కూరు బీసీ హాస్టల్లో పాముకాటుతో విద్యార్థి మృతి చెందడం దారుణ ఘటన అని పేర్కొన్నారు. విద్యార్థుల మరణాలను వెంటనే ఆపాలని ఇందుకోసం సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. హాస్టళ్లు, గురుకులాల్లో పూర్తి సదుపాయాలు కల్పించి మరణాలను ఆపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్య మం చేపడతామని హెచ్చరించారు. శనివారం కాచిగూడలోని అభినందన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జకృష్ణ అధ్యక్షతన 16 బీసీ సంఘాల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆర్‌ కృష్ణయ్య మాట్లాడారు. రాష్ట్రంలోని బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలు నరక కూపాలుగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. విష జ్వరాలు, పాముకాటు బారినపడి విద్యార్థులు చనిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. ప్రతి హాస్టల్‌కు మెడికల్‌ అలవెన్స్‌ కింద రూ.50వేలు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖాళీగా ఉన్న వార్డెన్‌, వర్కర్ల పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి హాస్టల్‌కు, గురుకుల పాఠశాలలకు స్టాఫ్‌ నర్సు పోస్టు మంజూరు చేయాలని, ఖాళీగా ఉన్న బీసీ కమిషనర్‌ పోస్టును వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు భవనాల్లో కనీస సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పక్కా భవనాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

Read more