ఏపీ ట్రాన్స్‌కో 1,730 కోట్లు బాకీ

ABN , First Publish Date - 2022-09-11T09:30:25+05:30 IST

ఏపీ ట్రాన్స్‌కో 1,730 కోట్లు బాకీ

ఏపీ ట్రాన్స్‌కో 1,730 కోట్లు బాకీ

బకాయిలు చెల్లించేలా ఆదేశాలు ఇవ్వండి

హైకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ట్రాన్స్‌కో


హైదరాబాద్‌, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ ట్రాన్స్‌కో గ్రాట్యుటీ అండ్‌ పెన్షన్‌ ట్రస్ట్‌, పీఎఫ్‌ ఫండ్‌ ట్రస్ట్‌, ఈఎల్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ ట్రస్ట్‌ తదితర సంస్థల నుంచి రూ.1,730 కోట్ల బకాయిలు రావాలని పేర్కొంటూ టీఎస్‌ ట్రాన్స్‌కో, పెన్షన్‌ అండ్‌ గ్రాట్యుటీ ట్రస్ట్‌, పీఎఫ్‌, లీవ్‌ ఎన్‌క్యా్‌షమెంట్‌ ట్రస్ట్‌లు తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఆస్తులు, అప్పులు పంచుకోవాల్సి ఉండగా వివిధ అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కాలేదని టీఎస్‌ ట్రాన్స్‌కో పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటికే ఎనిమిదేళ్లు గడిచిపోయాయని.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల వల్ల రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఏపీ ట్రాన్స్‌కో, ఇతర సంస్థల నుంచి రావాల్సిన నిధుల కోసం హైకోర్టును ఆశ్రయించక తప్పడం లేదని తెలిపింది. ఇరు రాష్ట్రాల విద్యుత్‌ పంపిణీ సంస్థల మధ్య చాలా వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయని.. సమస్యల పరిష్కారానికి పలు కమిటీల ఎదుట హాజరైనప్పటికీ ఫలితం లేదని వివరించింది. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లయినా ఆస్తులు, అప్పుల పంపకాలు పూర్తి కాలేదని చెప్పింది. విభజన సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల స్థాయిలో పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని.. ప్రస్తుతం టీఎస్‌ ట్రాన్స్‌కో, అనుబంధ సంస్థలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో బకాయిలు క్లెయిమ్‌ చేయక తప్పని పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. టీఎస్‌ ట్రాన్స్‌కోకు రావాల్సిన విద్యుత్‌ ఉద్యోగుల ట్రస్ట్‌ నిధుల బకాయిలను చెల్లించేందుకు ప్రతివాదులు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని ఆరోపించింది. దీనికి సంబంధించి అనేక లేఖలు రాశామని పేర్కొంది. రాష్ట్ర విభజన తర్వాత రిటైర్‌ అయ్యే ఉద్యోగుల నిధులన్నీ ఏపీ ట్రాన్స్‌కో సంస్థల వద్ద ఉండిపోయాయని.. అక్కడి నుంచి నిధులు రాకపోవడంతో టీఎస్‌ ట్రాన్స్‌కో నుంచి చెల్లించాల్సి వస్తోందని పేర్కొన్నది. తద్వారా టీఎస్‌ ట్రాన్స్‌కోపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని తెలిపింది. విద్యుత్‌ పంపిణీ సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలపై షీలా బిడే కమిటీ ప్రతిపాదనలు అమలు కాలేదని తెలిపింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ నవీన్‌రావు, జస్టిస్‌ శ్రీనివా్‌సరావు ఽధర్మాసనం.. వివరణ ఇవ్వాలని ఏపీ ట్రాన్స్‌కో, ఏపీ ట్రాన్స్‌కో ట్రస్టులకు నోటీసులు జారీ చేసింది. కాగా, ఇదే తరహాలో ఏపీ జెన్‌కో నుంచి బకాయిలు రావాలని పేర్కొంటూ టీఎస్‌ జెన్‌కో ఇటీవల పిటిషన్‌లు దాఖలు చేసింది. అన్నీ కలిపి విచారిస్తామన్న ధర్మాసనం.. తదుపరి విచారణను అక్టోబరు 13కు వాయిదా వేసింది. 

Read more