ఆర్కైవ్స్‌లోని పురాతన రాతప్రతులకు మహర్దశ

ABN , First Publish Date - 2022-09-08T10:17:22+05:30 IST

ఆర్కైవ్స్‌లోని పురాతన రాతప్రతులకు మహర్దశ

ఆర్కైవ్స్‌లోని పురాతన రాతప్రతులకు మహర్దశ

  • మరమ్మతు, పరిరక్షణ, డిజిటలైజేషన్‌ చేయనున్న ఇరాన్‌
  • మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం 

హైదరాబాద్‌, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న అరుదైన పురాతన రాతప్రతులకు మహర్దశ పట్టనుంది. వాటిని మరమ్మతు చేసి డిజిటలైజ్‌ చేసేందుకు ఇరాన్‌ ప్రభుత్వం ముం దుకొచ్చింది. తెలంగాణలో 600 ఏళ్ల నాటి ఘన చరిత్రకు సాక్షంగా నిలుస్తున్న ఈ ప్రతులు ఉర్దూ, పర్షియన్‌ భాషల్లో చేతిరాతతో వివిధ రకాలైన పత్రాలపై భద్రపరిచినవి. రాష్ట్ర ఆర్కైవ్స్‌, రిసెర్చి ఇనిస్టిట్యూట్‌లో ఇవి సుమారు 4.3 కోట్లకు పైగా ఉన్నా యి. అరుదైన ఈ చారిత్రక సంపదను ముందు తరాలకు అందించేలాపరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఇరాన్‌ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. శతాబ్దాల క్రితమే భారత్‌, ఇరాన్‌ల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, ఈ ప్రతుల పరిరక్షణకు తమ సంపూర్ణ సహకారం అందిస్తామని ఇరాన్‌ రాయబారి డాక్టర్‌ అలీ చెగేనీ తెలిపారు. దీనికి అయ్యే వ్యయం మొత్తాన్ని కూడా తమ ప్రభుత్వమే భరిస్తుందని ఆయన వెల్లడించారు. గచ్చిబౌలిలోని టీహబ్‌లో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది.


 ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు సమక్షంలో ఢిల్లీలోని ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ నూర్‌ ఇంటర్నేషనల్‌ మైక్రోఫిల్మ్‌ సెంటర్‌తో ప్రభుత్వ ప్రతినిధులు పరస్పర అవగాహన ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా పాలించిన బహమనీ, కుతుబ్‌ షాహీ, ఆదిల్‌ షాహీ, మొఘల్‌ రాజవంశాలకు సంబంధించిన 1406 నాటి అరుదైన, చారిత్రక రికార్డుల సేకరణ తెలంగాణ రాష్ట్ర ఆర్కైవ్స్‌లో ఉందని రాష్ట్ర ఆర్కైవ్స్‌ అండ్‌ రిసెర్చి ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ జరీనా పర్వీన్‌ తెలిపారు. ఇక.. ఈ ప్రతుల పరిరక్షణకు ఇరాన్‌ ప్రభుత్వం ముందుకు రావడాన్ని మంత్రి కేటీఆర్‌ స్వాగతించా రు. భారతదేశం, రాష్ట్రం వద్ద ఉన్న రాతప్రతులు భారత్‌, ఇరాన్‌లకు సంబంధించిన ముఖ్యమైన చారిత్రక కళాఖండాలని ఆయన అన్నారు. ఈ విలువైన ఉమ్మడి వారసత్వాన్ని కాపాడుకోవడం ఇరు దేశాలకు ముఖ్యమ ని ఉద్ఘాటించారు. కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌ రంజన్‌ సహా ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Read more