Vladimir Putin : పుతిన్‌కు తీవ్ర అస్వస్థత?... గులాబీ రంగులోకి మారిన చేయి?...

ABN , First Publish Date - 2022-11-25T11:57:25+05:30 IST

రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని మరోసారి వార్తలు

Vladimir Putin : పుతిన్‌కు తీవ్ర అస్వస్థత?... గులాబీ రంగులోకి మారిన చేయి?...
Vladimir Putin

మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin) తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారని మరోసారి వార్తలు వస్తున్నాయి. క్యూబా దేశాధినేత మిగుయెల్ దియాజ్-కానెల్ వై బెర్మెడెజ్‌తో జరిగిన సమావేశానికి సంబంధించిన వీడియోలో పుతిన్ బలహీనంగా కనిపించారు. ఆయన శరీరం పాలిపోయి, చేయి గులాబీ రంగులో కనిపించాయి. ఈ వీడియోను క్రెమ్లిన వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశారు.

మాస్కోలో క్యూబా విప్లవ నేత ఫిడేల్ కాస్ట్రో కాంస్య విగ్రహావిష్కరణ సందర్భంగా ఈ నేతలిద్దరూ మాట్లాడారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలను ఇరువురు నేతలు ప్రస్తావించారు. అయితే పుతిన్ చాలా బలహీనంగా, అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించారు. ఆయన తన చేతిని కుర్చీకి గట్టిగా అదిమిపెట్టినట్లు కనిపించింది. ఆయన ముఖం వాచినట్లు, ఉబ్బినట్లు, పేలవంగా కనిపించింది.

అంతకుముందు వీడియోల్లో కూడా ఆయన కాళ్లు నిరంతరం వణుకుతున్నట్లు కనిపించింది. ఆయన కేన్సర్ వ్యాధితో బాధపడుతుండవచ్చునని భావిస్తున్నారు. పుతిన్ అనేక వ్యాధులతో బాధపడుతున్నారని, ఉక్రెయిన్‌తో యుద్ధం వల్ల ఆయన తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని గత నెలలో రష్యాలోని ఆయన వ్యతిరేక వర్గం టెలిగ్రామ్ చానల్‌లో ప్రచారం జరిగింది. వచ్చే ఏడాది ఆయన స్వీయ ఏకాంతంలోకి వెళ్లిపోవచ్చునని తెలుస్తోందని ఈ చానల్‌లో చాటింగ్ జరిగింది. ఆయన ఆరోగ్యం పట్ల వైద్యులు, ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నట్లు చెప్తున్నారు.

Updated Date - 2022-11-25T11:57:28+05:30 IST