అన్నవాహిక క్యాన్సర్‌పై వయాగ్రాస్త్రం

ABN , First Publish Date - 2022-10-05T18:42:26+05:30 IST

అంగ స్తంభన సమస్యకు పరిష్కారంగా వాడే వయాగ్రా వంటి ఔషధాలు ఈసోఫేగల్‌ (అన్నవాహిక) క్యాన్సర్‌ కణితులను తగ్గిస్తుందని, ఆ క్యాన్సర్‌తో బాధపడేవారికి ఇచ్చే కీమోథెరపీ

అన్నవాహిక క్యాన్సర్‌పై వయాగ్రాస్త్రం

ఆ ఔషధంతో కుచించుకుపోతున్న కణితులు..

దాంతో కీమోథెరపీ ప్రభావమూ రెండు రెట్లు

యూకే పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి


లండన్‌: అంగ స్తంభన సమస్యకు పరిష్కారంగా వాడే వయాగ్రా వంటి ఔషధాలు ఈసోఫేగల్‌ (అన్నవాహిక) క్యాన్సర్‌ కణితులను తగ్గిస్తుందని, ఆ క్యాన్సర్‌తో బాధపడేవారికి ఇచ్చే కీమోథెరపీ ప్రభావాన్ని రెండు రెట్లు పెంచుతుందని యూకే పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. వయాగ్రా వంటి ఔషధాలను పీడీఈ 5 ఇన్హిబిటర్లుగా వ్యవహరిస్తారు. పీడీఈ 5 అంటే.. ఫాస్ఫోడైస్టిరేజ్‌ టైప్‌ 5 అని అర్థం. ఇవి రక్తనాళాల గోడలను వ్యాకోచింపజేసి.. పురుషాంగానికి రక్తసరఫరా సాఫీగా అయ్యేలా చేస్తాయి. అన్నవాహిక క్యాన్సర్‌ బాధితుల్లో ఈ ఔషధం క్యాన్సర్‌ అసోసియేటెడ్‌ ఫైబ్రోబ్లా్‌స్ట్సను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తాయి. నిజానికి ఫైబ్రోబ్లా్‌స్టలు మన శరీరంలో ఆరోగ్యవంతమైన అనుసంధాన కణజాలాన్ని (కనెక్టివ్‌ టిష్యూల) ఏర్పాటుకు తోడ్పడతాయి. అయితే క్యాన్సర్‌ కణాలు ఒకరకమైన రసాయన సంకేతాలు పంపి ఆ ఫైబ్రోబ్లా్‌స్టలు తమ గుణాన్ని మార్చుకునేలా చేస్తాయి. ఆ సంకేతాలు అందుకున్న ఫైబ్రోబ్లా్‌స్టలు క్యాన్సర్‌ కణితులు పెరగడానికి ఉపకరిస్తాయి.


అంతేకాదు.. కీమోథెరపీ ప్రభావాన్ని నిరోధించే శక్తిని ఆ కణితులకు ఇస్తాయి. అందుకే వాటిని ‘క్యాన్సర్‌ అసోసియేటెడ్‌ ఫైబ్రోబ్లా్‌స్ట్స’గా పిలుస్తారు. క్యాన్సర్‌ బాధితులకు గనక పీడీఈ 5 ఇన్హిబిటర్‌ ఔషధాలు గనక ఇస్తే.. ఆ ఫైబ్రోబ్లా్‌స్టలు క్యాన్సర్‌ కణితులకు సహాయపడడం మానేస్తున్నట్టు పరిశోధకులు ఎలుకలపై చేసిన రిసెర్చ్‌లో గుర్తించారు. త్వరలో మానవులపై కూడా ప్రయోగాలు నిర్వహించే యోచనలో ఉన్నారు. పీడీఈ 5 ఇన్హిబిటర్లు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను నిరోధిస్తున్నట్టు గత ఏడాది డ్యూక్‌ యూనివర్సిటీ (అమెరికా) చేసిన పరిశోధనలో తేలిన నేపథ్యంలో.. యూకే పరిశోధకులు అన్నవాహిక క్యాన్సర్‌పై ఆ ఔషధాల ప్రభావాన్ని పరిశీలించారు.


అన్నవాహిక క్యాన్సర్‌.. గణాంకాలు

ప్రపంచంలో అత్యధికులకు వచ్చే క్యాన్సర్ల జాబితాలో అన్నవాహిక క్యాన్సర్‌ 8వ స్థానంలో ఉంది. మనదేశంలో ఈ జాబితాలో దీనిది నాలుగో స్థానం. ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా 6 లక్షల మంది, మన దేశంలో 40 వేల మందికి పైగా ఈ క్యాన్సర్‌ బారిన పడుతున్నట్టు సమాచారం. ఈ క్యాన్సర్‌ బారినపడి ఐదేళ్లకు మించి బతికేవారి సంఖ్య కేవలం 19 శాతమే. వీరిపై కీమోథెరపీ అంతగా ప్రభావం చూపదు. 

Read more