ఆ మందుల నిషేధం వెనుక కారణమిదే!

ABN , First Publish Date - 2022-09-20T16:40:47+05:30 IST

అసిడిటీ వేధిస్తే అందుబాటులో ఉన్న ర్యాంటాక్‌ మాత్ర మింగేస్తాం. ఇది మనందరం చేసే పనే! కానీ ఇలాంటి కొన్ని సాధారణ మందుల్లో కేన్సర్‌ కారకాలున్నాయనే

ఆ మందుల నిషేధం వెనుక కారణమిదే!

అసిడిటీ వేధిస్తే అందుబాటులో ఉన్న ర్యాంటాక్‌ మాత్ర మింగేస్తాం. ఇది మనందరం చేసే పనే! కానీ ఇలాంటి కొన్ని సాధారణ మందుల్లో కేన్సర్‌ కారకాలున్నాయనే కారణంతో ప్రభుత్వం ఏకంగా 26 మందుల మీద నిషేధం విధించింది. అయితే ఈ మందులన్నీ కేన్సర్‌ను కలిగిస్తాయా? అయితే వాటిని ఇంతకాలం వాడుకున్న వాళ్ల పరిస్థితేంటి? వైద్య నిపుణులు ఏమంటున్నారు?


ఎంతో కాలంగా వాడుకలో ఉన్న మందులను నిషేధించడం వెనకున్న కారణాలను తెలుసుకోవాలంటే, ముందుగా ఆయా మందుల పూర్వాపరాలూ, వాటి పట్ల ఆరోగ్య మంత్రిత్వ శాఖ వ్యవహరించే విధానాల గురించి తెలుసుకోవాలి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు అత్యవసర మందులను పునఃపరిశీలిస్తూ, అందుబాటు ధరల్లో, నాణ్యమైన మందులు ప్రజలకు అందేలా జాతీయ అత్యవసర మందుల జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఇవన్నీ యాంటీ కేన్సర్‌, యాంటీ ఇన్‌ఫెక్టివ్‌, గుండె సంబంధ వ్యాధులు, తీవ్రమైన జబ్బులకు చెంది ఉంటాయి. చివరిసారిగా 2015లో సవరించిన మందుల జాబితాను పునఃపరిశీలించి, ఈసారి మరో 34 కొత్త మందులను జాబితాకు జోడించడం జరిగింది. అలా రూపొందించిన మొత్తం 384 అత్యవసర మందుల్లో 26 మందులను నిషేధించింది. 




మందుల్లోని ఇంప్యూరిటీలే కేన్సర్‌ కారకాలు 

అసిడిటీకి వాడుకునే ర్యాంటాక్‌, క్షయకు వాడే రిఫాబ్యుటిన్‌, ప్రోకార్బ్యుజీన్‌ అనే కేన్సర్‌ మందు, వైట్‌ పెట్రోలియం జెల్లీ మొదలైన సాధారణ మందులను మనం ఎంతో కాలంగా వాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు హఠాత్తుగా వీటిలో కేన్సర్‌ కారకాలున్నాయని ప్రకటించి, నిషేధించడంతో ఇప్పటివరకూ వాటిని వాడుకున్న మనలో ఆందోళన తలెత్తడం సహజం. అయితే నిజానికి వీటిని వాడుకున్నంత మాత్రాన కేన్సర్‌కు గురయ్యే అవకాశాలు ఉంటాయని అనుకోవడం పొరపాటు. ఈ మందుల నిషేధం వెనక ప్రపంచవ్యాప్త పరిశీలన, పరిశోధన సాగుతుంది. ఐరోపా యూనియన్‌, ఔషధాల్లోని కేన్సర్‌ కారకాల ఆధారంగా కొన్ని మందులను ‘కార్సినోజెనిక్స్‌’గా వర్గీకరించినప్పుడు, వాటిని ప్రపంచ దేశాలన్నీ ఎసెన్షియల్‌ మెడిసిన్‌ జాబితా నుంచి తొలగిస్తూ ఉంటాయి. అయితే ఎన్నో భద్రతా ప్రమాణాలతో తయారుచేసే, మందుల్లోకి ఈ కేన్సర్‌ కారకాలు ఎలా చేరుకుంటాయనే అనుమానం కూడా రావచ్చు. కానీ నిజానికి ప్రతి ఔషధ తయారీ ప్రక్రియలో కొన్ని ఇంప్యూరిటీలు మందుల్లోకి చేరుతూ ఉంటాయి. ఉదాహరణకు ర్యాంటాక్‌లో రానిటిడైన్‌ అనే కాంపౌండ్‌ ఉంటుంది. దీన్లోని నైట్రోసోడైమిథైలమీన్‌ (ఎన్‌డిఎమ్‌ఎ) అనే ఇంప్యూరిటీ చేరుతుంది. ఇది ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు కేన్సర్‌ను కలిగించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.




డి.సి.జి.ఐ పాత్ర కీలకం

మందుల నాణ్యతను పరిశీలించే సంస్థ ఇది. మార్కెట్లోని మందుల ప్రభావం ఆధారంగా ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ జాబితాను ఈ సంస్థ కాలానుగుణంగా నవీకరిస్తూ ఉంటుంది. నిరంతరంగా మందులు, వాటి ప్రభావాల మీద నిఘా పెడుతూ, ఏ మందును అనుమాస్పద దృష్టితో గమనించాలి? ఏ మందును నిషేధించవలసి రావచ్చు? అనే విషయాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను అనుసరిస్తూ, చర్యలు చేపడుతూ ఉంటుంది. ఉదాహరణకు పెట్రోలియం జెల్లీ ‘పెట్రోలేటమ్‌’ అనే కాంపౌండ్‌తో తయారవుతుంది. ఈ కాంపౌండ్‌లో చర్మ కేన్సర్‌ కారకాలుంటాయి. కాబట్టి సదరు కాంపౌండ్‌ మీద డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా నియంత్రణ విధిస్తుంది. తాజాగా నిషేధానికి గురైన మందులన్నీ ఈ కోవకు చెందినవే!


ఒక మందు మార్కెట్లోకి విడుదల కావడానికి ముందు జంతువుల మీద ప్రయోగించి, అధ్యయనం చేయడం జరుగుతుంది. తర్వాత హ్యూమన్‌ ట్రయల్స్‌ జరుగుతాయి. అయితే ఇవన్నీ ట్రయల్స్‌ మాత్రమే! మనుషుల చేత ఆ మందులను వాడించి, వాటితో లాభనష్టాలను బేరీజు వేయడం జరుగుతుంది. నష్టం ఉన్నప్పటికీ, నష్టం కంటే లాభం ఎక్కువగా ఉన్న పక్షంలో ఆ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసే అనుమతి ఔషధ సంస్థలకు దక్కుతుంది. అయితే ఆయా మందుల్లో అప్పటికే ఇంప్యూరిటీలు ఉన్నప్పటికీ, వాటి తాలూకు దుష్ప్రభావాలు అప్పటికప్పుడు ట్రయల్స్‌లో బయల్పడే పరిస్థితి ఉండదు. సుదీర్ఘకాలం వాడినప్పుడే, వాటి ప్రభావం కనిపిస్తుంది. అలాగని పదేళ్ల పాటు మనుషుల మీద మందుల ప్రభావాన్ని పరిశీలించి, ఆ తర్వాతే వాటిని విడుదల చేసే పరిస్థితి ఉండదు. ఎంతో కాలంగా వాడుకలో ఉన్న కొన్ని మందుల్లో కేన్సర్‌ కారకాలు ఉన్నాయనే విషయాన్ని ప్రభుత్వం గ్రహించడం జరిగింది కాబట్టే, వాటి మీద హఠాత్తుగా నిషేధం విధించిందని మనం అర్థం చేసుకోవాలి. 


అయితే ఇప్పటివరకూ ఈ మందులను వాడుకున్న వాళ్ల పరిస్థితి ఏంటి? అనే అనుమానం కూడా రావచ్చు. నిజానికి కేన్సర్‌కు దారి తీసే, హై రిస్క్‌ కలిగి ఉన్న ఔషధం మొదట మార్కెట్లోకి విడుదల కాదు. ఒక ఔషధం తయారీకి ముందు అదే ప్రభావాన్ని కలిగి ఉండే వంద రకాల మందులను తయారుచేసి, లాభనష్టాల నిష్పత్తిని బేరీజు వేసి, అంతిమంగా నాణ్యమైన, లాభదాయకమైన, చవకైన మందును మాత్రమే ఔషధ తయారీ సంస్థలు మార్కెట్లోకి విడుదల చేస్తూ ఉంటాయి. కాబట్టి, ఇప్పటివరకూ నిషేధ మందులను వాడుకున్న వాళ్లు కంగారు పడవలసిన అవసరం లేదు. 




భవిష్యత్తులో సైతం....

ప్రస్తుతం వాడుకలో ఉన్న మందుల్లో సైతం కేన్సర్‌ కారకాలు ఉండి ఉండవచ్చు. అయితే ఈ విషయం మరికొన్ని సంవత్సరాలకు నిరూపితమై, ఆయా మందులు నిషేధానికి గురి కావచ్చు. కేన్సర్‌ కారకాలు లేకున్నా, వేరే దుష్ప్రభావం మూలంగా కూడా నిషేధాన్ని ఎదుర్కోవచ్చు. అయితే అంతమాత్రాన ప్రస్తుతం మనం వాడుతున్న మందులన్నీ కేన్సర్‌కు దారి తీస్తాయని భయపడకూడదు. నూటిలో 90 శాతం మందులు అన్ని విధాలా సురక్షితమైనవే! సుదీర్ఘ కాలంలో, ఏదో ఒక మందులో కేన్సర్‌ కారకాలున్నాయని తేలినప్పుడు, ప్రభుత్వం దాన్ని వెంటనే నిషేధించడం జరుగుతుంది. ఉదాహరణకు, అసిడిటీకి వాడుకుంటున్న ర్యాంటాక్‌ మందు వాడుకలోకి వచ్చి దాదాపు 20 ఇరవై ఏళ్లైంది. ఇంత కాలం దాన్లోని కేన్సర్‌ కారకాల ప్రభావం బయల్పడలేదు. ఇన్నేళ్ల తర్వాత ఆ మందుతో ముప్పు ఉందని గ్రహించడం జరిగింది కాబట్టే అది నిషేధానికి గురైంది. పైగా ర్యాంటాక్‌ను మించిన మెరుగైన ప్రభావం, తక్కువ దుష్ప్రభావం కలిగిన ప్రత్యామ్నాయ మందులు అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు కేన్సర్‌ కారకాలున్న ర్యాంటాక్‌ను వాడుకలో ఉంచడం సరైన పని కాదు. ఈ మందు నిషేధానికి గురి కావడానికి ఇది మరొక కారణం. 




యాంటీబయాటిక్‌ రెసిస్టెన్సీ

అత్యవసర ఔషధాల జాబితాలో కొన్ని యాంటీబయాటిక్‌ మందులను జోడించడం కూడా జరిగింది. అలాగే యాంటీబయాటిక్‌ మందుల వాడకం పట్ల కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొన్ని నిబంధనలను సూచించింది. యాంటీబయాటిక్స్‌ను సరైన మోతాదులో, వైద్యులు సూచించినంత కాలం వాడుకోకపోవడం మూలంగా ‘యాంటిబయాటిక్‌ రెసిస్టెన్సీ’ తలెత్తే ప్రమాదం ఉంటుంది. ఏ చిన్న రుగ్మత తలెత్తినా మందుల షాపుకు వెళ్లి, యాంటీబయాటిక్‌ మందులను కొని వాడేసే అలవాటు మనకుంది. ఇది కొవిడ్‌ తర్వాతి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. ఇలా విచక్షణా రహితంగా వాటిని వాడేయడం, రుగ్మత అదుపులోకి రాగానే పూర్తి కోర్సును మధ్యలోనే ఆపేయడం లాంటి పనులు చేయడం వల్ల, ఆర్గానిజమ్స్‌ కొత్త మ్యూటెంట్లుగా పరిణామం చెందుతాయి. వాటితో తలెత్తే ఇన్‌ఫెక్షన్లను అదుపు చేయడం కోసం మరింత శక్తివంతమైన యాంటీబయాటిక్స్‌ వాడవలసి వస్తుంది. ఇదే ధోరణి కొనసాగితే, ఆర్గానిజమ్స్‌ రెసిస్టెన్స్‌ పెంచుకుని, కొత్త మ్యూటెంట్లుగా మారి, మందులకు లొంగని పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి అత్యవసరమై, వైద్యులు సూచించినప్పుడు మాత్రమే యాంటీబయాటిక్స్‌ వాడుకోవాలి. అలాగే ఆ మందులను వైద్యులు సూచించినంత కాలం, సూచించిన మోతాదుల్లోనే వాడుకోవాలి. ఇలా బాధ్యతాయుతంగా వ్యవహరించడం ద్వారా యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ సమస్యను నిర్మూలించగలగుతాం!


-డాక్టర్‌ కిశోర్‌ బి రెడ్డి,

హెచ్‌ఒడి ఆర్థోపెడిక్స్‌ అండ్‌ ఆర్థోపెడిక్‌ ఆంకాలజీ,

ఆమోర్‌ హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.



Updated Date - 2022-09-20T16:40:47+05:30 IST