Kidney Care: ఒకటే కిడ్నీ ఉంటే? అపోహ మాత్రమే!

ABN , First Publish Date - 2022-12-06T10:00:00+05:30 IST

సాధారణంగా వ్యాధుల కారణంగా తొలగించటం వల్ల లేదా పుట్టుకతో కొందరు జీవితాంతం ఒకే కిడ్నీతో మనుగడ సాగించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అది త్వరగా

Kidney Care: ఒకటే కిడ్నీ ఉంటే? అపోహ మాత్రమే!
అపోహ మాత్రమే!

సాధారణంగా వ్యాధుల కారణంగా తొలగించటం వల్ల లేదా పుట్టుకతో కొందరు జీవితాంతం ఒకే కిడ్నీతో మనుగడ సాగించాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు అది త్వరగా ఫెయిలవుతుందని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అది అపోహ మాత్రమే! ఒకటే కిడ్నీతో పుట్టినవాళ్లు నిండు ఆరోగ్యంతో నూరేళ్లు బతకొచ్చు. రెండు ఆరోగ్యవంతమైన కిడ్నీలు ఉండి కూడా 60 ఏళ్లకే పోవచ్చు. కాకపోతే రెండు కిడ్నీలు ఉన్నవాళ్లకున్న అనుకూలత ఏంటంటే వ్యాధుల వల్ల ఒక కిడ్నీ కోల్పోయినా మరో కిడ్నీ ఉంటుంది కాబట్టి జీవితాన్ని వెళ్లదీయవచ్చు. ఒకే కిడ్నీ ఉనవాళ్ల విషయంలో అలా వీలు కాదు. కాబట్టి వాళ్లు ఉన్న ఒక కిడ్నీనీ జాగ్రత్తగా కాపాడుకోవాలి. పుట్టుకతోనే ఒక కిడ్నీ ఉన్నవాళ్లు, వ్యాధుల వల్ల కిడ్నీ పోగొట్టుకుని ఒకే కిడ్నీ మిగిలినవాళ్లు, ఇతరులకు ఒక కిడ్నీ దానం చేసినవాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండటంతోపాటు క్రమంతప్పక చెకప్‌ చేయించుకుంటూ ఉండాలి. రక్తపోటు, మధుమేహాలను అదుపులో ఉంచుకుంటూ మూత్రపిండాలు, యూరిన్‌ ఎగ్జామినేషన్‌, సీరమ్‌ క్రియాటినిన్‌, రక్త పరీక్షలు చేయించుకుంటూ యూరిన్‌లో ప్రొటీన్‌ పోతుందేమో పరీక్షించుకుంటూ ఉండాలి. ఒకటే మూత్రపిండం ఉంటుంది కాబట్టి దాని మీద భారం పడటం సహజం. కాబట్టి ఆ భారాన్ని మూత్రపిండం భరించగలుగుతోందో లేదో ఎప్పటికప్పుడు ఈ పరీక్షల ద్వారా చెక్‌ చేసుకుంటూ ఉండాలి. ఇలా అప్రమత్తంగా ఉంటే ఒకే మూత్రపిండంతో కూడా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.

మూత్రపిండాల ఆరోగ్యం కోసం...

మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించాలి.

  • రక్తపోటు, మధుమేహాలు రాకుండా చూసుకోవటంతోపాటు ఒకవేళ వస్తే వాటిని అదుపులో ఉంచుకోవాలి.

  • రోజుకి 5 నుంచి 6 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు.

  • శరీరంలో నీటి శాతాన్ని సమతులంగా ఉంచాలి. అందుకోసం నీరు ఎక్కువగా తాగాలి. డీహై డ్రేషన్‌కి గురవకుండా చూసుకోవాలి. జీవనశైలి, వాతావరణం, శరీర తత్వం, ఆహారపుటలవాట్ల ఆధారంగా తగినన్ని నీళ్లు తాగుతూ ఉండాలి.

  • ధూమపానం వల్ల మూత్రపిండాలకు రక్త ప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా కిడ్నీల పనితీరు దెబ్బతింటుంది. అలాగే ధూమపానం వల్ల మూత్రపిండాలు క్యాన్సర్‌కు గురయ్యే అవకాశాలు కూడా పెరుగుతాయి. కాబట్టి ధూమపానానికి దూరంగా ఉండాలి.

  • అవసరానికి మించి పెయిన్‌ కిల్లర్స్‌ వాడటం ప్రమాదకరం. ఈ మందులు మూత్రపిండాల్ని ప్రభావితం చేస్తాయి. రక్తంలో కలిసిన ఈ మందుల్ని ఫిల్టర్‌ చేసే క్రమంలో మూత్రపిండాలు ఎక్కువ శ్రమకు గురవుతాయి.

Updated Date - 2022-12-06T10:00:01+05:30 IST