Myths-Facts: పైల్స్‌కు శాశ్వత చికిత్స.. ఎలా అంటే..!

ABN , First Publish Date - 2022-12-06T12:48:32+05:30 IST

పైల్స్‌ సర్జరీ గురించి ఎన్నో అపోహలు ఉంటూ ఉంటాయి. కానీ అనుభవం లేని వైద్యుల చేత సర్జరీ చేయించుకోవటం, సర్జరీ తదనంతర జాగ్రత్తలు పాటించకపోవటమే పైల్స్‌ సర్జరీలో

Myths-Facts: పైల్స్‌కు శాశ్వత చికిత్స.. ఎలా అంటే..!
పైల్స్‌కు శాశ్వత చికిత్స

పైల్స్‌ సర్జరీ గురించి ఎన్నో అపోహలు ఉంటూ ఉంటాయి. కానీ అనుభవం లేని వైద్యుల చేత సర్జరీ చేయించుకోవటం, సర్జరీ తదనంతర జాగ్రత్తలు పాటించకపోవటమే పైల్స్‌ సర్జరీలో అపోహలు ఏర్పడటానికి ప్రధాన కారణాలు! పైల్స్‌కు సంబంధించిన ఆ ప్రధాన అపోహలు ఇవే!

సర్జరీ తర్వాత తిరగబెడతాయి: ఆపరేషన్‌ చేసి తొలగించినా పైల్స్‌ తిరిగొస్తాయి. దీన్లో కొంత వాస్తవం లేకపోలేదు. అయితే అనుభవఙ్ఞులైన వైద్యుల చేత సర్జరీ చేయించుకుని, సర్జరీ తర్వాత తగు జాగ్రత్తలు పాటించగలిగితే రికరెన్స్‌ రేట్‌ తగ్గుతుంది. అలాకాకుండా సర్జరీ తర్వాత కూడా ఎటువంటి ఆహార నియమాలు పాటించకుండా మల విసర్జన మార్గంలోని రక్తనాళాలు ఒత్తిడికి గురయ్యే జీవన విధానాన్నే అవలంబిస్తే తిరిగి పైల్స్‌ తయరవుతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువ తాగుతూ, పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటూ, మాంసాహారం తీసుకున్నప్పుడు లాగ్జేటివ్స్‌ వాడుతూ వైద్యుల సూచనల మేరకు నడుచుకుంటూ ఉంటే సర్జరీ తర్వాత పైల్స్‌ తిరగబెట్టే అవకాశాలు తగ్గుతాయి.

మల మార్గం ఇరుకుగా మారుతుంది: మల మార్గం ఇరుకుగా తయారై విసర్జన కష్టమవుతుందనేది మరొక అపోహ. ఎక్కువ పైల్స్‌ ఉన్నప్పుడు వాటన్నిటినీ ఒకేసారి తొలగిస్తే మల మార్గం కచ్చితంగా ఇరుకుగా మారుతుంది. కాబట్టి తడవకో రెండు చొప్పున గ్యాప్‌ తీసుకుంటూ రెండు మూడు సర్జరీల్లో పైల్స్‌ అన్నిటినీ తొలగిస్తే ఈ సమస్య తలెత్తకుండా ఉంటుంది. అలాగే సర్జరీ తర్వాత వైద్యుల సూచన మేరకు డైలేటర్స్‌ను వాడాల్సి ఉంటుంది. వీటిని వాడితే మల ద్వారం ఇరుకుగా తయారయ్యే ప్రమాదం ఉండదు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తెలిసిన అనుభవమున్న వైద్యులనే సంప్రతించాలి.

మల విసర్జన మీద అదుపు కోల్పోతాం: పైల్స్‌ సర్జరీ తర్వాత మల విసర్జన మీద కంట్రోల్‌ తప్పుతుందని అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతో అరుదైన విషయం. గ్యాస్‌, మలం ఈ రెండిటి మీద కంట్రోల్‌ కోల్పోయే ఫీకల్‌ ఇన్‌కాంటినెన్స్‌ అనే సమస్య పైల్స్‌ ఆపరేషన్‌లో చాలా తక్కువ. అనుభవం లేని వైద్యులు చేసే పైల్స్‌ ఆపరేషన్‌లో మలాన్ని నియంత్రించే స్ప్లింక్టర్స్‌ దెబ్బతిన్నప్పుడు మాత్రమే మలం మీద కంట్రోల్‌ కోల్పోతాం.

Updated Date - 2022-12-06T12:49:04+05:30 IST