బోన్‌ కేన్సర్‌కు ఆధునిక చికిత్స

ABN , First Publish Date - 2022-08-22T20:28:21+05:30 IST

ఎంఎన్‌జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో ఇప్పుడు బోన్‌ కేన్సర్‌కు ఆధునిక చికిత్స అందుతోంది

బోన్‌ కేన్సర్‌కు ఆధునిక చికిత్స

ఎంఎన్‌జేలో అందుబాటులో 3డీ టెక్నాలజీ


హైదరాబాద్‌ సిటీ: ఎంఎన్‌జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌లో ఇప్పుడు బోన్‌ కేన్సర్‌కు ఆధునిక చికిత్స అందుతోంది. 3డీ టెక్నాలజీ ప్రాసెస్‌లో జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ చికిత్సలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇద్దరు రోగులకు ఈ విధానంలో చికిత్సలు అందించారు. ఆధునిక యంత్రాలు అందుబాటులోకి రావడంతో ముందుగానే కేన్సర్‌ను గుర్తించి ఎముకలు తొలగించకుండా చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రోగం ముదిరితే మాత్రం దెబ్బతిన్న ఎముకల భాగాన్ని తొలగించి కృత్రిమ అవయవాలు ఏర్పాటు చేయాలని ఎంఎన్‌జే కేన్సర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆస్పత్రి వైద్యాధికారులు పేర్కొంటున్నారు. 


ఎముకలు తొలగించకుండా..

ఎముకలకు కేన్సర్‌ సోకితే మందులతో నయం కాని పరిస్థితుల్లో వాటిని తొలగించాల్సి ఉంటుంది. లేకపోతే కేన్సర్‌ మిగతా ఎముక భాగాలకు కూడా విస్తరించి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. కేన్సర్‌ సోకిన తుంటి, ఎల్‌బో, భుజం, కీళ్లు, మణికట్టు భాగాల్లో ఎముకలను తొలగించి కృత్రిమ ఎముకను అమర్చాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఎముక ఆకారం, పరిమాణం సరిగ్గా లేకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చేవి. రోగులు అవస్థలు పడాల్సి వచ్చేది. కొన్ని సార్లు మరో సారి సర్జరీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడేవి. ఇప్పుడు 3డీ టెక్నాలజీ ద్వారా తొలగించిన ఎముక మాదిరిగానే అదే ఆకృతి, పరిమాణంలో కృత్రిమ ఎముకను ఏర్పాటు చేస్తున్నారు. కచ్చితమైన కొలతలను తీసుకుని సరిగ్గా అమరేలా కొత్త ఎముకను తయారు చేస్తున్నారు. 


ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయిస్తాం

కేన్సర్‌ సోకిన ఎముకను తొలగించి, కృత్రిమంగా ఏర్పాటు చేయాల్సి వస్తే అది రోగుల కదలికలకు అనువుగా ఉండాలి. బెంగళూర్‌, పుణెల్లో ఆర్డర్‌ ఇచ్చి కృత్రిమ ఎముకను తయారు చేయిస్తున్నాం. ఇక్కడి వైద్యులు దానిని 3డీ ప్రాసె్‌సలో అమరుస్తారు. ఈ విధానానికి కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో రూ. లక్ష నుంచి నాలుగు లక్షల రూపాయల వ్యయం అవుతుంది. ఎంఎన్‌జే ఆస్పత్రిలో ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా ఇలాంటి వైద్యం అందిస్తున్నాం. 

- డాక్టర్‌ జయలత, డైరెక్టర్‌, ఎంఎన్‌జేRead more