50 కోట్ల విలువైన మందులు నేలపాలు!

ABN , First Publish Date - 2022-10-11T15:56:29+05:30 IST

రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో ఓ వైపు మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోట్లాది

50 కోట్ల విలువైన మందులు నేలపాలు!

కాలం చెల్లిన రూ.50 కోట్ల విలువైన ఔషధాలు

రూ.10 కోట్ల మందులకు దగ్గర్లో గడువు తేదీ

కొనుగోలులో ఇష్టారాజ్యం 

కమీషన్లకు అధికారుల కక్కుర్తి

అవసరం లేకపోయినా ఖరీదు

మందులు దొరక్క రోగుల ఇబ్బందులు


హైదరాబాద్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సర్కారు దవాఖానాల్లో ఓ వైపు మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. మరోవైపు అదే ప్రభుత్వ ఆస్పత్రుల్లో కోట్లాది రూపాయల విలువైన మందుల ఎక్స్‌పైరీ తేదీ ముగిసి వృథా అవుతున్నాయి. వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరు చివరి నాటికి అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 550 విభాగాలకు చెందిన రూ.50 కోట్ల విలువైన ఔషధాల ఎక్స్‌పైరీ తేదీ ముగిసింది. ఇవి కాక మరో పది కోట్ల రూపాయల విలువైన మందుల ఎక్స్‌పైరీ తేదీ దగ్గర్లో ఉంది. ఒక్క హైదరాబాద్‌లోని రూ.11.43 కోట్ల ఔషధాల ఎక్స్‌పైరీ తేదీ ముగిసినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ఔషధ కంపెనీలు తమ ఉత్పత్తుల ఎక్స్‌పైరీ గడువు సమీపిస్తే వాటిని వెనక్కు తీసుకుంటాయి. ఈ నేపథ్యంలో వైద్యశాఖలో కోట్ల రూపాయల ఔషధాలు ఎందుకు వృథా అవుతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. 


సీఎంఎస్‌ల మధ్య సమన్వయం ఏది

ఆస్పత్రుల్లో అవసరాన్ని బట్టి వైద్య ఆరోగ్యశాఖ మందులను కొనుగోలు చేయాలి. అయి తే, ఇష్టారాజ్యంగా ఔషఽధాల కొనుగోలు వ్యవహారం నడుస్తుందన్న ఆరోపణలున్నాయి. అవసరం ఉన్నా లేకపోయినా ఒకే రకమైన ఔషధాలను కొనుగోలు చేస్తున్నారు. వాటి ఎక్స్‌పైరీ దగ్గర పడుతున్న సమయంలో అక్కడి నుంచి జిల్లాల్లోని సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌(సీఎంఎ్‌స)లకు పంపుతున్నారు. వాస్తవానికి సీఎంఎ్‌సల మధ్య సమన్వయం ఉండాలి. ఎక్కడ అవసరమైతే అక్కడికి మందులను పరస్పరం సరఫరా చేసుకుంటూ ఔషధాల కాలపరిమితి ముగియకముందే వినియోగించేలా చూడాలి. కానీ క్షేత్రస్థాయిలో అలా జరగడం లేదు.  


బయటి మెడిసిన్స్‌ వద్దు

కమీషన్లకు కక్కుర్తి పడి వైద్యశాఖ అధికారులు అవసరం లేకపోయినా కోట్లాది రూపాయల ఇండెంట్‌ పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. మరోవైపు, కొన్ని ఔషధాలు అవసరమైనా కూడా వాటిపై కమీషన్లు రావనుకుంటే కొనుగోలు చేయడం లేదన్న విమర్శలు ఉ న్నాయి. సర్కారీ ఆస్పత్రుల్లో రోగులకు బయటి మెడిసిన్స్‌ రాస్తే చర్యలు తప్పవని ప్రభు త్వం వైద్యులను హెచ్చరించింది. దీంతో వైద్యులు అందుబాటులో ఉన్న ఔషధాలనే రాస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరమైనా కూడా ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో వాటిని రాయడం లేదు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


కనీస మందులేవి

సర్కారీ దవాఖానాల్లో కనీసంగా ఉండాల్సిన మందులు కూడా దొరకడం లేదు. నొప్పులకు వినియోగించే ఎసిక్లోఫినాక్‌, బలం గోలీలైన బీ కాంప్లెక్స్‌ విత్‌ జింక్‌, యాంటీబయాటిక్స్‌ అయిన అమాక్సిలిన్‌ క్లావమ్‌ సిరప్‌, సెఫిక్సిమ్‌ సిరప్‌, గాయాలకు వినియోగించే పొవిడిన్‌  ఆయిట్‌మెంట్‌, అలా్ట్ర సౌండ్‌ జెల్లీ లాంటివి కూడా అందుబాటులో లేవు. 

Read more