Preganancy Care: పిండం సక్రమంగా ఎదగాలంటే..!

ABN , First Publish Date - 2022-12-13T12:00:52+05:30 IST

గర్భం(Preganancy Care)లో పిండం సక్రమంగా ఎదగాలంటే బిడ్డ పోషణకు సరిపడా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం మాంసకృత్తులు ఎక్కువగా ఉండే

Preganancy Care: పిండం సక్రమంగా ఎదగాలంటే..!
గర్భిణులు ఈ జాగ్రత్తలు పాటించండి

గర్భిణులు - జాగ్రత్తలు

గర్భం(Preganancy Care)లో పిండం సక్రమంగా ఎదగాలంటే బిడ్డ పోషణకు సరిపడా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. ఇందుకోసం మాంసకృత్తులు ఎక్కువగా ఉండే గుడ్లు, మాంసం, చేపలు తినాలి. శాకాహారులైతే బ్రకోలీ, పుట్టగొడుగులు, తృణధాన్యాలు, పప్పులు, నట్స్‌, ఆకుకూరలు తీసుకోవాలి. కాల్షియం సమృద్ధిగా దొరికే పాల ఉత్పత్తులు తప్పనిసరిగా తీసుకోవాలి. నూనె పదార్థాలు, పచ్చళ్లు తగ్గించాలి. అయితే రోజుకి ఎన్ని ప్రొటీన్లు, పిండి పదార్థాలు తీసుకోవాలి? ఇందుకోసం ఎలాంటి పదార్థాలు తినాలి? అనేది కచ్చితంగా తెలుసుకోవటం కోసం డైటీషియన్‌ను సంప్రతించాలి.

గర్భంతో వ్యాయామం: గర్భం దాల్చినంత మాత్రాన వ్యాయామం పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. అలాగని బరువైన, శక్తికి మించిన వ్యాయామాలూ చేయకూడదు. బాగా అలుపొచ్చేలా చేసే వ్యాయామాలకు బదులు వాకింగ్‌, యోగాలాంటి సౌకర్యవంతమైన వ్యాయామాలు చేయవచ్చు. వ్యాయామం చేసే శక్తి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. దాని ఆధారంగా చేయగలిగేంతవరకే వ్యాయామం చేయాలి.

మందులు వాడాలంటే: గర్భిణులు ఇతరత్రా ఆరోగ్య సమస్యల కోసం తీసుకునే మందుల విషయంలో వైద్యుల సూచనలు పాటించాలి. ఎంత చిన్న రుగ్మతకైనా సొంత వైద్యం మానుకుని వైద్యుల సూచన మేరకు నాన్‌ స్టెరాయిడల్‌ మాత్రలనే తీసుకోవాలి. నొప్పుల కోసం పారా సెటమాల్‌ తీసుకోవచ్చు. ఇక గర్భిణులు వాడదగిన యాంటీ బయాటిక్స్‌ వేరుగా ఉంటాయి. వాటిని వైద్యులు మాత్రమే సూచించగలరు. కాబట్టి బ్యాక్టీరియల్‌, వైరల్‌, ఇతరత్రా ఇన్‌ఫెక్షన్ల బారిన పడితే వైద్యులను వెంటనే సంప్రతించాలి.

వేవిళ్లు వేధిస్తే: కొంతమందికి వాంతులు మరీ ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఈ సమస్యకూ మందులున్నాయి. ఈ మందులతో వాంతులు అదుపులోకొస్తాయి. ఒకవేళ నీళ్లు తాగినా వాంతి అయిపోతూ, డీహైడ్రేట్‌ అయిపోయి, బలహీనపడిపోతూ ఉంటే రక్తపరీక్షలు చేసి ‘హైపర్‌ ఎమిసిస్‌’ సమస్యను వైద్యులు నిర్థారిస్తారు. హైపర్‌ ఎమిసిస్‌ ఉంటే దానికి సపోర్టివ్‌ ట్రీట్మెంట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో సమస్య అదుపులోకొస్తుంది.

మధుమేహం, రక్తపోటు ఉన్న గర్భిణులైతే: గర్భానికి ముందే మధుమేహం ఉంటే మందులతో సుగర్‌ను అదుపులో ఉంచుకుంటే గర్భం దాల్చినా సమస్యలు ఎదురవవు. అలాగే అధిక రక్తపోటు కూడా! ఇలాంటి గర్భిణులకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ అవసరానికి తగ్గట్టు ఇన్సులిన్‌ మోతాదులను సరిచేస్తూ చికిత్స తీసుకోవాలి. అలాగే డైటీషియన్‌ను సంప్రదించి ప్రత్యేకమైన ఆహార నియమాలు కూడా పాటించాలి. అలాగే మధుమేహం ఉన్న గర్భిణులకు వ్యాయామం కూడా తప్పనిసరి. వీళ్లకి స్కానింగ్‌లు కూడా ఎక్కువ అవసరమవుతాయి. రక్తపోటు ఉన్నవాళ్లకు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి గర్భంతోపాటే రక్తపోటూ మొదలవుతుంది. హైపర్‌టెన్షన్‌ ఉన్న వాళ్లకు గర్భం దాల్చగానే బిపి మొదలవుతుంది. ఇలాంటి వాళ్లు కూడా వైద్యుల పర్యవేక్షణలో ఉంటూ, మూత్రపిండాలు, కాలేయం పనితీరులను పరీక్షించుకుంటూ ఉండాలి. ఇలాంటివాళ్లకు ఫిట్స్‌ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి వైద్యులను తరచుగా కలుస్తూ, బిపి, రక్తం, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ గర్భంలోని బిడ్డ పెరుగుదలను గమనిస్తూ ఉండాలి.

Updated Date - 2022-12-13T12:02:44+05:30 IST