సైక్లింగ్‌తో లాభాలెన్నో...!

ABN , First Publish Date - 2022-08-25T19:47:43+05:30 IST

ఫిట్‌గా ఉండటానికి అతి ముఖ్యమైన మార్గాల్లో సైక్లింగ్‌ ఒకటి. హార్ట్‌రేట్‌ మెరుగుపరచడంతో పాటు చాలా వరకూ వ్యాయామాలతో పోలిస్తే

సైక్లింగ్‌తో లాభాలెన్నో...!

కరోనా అనంతర కాలంలో నగరవాసుల జీవనశైలి పూర్తిగా మారింది. ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇందుకు సైక్లింగ్‌ను ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. నగరంలో సైక్లింగ్‌ ట్రాక్‌లు పెరుగుతున్నాయి. ప్రభుత్వం వీటిని విస్తరించే యోచనలో ఉంది. కరోనా అనంతర కాలంలో సైకిళ్ల అమ్మకాలు పెరిగాయని పలు సైకిల్‌ షాప్‌ల యజమానులు వెల్లడిస్తున్నారు. ఆరోగ్యం కోసమే కాకుండా పర్యావరణ హితంగానూ సైక్లింగ్‌ ఉంటుందని కొంతమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు చెబుతున్నారు. సైకిల్‌పై ఆఫీస్‌లకు వెళ్లడానికి ఉన్న అవకాశాలనూ అన్వేషిస్తున్నారు. కరోనా విజృంభణ తగ్గినా దాని తీవ్రత కలవరపెడుతున్న వేళ పబ్లిక్‌ ప్రాంగణాల వినియోగం వీలైనంతగా తగ్గించుకోవడానికి నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకోసం సైక్లింగ్‌ ఓ చక్కటి అవకాశమని అల్ఫా వెక్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బైసైకిల్‌ డివిజన్‌ సీఈఓ యోగేంద్ర ఎస్‌ ఉపాధ్యాయ్‌ పేర్కొన్నారు. 


ఫిట్‌గా ఉండటానికి

ఫిట్‌గా ఉండటానికి అతి ముఖ్యమైన మార్గాల్లో సైక్లింగ్‌ ఒకటి. హార్ట్‌రేట్‌ మెరుగుపరచడంతో పాటు చాలా వరకూ వ్యాయామాలతో పోలిస్తే తక్కువ సమయంలో ఎక్కువ కేలరీలు కోల్పోవచ్చు. గంట సైక్లింగ్‌తో 400-1000 కేలరీల శక్తి ఖర్చు చేయవచ్చు. అదే సమయంలో మజిల్‌ నిర్మించుకోవడానికి తోడ్పడుతుంది.


ఊపిరితిత్తుల ఆరోగ్యానికీ...

సైక్లింగ్‌తో ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సాధారణ సమయాల్లో పోలిస్తే సైక్లింగ్‌ చేసినప్పుడు మరింతగా ఆక్సిజన్‌ రక్తంలో కలుస్తుంది. ఎక్కువ సేపు సైక్లింగ్‌ చేస్తే స్టామినా పెరగడంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.


నిద్ర సమస్యలూ దూరం

సైక్లింగ్‌తో రాత్రి పూట చక్కగా నిద్రపోవచ్చు. యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాలోని పరిశోధకులు 20-85 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తులను పరిశోధించి మరీ ఈ విషయం వెల్లడించారు.


మానసిక ఆరోగ్యమూ మెరుగవుతుంది

వ్యాయామాలతో భావోద్వేగాలూ నియంత్రించవచ్చు. రోజూ సైక్లింగ్‌ చేస్తే అది ధ్యానంలా ఉపయోగపడటమే కాదు.... ఏకాగ్రతనూ మెరుగుపరుస్తుందని వైఎంసీఏ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.


ఎంపిక సరైనది కావాలి

సైకిల్‌ కొనుగోలులో జాగ్రత్తలు తీసుకోవాలి. శరీరానికి తగిన రీతిలో ఉందా లేదా చూసుకోవాలి! సైకిల్‌ సీటు వంపు, హ్యాండిల్‌బార్స్‌ ఎత్తు, తదితర వాటిని పరిశీలించాలి. సైకిల్‌ ఎత్తు మరీ ఎక్కువగా లేదంటే మరీ తక్కువగా ఉన్నా ఇబ్బందిగానే ఉంటుంది. ఇక బైక్‌ ఎంచుకునే ముందు చూడాల్సిన మరో అంశం ఏ కారణం కోసం సైక్లింగ్‌ చేస్తున్నారు, ఎలాంటి చోట్ల దాన్ని నడపబోతున్నారో చూసుకోవాలి. నగరంలో ఒకే ఉపరితలం ఎక్కడా కనిపించదు. అంతా ఎగుడు, దిగుడుగానే రోడ్డు ఉంటుంది. ఇలాంటి చోట్ల ఎంటీబీలు (మౌంటెన్‌ బైక్స్‌) కాస్త బెటర్‌ ఆప్షన్‌ అంటున్నారు. ఇటీవల కాలంలో హైబ్రిడ్‌ మోడల్స్‌ వస్తున్నాయి. ఇవి అన్నిచోట్లా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడవచ్చు.


వర్కవుట్‌ సరిగా ఉండాలి...

సైకిల్‌పై ఫిట్‌నెస్‌ అంటే సరైన రిథమ్‌తో వర్క్‌ చేయడం. అంటే స్థిరంగా సైకిల్‌ తొక్కడం. అలా కావాలంటే ట్రాఫిక్‌ తక్కువగా ఉండాలి. ఒడిదుడుకుల రోడ్డు పెద్దగా ఉండకూడదు. ఆ సమయంలో మీ బైక్‌ గేర్స్‌ కూడా అనుకూలంగా ఉండాలి. మీ పెడల్‌ స్ట్రోక్స్‌ నిమిషానికి 80-90 రొటేషన్స్‌గా ఉంటే అది సరైన స్పీడ్‌, అలా కాకుండా నిమిషానికి 60పెడల్‌ స్ట్రోక్స్‌ మాత్రమే ఉంటే గేర్స్‌ కాస్త కఠినంగా ఉన్నాయని అర్థం. 


పర్యావరణ హితం...

సైక్లింగ్‌ వల్ల కర్బన వాయువులు వాతావరణంలో విడుదలవడం తగ్గుతుంది. వాహనాల ఇంధనం కోసం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. 


జాగ్రత్తలు తప్పనిసరి 

సాంకేతిక కాలమిది. ఈ సైకిల్స్‌లోనూ అది కనిపిస్తోంది. కాకపోతే వీటి ఎంపిక మొదలు, వినియోగం వరకూ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనంటున్నారు సైక్లిస్ట్‌లు. వారందిస్తోన్న సూచనలేమిటంటే...


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి)

Read more