Shraddha Walker: విషపూరిత బంధం నుంచి బయటపడలేక..

ABN , First Publish Date - 2022-12-06T07:43:49+05:30 IST

అతన్నుంచి ఏ క్షణమైనా విడిపోవచ్చు. బంధాన్ని తెగతెంపులు చేసుకుని బయటపడవచ్చు. అయినా ఆ అమ్మాయి దెబ్బలు తింటూ, అతని దగ్గరే ఎందుకు ఉండిపోయింది? ప్రియుడి (Aaftab Poonawala) చేతిలో

Shraddha Walker: విషపూరిత బంధం నుంచి బయటపడలేక..
బంధం నుంచి బయటపడలేక..

అతన్నుంచి ఏ క్షణమైనా విడిపోవచ్చు. బంధాన్ని తెగతెంపులు చేసుకుని బయటపడవచ్చు. అయినా ఆ అమ్మాయి దెబ్బలు తింటూ, అతని దగ్గరే ఎందుకు ఉండిపోయింది? ప్రియుడి (Aaftab Poonawala) చేతిలో ప్రాణాలు కోల్పోయిన శ్రద్ధా వాకర్‌(Shraddha Walker)కు సంబంధించి అందర్నీ వేధిస్తున్న ప్రశ్న ఇది. అయితే మనందరికీ తెలియని ఒక అదృశ్య సమస్య ఇలాంటి విషపూరిత బంధాల్లో చిక్కుకుపోయేలా చేస్తుంది. అదే ‘ట్రామా బాండింగ్‌’!

ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌ రెస్పాన్స్‌ గురించి మనందరికీ తెలుసు. ఏదైనా భయానికి లోనైనప్పుడు, మన శరీరం దానంతటదే స్పందిస్తుంది. అయితే వ్యక్తుల్లో ఆ స్పందన ‘ఫ్రైట్‌, ఫ్లైట్‌, ఫ్రీజ్‌, ఫాన్‌.. అనే నాలుగు విధాలుగా ఉంటుంది. కొందరు ఎదిరించి పోరాడితే, ఇంకొందరు ఆ పరిస్థితి నుంచి దూరంగా పారిపోతారు. ఇంకొందరు ఏం చేయాలో అర్థం కాక బిగుసుకుపోతారు. ఇంకొందరు ఆ బాధల నుంచి తప్పించుకోవడం కోసం విపరీతమైన ప్రేమను కురిపిస్తారు. హింస తీవ్రత భరించలేనంత స్థాయికి చేరుకున్నప్పుడు బంధంలోని అనుకూల అంశాల మీదకు మనసును మళ్లించి, ప్రతికూల అంశాలను పక్కన పెట్టేస్తారు. బాధించే వ్యక్తితోనే కలిసి ఉండడం కోసం వారి ప్రవర్తనను ఇతరుల ముందు సమర్ధిస్తారు.

చట్రంలో ఇరుక్కుపోయి...

గొడవ జరిగినప్పుడు ఆ బంధం నుంచి బయటపడాలని ఆలోచించడం, తిరిగి మనసు మార్చుకుని అదే వ్యక్తి మీద ప్రేమ కురిపించడం, ఆ ప్రేమతో మనసు గెలుచుకోవాలనే ప్రయత్నం చేయడం... ఇలా ఆ చట్రం పదే పదే పునరావృతమవుతూ ఉంటుంది. ఫలితంగా ‘అతన్నుంచి నువ్వెప్పటికీ తప్పించుకోలేవు’ అనే దృఢమైన భావనకు లోనవడంతో పాటు, హింసించే వ్యక్తి బాధితులను తన నియంత్రణలో ఉంచుకోవడం కోసం, అతను సృష్టించే ‘అతనికి నేను అవసరం, నాకు అతను అవసరం’... అనే తప్పుడు వాస్తవికతలో బాధితులు చిక్కుకుపోతారు. ఇలాంటి వాతావరణంలో ఎక్కువ కాలం గడిపిన వాళ్లు, స్వీయవిలువ, ఉనికిలను కోల్పోయి, అదే బంధంలో మరింత లోతుకు కూరుకుపోతారు.

ఇది కూడా వ్యసనమే!

డ్రగ్స్‌ బానిసలు ఎలాగైతే ఆ మత్తు కోసం పరితపించిపోతారో, హింస బాధితులు కూడా హింసించే వ్యక్తి ప్రేమాప్యాయతల కోసం పరితపించిపోతారు. ఆ హింస నుంచి తప్పించుకోవడం కోసం, తమ ప్రవర్తనను మార్చుకుంటారు. హింసించే వ్యక్తికి తగ్గట్టు నడుచుకుంటే, తిరిగి తమ బంధం పూర్వ స్థితికి చేరుకుంటుందనే భ్రమలో ఉండిపోతారు. ఇలాంటి ట్రామా బాండింగ్‌లో ‘డొపమైన్‌’ హార్మోన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. గొడవ జరిగిన తర్వాత కొనసాగే స్థబ్దతతో ఒత్తిడి, భయాలు తొలగిపోతాయి. హింసించిన వ్యక్తి చెప్పే క్షమాపణలు, ఇచ్చే బహుమతులు, ప్రదర్శించే శారీరక సాన్నిహిత్యాలు ఉపశమనాన్ని అందించే రివార్డుల్లా ఉపయోగపడి, డోపమైన్‌ విడుదలకు తోడ్పడతాయి. ఈ హ్యాపీ హార్మోన్‌తో బాధితులకు హింసించిన వ్యక్తితో బంధం మరింత బలపడుతుంది. ఫలితంగా బాధితులు, అదే వ్యక్తిని మరింత ప్రేమిస్తూ, వారి ప్రేమను పొందడం కోసం వాళ్లను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తూ ఉండిపోతూ ఉంటారు. శారీరక సాన్నిహిత్యంతో కూడా ఆక్సిటోసిన్‌ అనే ఫీల్‌గుడ్‌ హార్మోన్‌ విడుదలవుతుంది. అనుకూల భావనలకు లోను చేసే ఈ హార్మోన్‌ విడుదలతో, భయాలు తొలగి భరోసా దక్కుతుంది.

ఇలా ఎందుకు?

బాల్యంలో హింసకు గురయిన పిల్లలు, పెరిగి పెద్దయ్యాక అలాంటి అనుబంధాల వైపే ఆకర్షితులవుతూ ఉంటారు. బాల్యంలో అలాంటి హింసల లోటుపాట్ల గురించి వారికి అవగాహన ఉంటుంది కాబట్టి హింసతో కూడిన అనుబంధాలకు వాళ్లు వెనకడుగు వేయరు. కానీ ఇలాంటి తత్వంతో వ్యక్తిగత జీవితాలను నష్టపోయే అవకాశాలు ఎక్కువ. కాబట్టి హింసతో కూడిన బంధంలో చిక్కుకున్న వాళ్లు తమను తాము తరచి చూసుకుని, విషపూరిత బంధం నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.

ఏం చేయాలి?

 • ఇతరుల దృష్టి నుంచి బంధాన్ని విశ్లేషించాలి

 • రోజులో జరిగే ప్రతి సంఘటనకూ అక్షర రూపం ఇచ్చి, హింస తీరును పరీక్షించాలి

 • హింస ఎలా మొదలైందో, అందుకు భాగస్వామి ఇచ్చే వివరణ ఎలా ఉంటుందో గమనించాలి

 • స్నేహితులు, సన్నిహితులు, కుటుంబసభ్యులతో మనసు విప్పి మాట్లాడాలి

 • చేయని తప్పుకు తనను తాను నిందించుకోవడం మానుకోవాలి

 • హింసించే వ్యక్తి లేని జీవితాన్ని ఊహించుకుని బెంబేలు పడడం మానుకోవాలి

 • అన్నిటికంటే ముఖ్యంగా హింస చట్రాన్ని ఛేదించాలి

 • మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి

జోర్నల్‌ ఇలా...

ట్రామా బాండింగ్‌లో చిక్కుకుపోయామని ఎవరికి వారు తెలుసుకోలేనివాళ్లు, అయోమయానికి లోనయ్యేవాళ్లు కొన్ని విషయాలను రాతలో పెట్టాలి. ఏ రోజు సంఘటనలను ఆరోజు పుస్తకంలో రాయడం మొదలుపెడితే, హింస తీరుతెన్నులు, సమస్యల మూలాలు అవగతమవుతాయి. హింసకు గురైన ఆ సమయంలో హింసించిన వ్యక్తి ప్రవర్తనను అర్థం చేసుకోలేకపోయినా, ఇలా రాయడం వల్ల, క్రమేపీ స్పష్టత సమకూరుతుంది. హింసకు గురైనప్పుడు, ఏం జరిగిందో, జరిగిన తర్వాత పరిస్థితిని సర్దుబాటు చేయడం కోసం భాగస్వామి ఎలా ప్రవర్తించాడో స్పష్టంగా రాసుకోవాలి. అలాగే ఇద్దరి మధ్యా ఉన్న బంధాన్ని మూడో వ్యక్తి దృష్టి నుంచి చూడడం అలవాటు చేసుకోవాలి. ఇలా వేరొకరి దృష్టి కోణం నుంచి ఆలోచించడం మొదలుపెడితే, పరిస్థితి తీవ్రత తెలిసొస్తుంది.

స్వీయ నింద వద్దు

హింసకు కారణం తామేనని నిందించుకోవడం వల్ల బంధం నుంచి బయటపడడం కష్టమవుతుంది. కాబట్టి హింస సహజమే అనే అని సర్దుకుపోయేలా చేసే కొన్ని విషయాలను నిర్లక్ష్యం చేయకూడదు. అవేంటంటే...

 • అతను లేని జీవితాన్ని ఊహించుకోలేకపోవడం లేదా ఒంటరితనానికి విపరీతంగా భయపడడం

 • దారికి తెచ్చుకోవచ్చులే అనే భ్రమలో ఉండిపోవడం

 • బంధం తెగతెంపులు చేసుకోగలిగే తెగువ లోపించడం

 • ఆత్మవంచన చేసుకోవడం

తెగతెంపులు ఇలా...

విడిపోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత, ఆ చట్రాన్ని ఛేదించడం కోసం అన్ని రకాల కమ్యూనికేషన్లకూ ఫుల్‌స్టాప్‌ పెట్టేయాలి. సదరు వ్యక్తికి దూరంగా సురక్షితమైన ప్రదేశంలో లేదా కుటుంబంతో కలిసి ఉండాలి. ఫోన్‌ నెంబరు, ఇమెయిల్‌ అడ్రస్‌ లాంటివి మార్చేయాలి. లేదా మొబైల్‌, సోషల్‌ మీడియాల్లో బ్లాక్‌ చేయాలి. ఒకవేళ ఇతర నంబర్ల నుంచి కాల్‌ చేసినా, బ్రతిమిలాడినా పట్టించుకోవడం మానేయాలి. మారిపోతాననీ, థెరపీ తీసుకుంటాననీ, మీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామనీ చెప్పే వాళ్ల మాటలను నమ్మకూడదు. వాళ్లు చేసే కొన్ని ప్రమాణాలు చాలా ఆకట్టుకునేలా ఉంటాయి. ఎన్ని చెప్పినా, కలిసి జీవించడం కుదరదనే మాటకు కట్టుబడి ఉండాలి. ఎంత ప్రయత్నించినా ఇవేవీ సాధ్యపడనప్పుడు అనుభవజ్ఞులైన మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి.

Updated Date - 2022-12-06T07:43:49+05:30 IST

Read more