వీటిని... అనుమానించాల్సిందే! లైట్ తీసుకోవద్దు!

ABN , First Publish Date - 2022-10-04T18:34:45+05:30 IST

రొమ్ము కేన్సర్‌ ప్రాణాలను తీస్తోందంటే, అది కేన్సర్‌ తప్పు కాదు. ఆ వ్యాధిని ముందుగానే గుర్తించి, అప్రమత్తం కాలేని మనదే తప్పు. అన్ని కేన్సర్లలాగే

వీటిని... అనుమానించాల్సిందే! లైట్ తీసుకోవద్దు!

రొమ్ము కేన్సర్‌ ప్రాణాలను తీస్తోందంటే, అది కేన్సర్‌ తప్పు కాదు. ఆ వ్యాధిని ముందుగానే గుర్తించి, అప్రమత్తం కాలేని మనదే తప్పు. అన్ని కేన్సర్లలాగే రొమ్ము కేన్సర్‌ను కూడా ఎంత త్వరగా గుర్తిస్తే, వ్యాధి అంత మెరుగ్గా నయమవుతుంది. మరి మనం ఈ వ్యాధి విషయంలో ఎక్కడ పొరపాటు పడుతున్నాం? 


నెలసరిని ఎదుర్కొనే అమ్మాయిలు మొదలు, పిల్లలకు పాలిచ్చే తల్లుల వరకూ ఏదో ఓ సందర్భంలో రొమ్ముల్లో గడ్డలు వచ్చి, వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. ఈ అనుభవంతో రొమ్ములో గడ్డల పట్ల ప్రత్యేకమైన అనుమానం, భయం స్వతహాగానే మహిళల్లో తక్కువ. ఒకవేళ ఆ రెండు సందర్భాలతో పని లేకుండా, కొత్తగా రొమ్ముల్లో గడ్డలు ఏర్పడితే, ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోడానికి వాళ్లకు సిగ్గు అడ్డు పడుతుంది. ఎలాంటి అసౌకర్యం లేదు కదా, అలాంటప్పుడు కంగారు పడడమెందుకు? అనే భరోసా కూడా కలుగుతుంది. దాంతో క్రమేపీ వ్యాధి తీవ్రమై, చికిత్సకు లొంగని దశకు చేరుకుంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే రొమ్ము కేన్సర్‌ పట్ల అవగాహన పెంచుకోవడం, ఏ సందర్భంలో, ఎంత చిన్న గడ్డ కనిపించినా అప్రమత్తం కావడం అవసరం. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యాధి పట్ల ఉన్న అపోహలు, వాస్తవాలు, అనుమానాలను నివృత్తి చేసుకోవడం అవసరం. రొమ్ము కేన్సర్‌కు సంబంధించిన ప్రతి ప్రశ్నకూ సమాధానాలు తెలుసుకోవడం అత్యంత కీలకం.

 

ప్రశ్న: రొమ్ము కేన్సర్‌ వంశపారంపర్యంగా సంక్రమిస్తుందా? 

జవాబు: ఈ అవకాశం 20ు ఉంది. అయితే ఈ వ్యాధి తల్లి, తండ్రి... ఎవరి వైపు బంధువులకు ఉంది? దూర బంధుత్వమా? వారికి ఎలాంటి కేన్సర్‌ ఉంది? ఇలా వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు ఎన్నో అంశాల మీద ఆధారపడి ఉంటాయి. ఫస్ట్‌ డిగ్రీ, సెకండ్‌ డిగ్రీ... ఇలా బంధుత్వ దూరాన్ని బట్టి బంధువులను వర్గీకరిస్తే.... తల్లి, చెల్లి, కూతురు దగ్గరి రక్త సంబంధీకులు ఫస్ట్‌ డిగ్రీ కోవలోకి వస్తారు. ఈ మహిళలకు వ్యాధి సంక్రమించే అవకాశాలు మిగతావారి కంటే ఎక్కువ. మేనత్తలు, కజిన్స్‌ (వాళ్ల పిల్లలు)... సెకండ్‌ డిగ్రీకి చెందిన బంధుత్వం కలిగిన మహిళలకు వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు కొంత తగ్గుతాయి. కాబట్టి కుటుంబ చరిత్రను బట్టి అవకాశాలను లెక్కించవలసి ఉంటుంది. రొమ్ము కేన్సర్‌లో ట్రిపుల్‌ నెగిటివ్‌ రకానికి వంశపారంపర్యంగా సంక్రమించే అవకాశాలు మరీ ఎక్కువ. కాబట్టి ఈ రకమైన కేన్సర్‌ వంశంలో ఉంటే రెట్టింపు అప్రమత్తత అవసరం. 


ప్రశ్న: కేన్సర్‌ సంక్రమించే అవకాశాలను ముందుగానే కనిపెట్టే పరీక్షలున్నాయా? 

జవాబు: వంశపారంపర్యంగా రొమ్ము కేన్సర్‌ సంక్రమించే వీలున్న మహిళలకు ‘బ్రాకా టెస్ట్‌ (బిఆర్‌సిఎ) ఓ వరం లాంటిది. రొమ్ము కేన్సర్‌కు కారణమయ్యే 1 మరియు 2 జన్యువులను గుర్తించే పరీక్ష ఇది. ఈ పరీక్షతో వ్యాధి వచ్చే అవకాశాన్ని కచ్చితంగా లెక్కించే వీలుంది. ఫలితాన్ని బట్టి, నివారణ చికిత్సలను మొదలు పెట్టి వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు. అయితే వంశపారంపర్యంగా వ్యాధి సంక్రమించే వీలున్న మహిళలు ముందుగా కేన్సర్‌ వైద్య నిపుణుల్ని సంప్రతించి, వ్యాధి సంక్రమించే రిస్క్‌ ఉందనీ, పరీక్ష అవసరమనీ చెబితేనే ఈ పరీక్ష చేయించుకోవాలి. ఫలితం పాజిటివ్‌గా వస్తే మూడు రకాల చికిత్సా పద్ధతులను అనుసరించవలసి ఉంటుంది. మొదటిది.... సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌, ప్రతి 6 నెలలకు స్ర్కీనింగ్‌ (మామోగ్రఫీ, అలా్ట్రసౌండ్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌), క్రమం తప్పకుండా వైద్యులను సంప్రతించడం. రెండవది... రొమ్ము కేన్సర్‌ నుంచి రక్షణ కల్పించే ‘నోటి మాత్ర’! ఈ మాత్రలను వైద్యుల సూచన మేరకు వాడవలసి ఉంటుంది. మూడవ  చికిత్సా పద్ధతి కేన్సర్‌ వచ్చే వీలున్న అవయవాన్ని తొలగించడం. 


ప్రశ్న: రొమ్ము కేన్సర్‌ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

జవాబు: ‘నాకొస్తుందేమో?’ అని భయపడుతూ ఉండడం కంటే ‘నాకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?’ అని ఎవరికి వారు ఆలోచించుకుని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. ప్రతి మహిళా టీనేజీ వయసు నుంచే ‘సెల్ఫ్‌ బ్రెస్ట్‌ ఎగ్జామినేషన్‌’ను జీవితంలో భాగం చేసుకోవాలి. కనీసం నెలలో ఒక్కసారైనా స్నానం చేస్తున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు చేతితో రొమ్ములను పరీక్షించుకోవాలి. ఇందుకోసం ఒక నిమిషం కేటాయించుకోవాలి. ఈ పరీక్షకు అనుకూలమైన సమయం నెలసరి ముగిసిన మూడు రోజుల తర్వాత సమయం. నెలసరికి కొన్ని రోజుల ముందు నుంచి రొమ్ములు గట్టిపడతాయి కాబట్టి ఆ సమయంలో పరీక్షించుకుంటే గడ్డలు ఉన్నాయేమో అనే అనుమానం రావొచ్చు. కాబట్టి నెలసరి ఆగిన తర్వాత స్వీయ పరీక్ష చేసుకోవాలి. 


ప్రశ్న: రొమ్ము కేన్సర్‌ వస్తే, రొమ్మును తొలగించవలసిందేనా? 

జవాబు: చికిత్సలో భాగంగా రొమ్ములోని కేన్సర్‌ గడ్డ మేరకు తొలగించినా, రొమ్ము మొత్తాన్ని తొలగించినా ఒకే రకమైన ఫలితం పొందవచ్చని క్లినికల్‌ ట్రయల్స్‌లో నిరూపణ అయింది. కాబట్టి కేన్సర్‌కు గురయినంత మాత్రాన రొమ్ము మొత్తాన్నీ తొలగించవలసిన అవసరం లేదు. గడ్డ పరిమాణం, గడ్డల సంఖ్య, తత్వం, తీవ్రత, లింఫ్‌ గ్రంథులకు ఏ మేరకు పాకింది అనే అంశాల ఆధారంగా రొమ్ము ఉంచాలా, తీసేయాలా అనేది వైద్యులు నిర్ణయిస్తారు. ప్రధాన లింఫ్‌ గ్రంధికి సోకిందో లేదో తెలుసుకోవడం కోసం సర్జరీ సమయంలోనే లింఫ్‌ గ్రంఽథిలోని కొంత భాగాన్ని ‘సెంటినల్‌ లింఫ్‌ నోడ్‌ బయాప్సీ’ పరీక్ష చేసి, దానికి పాకిందీ, లేనిదీ తెలుసుకోవచ్చు. ఆ ఫలితాన్ని బట్టి ఆ ఒక్క లింఫ్‌ గ్రంథిని మాత్రమే తొలగించి, కీమోథెరపీతో చికిత్స చేయవచ్చు. ఇలా కాకుండా కేన్సర్‌ ముదిరిపోయి, రొమ్ములో రెండు మూడు చోట్ల గడ్డలు ఉన్నా, ఒకే పెద్ద గడ్డ ఉన్నా, గడ్డ కారణంగా రొమ్ము పుండు పడి, పాడైపోయినా రొమ్మును పూర్తిగా తొలగించక తప్పదు. ఇలా తొలగించినా అప్పటికప్పుడు లేదా కేన్సర్‌ చికిత్స పూర్తయిన తర్వాత రొమ్మును పునర్నిర్మించుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో ఆధునిక చికిత్సా పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. 


ప్రశ్న: కుటుంబ చరిత్రలో కేన్సర్‌ లేకపోయినప్పటికీ, కొందరు మహిళలకు ఈ వ్యాధి సంక్రమించడానికి కారణం?

జవాబు: జీవనశైలికీ, రొమ్ము కేన్సర్‌కూ లింక్‌ ఉంది. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం తినడం, శారీరక వ్యాయామం లోపించడం, మద్యపానం, ధూమపానం, ఎక్కువ సమయంపాటు కూర్చుని పని చేసే ఉద్యోగాలు... ఇవన్నీ కేన్సర్‌ కారకాలే! మరీ ముఖ్యంగా జంక్‌ ఫుడ్‌ తినే అలవాటు పెరగడం వల్ల అదనపు కొవ్వులు శరీరంలో పేరుకుపోతున్నాయి. ఫలితంగా కొవ్వులతో సంబంధం కలిగి ఉండే ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్లు రెరడూ ప్రభావితమవుతున్నాయి. ఈ రెండు హార్మోన్ల మధ్య సమతౌల్యం లోపించడం మూలంగా ఆ ప్రభావం మొదట రొమ్ముల మీద పడుతుంది. పర్యవసానంగా రొమ్ము కేన్సర్‌ తలెత్తుతుంది. 

Read more