కర్రీస్‌ పట్ల కేర్‌ ఫుల్‌ అంటున్న వైద్యులు

ABN , First Publish Date - 2022-09-20T21:05:27+05:30 IST

మారుతున్న కాలంతో పాటు మనిషి జీవనశైలీ మారతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేయడమంటే ఓ పెద్ద సవాలే..

కర్రీస్‌ పట్ల కేర్‌ ఫుల్‌ అంటున్న వైద్యులు

హైటెక్‌లో పుట్టగొడుగుల్లా కర్రీ పాయింట్లు  

బిజీ లైఫ్‌ స్టైల్స్‌తో రెడీమేడ్‌ వైపు ఆసక్తి  

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు


మాదాపూర్‌, హైదరాబాద్, సెప్టెంబర్‌ 19 (ఆంధ్రజ్యోతి): మారుతున్న కాలంతో పాటు మనిషి జీవనశైలీ మారతోంది. ఉరుకుల పరుగుల జీవితంలో వంట చేయడమంటే ఓ పెద్ద సవాలే.. బిజీగా ఉండే నగర జీవితంలో రైస్‌ కుక్కర్‌లో బియ్యం పెట్టి పప్పు, కూరలు బయటి నుంచి కొనితెచ్చుకుంటే చాలు ఆ పూట గడిచి పోతుందనే భావన పెరిగిపోయింది. దీంతో నగరంలో కర్రీ పాయింట్ల సంస్కృతి బాగా పెరిగిపోయింది. కర్రీ పాయింట్స్‌లో కూరలు కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోతే ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో రోజురోజుకు కర్రీపాయింట్లను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా మాదాపూర్‌, హైటెక్‌సిటీ, చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి  ప్రాంతాల్లో రెడీమేడ్‌ కూరలకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. మొదట్లో యువతే బయటి నుంచి కూరలు ఎక్కువగా కొనుగోలు చేసేవారు. కానీ ప్రస్తుతం కుటుంబీకులు కూడా కర్రీ పాయింట్లలో కూరలు కొనడానికి మక్కువ చూపుతున్నారు. దీంతో వంటల్లో ప్రావీణ్యం ఉన్న వారు స్వయం ఉపాది కోసం కర్రీ పాయింట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. తక్కువ పెట్టుబడితో లాభాలు బాగానే ఉండటంతో ఎక్కువ మంది కర్రీపాయింట్లు ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. 


యువతే అధికం

మాదాపూర్‌, హైటెక్‌సిటీ ప్రాంతాల్లో ఐటీ సంస్థలు, వివిధ రకాల విద్యా సంస్థలు, ప్రైవేట్‌ కార్యాలయాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఇక్కడ ఉద్యోగులు, విద్యార్థులు ఎక్కువగానే ఉన్నారు. దీంతో రోడ్డు పక్కన పలు ప్రాంతాల్లో కర్రీపాయింట్లు అధికంగా వెలుస్తున్నాయి. రోటి పచ్చడి నుంచి ఆకుకూరలు, కూరగాయలు, మాంసం, చేపలు, పీతలు, రొయ్యలు వంటి కూరలు సైతం అందుబాటులో ఉంటున్నాయి. కర్రీని రూ.25 నుంచి రూ.30 వరకు, మాంసం కూరలు రూ.60 నుంచి రూ.70 వరకు విక్రయిస్తున్నారు. 


అప్రమత్తత అవసరం

  • కర్రీ పాయింట్లలో కూరలు కొనుగోలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే డబ్బులిచ్చి రోగ్యాలు కొనుక్కున్నట్లేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
  • కూరల వంటకు వాడే నిత్యావసర సరుకులు, నూనె నాణ్యవంతమైనవా, కాదా అనేది పరిశీలించుకోవాలి. నాసిరకం సరుకులు వినియోగించే చోట కూరలు కొనుగోలు చేయకుంటేనే మేలు. 
  • రసాయనాలు, హానికరమైన రంగులు వినియోగిస్తున్నారా లేదా అనేది గమనించాలి. వండిన కూరలపై మూతలు వేసి ఉన్నచోటే కొనుగోలు చేయాలి.
  • వేడివేడి కూరలు, సాంబరు వంటివి ప్లాస్టిక్‌ కవర్లలో ప్యాకింగ్‌ చేసినవి కాకుండా నేరుగా స్టీల్‌ క్యాన్లలో, బాక్సుల్లో వేయించుకోవడం మంచిది. 

వండుకునే ఇబ్బంది ఉండదు

పనిగట్టుకుని మార్కెట్లకు వెళ్లి కూరలు తెచ్చుకుని వాటిని కట్‌ చేసి ఒకరిద్దరి కోసం వండుకోవాలంటే కష్టంతో పాటు సమయం ఎక్కువ పడుతుంది. అలాకాకుండా కర్రీపాయింట్ల వద్ద మనకు నచ్చిన కూరలు దొరుకుతున్నాయి. కొనుకుని తెచ్చుకుంటే వండుకునే ఇబ్బంది ఉండదు. 

- శ్రీనివాస్‌, విద్యార్థి 


సమయం దొరక్క..

నేను ఓ ప్రైవేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాను. ఉదయం ఆఫీసుకు వెళ్లి తిరిగొచ్చే సరికి రాత్రి అవుతుంది. గదికి వచ్చాక వంట చేసుకోవాలంటే చాలా సమయం పడుతుంది. దీంతో బయట తిందామంటే ఎక్కువ ఖర్చువుతుంది. కాబట్టి అన్నం వండుకుని కూరలు కూరలు బయటి నుంచి తెచ్చుకుని తింటున్నాం. దీంతో సమయం, శ్రమ ఆదా అవుతుంది. 

- యాదగిరి, ప్రైవేట్‌ ఉద్యోగి

Read more