Sperm count: మగవాళ్లు ఈ విషయంలో జాగ్రత్త...!

ABN , First Publish Date - 2022-11-22T10:52:03+05:30 IST

మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్త పురుషుల్లో(Mens) కాలక్రమేణా వీర్యకణాల సంఖ్య(Sperm count) క్షీణిస్తోంది. ఆ తరుగు పురుషుల్లో వంధత్వంతో పాటు, ఆరోగ్య నష్టానికీ దారి తీస్తుంది. కాబట్టి స్పెర్మ్‌ కౌంట్‌ క్షీణతను నియంత్రించే

Sperm count: మగవాళ్లు ఈ విషయంలో జాగ్రత్త...!
మగవాళ్లు జాగ్రత్త...!

మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్త పురుషుల్లో(Mens) కాలక్రమేణా వీర్యకణాల సంఖ్య(Sperm count) క్షీణిస్తోంది. ఆ తరుగు పురుషుల్లో వంధత్వంతో పాటు, ఆరోగ్య నష్టానికీ దారి తీస్తుంది. కాబట్టి స్పెర్మ్‌ కౌంట్‌ క్షీణతను నియంత్రించే మార్గాలు, పాటించవలసిన నియమాల గురించి వైద్యులు(Doctors) ఏమంటున్నారో తెలుసుకుందాం!

వీర్యకణాల ఉత్పత్తి ప్రధానంగా ఆహార, జీవనశైలులు, అలవాట్లు, పర్యావరణం, పరిసరాల మీద ఆధారపడి ఉంటుంది. తినే ఆహారంలో కల్తీలు, ప్లాస్టిక్‌ ఉపయోగం, పురుగుమందులు, బయటి ఆహారం, పోషకాల లోపం... ఇలా ఎన్నో అంశాలు వీర్యం మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి.

ప్లాస్టిక్‌ వినియోగం: దైనందిన జీవితంలో వాడుకునే వస్తువుల్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్‌వే ఉంటున్నాయి. ప్లాస్టిక్‌లో వేర్వేరు విషపూరిత రసాయనాలతో పాటు ‘బిస్ఫినాల్‌’ అనే ప్రమాదకరమైన రసాయనం ఉంటుంది. ఈ రసాయనాలన్నీ శరీరంలోని హార్మోన్లను హెచ్చుతగ్గులకు లోను చేసేవే! బిస్ఫినాల్‌, వీర్య ఉత్పత్తికి తోడ్పడే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని క్షీణించేలా చేస్తుంది. ఫలితంగా వీర్యకణాల సంఖ్య క్షీణిస్తుంది. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిళ్లు, టీ, కాఫీ కప్పులు, కర్రీ పాయింట్లలో కూరలు పార్సిల్‌ చేసే ప్లాస్టిక్‌ కవర్లు, నీళ్ల బక్కెట్లు, కూల్‌ డ్రింక్‌ బాటిళ్లు... వీటన్నింట్లో బిస్ఫినాల్‌ ఉంటుంది. వేడి లేదా ఎండ సోకినప్పుడు, వాటిలోని ఈ బిస్ఫినాల్‌ కరిగి ద్రవాలు, పదార్థాల్లో కలిసి, మన శరీరాల్లోకి చేరుతుంది.

పురుగుమందులు: కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల తోటల చీడపీడలను వదిలించడం కోసం పురుగుమందుల వాడకం పెరిగింది. వీటిని సక్రమంగా శుభ్రం చేయకుండా తీసుకోవడం ద్వారా ప్రమాదకర రసాయనాలు శరీరాల్లోకి చేరుకుని హార్మోన్ల అసమతౌల్యానికి కారణమవుతాయి.

మాంసాహారం: జీవజాతులు బరువు పెరగడం కోసం, త్వరగా ఎదగడం కోసం, పాల ఉత్పత్తుల కోసం వాటికి హార్మోన్‌ ఇంజెక్షన్లు ఇస్తూ ఉంటారు. వాటి ఉత్పత్తులను తినడం ద్వారా ఆ హార్మోన్లు మన శరీరాల్లోకి చేరుకుని, హార్మోన్‌ పెరుగుదలకు దారి తీస్తాయి.

ఆహార కల్తీలు: పదార్థాల పరిమాణంతో పాటు, వాటి రంగు, రుచులను పెంచడం కోసం కలిపే కల్తీ పదార్థాలు కూడా స్పెర్మ్‌ కౌంట్‌ మీద ప్రభావం చూపిస్తాయి.

బయటి భోజనం: హోటళ్లు, రెస్టారెంట్లలో తయారయ్యే పదార్థాల్లో కల్తీ నూనెలు, దినుసుల వాడకం ఎక్కువ. వీటి వల్ల వీర్య ఉత్పత్తి కుంటు పడుతుంది.

వృత్తుల ద్వారా...

కొన్ని వృత్తులు కూడా వీర్యకణాల ఉత్పత్తిని క్షీణింపచేస్తాయి. అవేంటంటే...

పరిశ్రమలు: వేడితో కూడిన పరిశ్రమల్ల్లో, గనుల్లో పనిచేసేవాళ్లు ఆ వేడి మూలంగా, ప్లాస్టిక్‌ పరిశ్రమల్లో పనిచేసేవాళ్లు వాటిలోని రసాయనాల మూలంగా వీర్యకణాలను నష్టపోతూ ఉంటారు. అలాగే ఫార్మా లేదా రసాయన పరిశ్రమల్లో వెలువడే ఫ్యూమ్స్‌ మూలంగా కూడా నష్టం ఎక్కువగా జరుగుతుంది.

కొలిమి, వంట గదులు: వంట గదుల్లో ఎక్కువ సమయాల పాటు గడిపే వంటవాళ్లు, కొలిమి లేదా హీటర్ల దగ్గర పనిచేసే పనివాళ్లు ఎక్కువ వేడికి ఎక్స్‌పోజ్‌ అవడం వల్ల ఆ ప్రభావం వీర్యకణాల మీద పడుతుంది.

రేడియేషన్‌: డయాగ్నొస్కిట్‌ సెంటర్లలోని స్కానింగ్‌ విభాగాల్లో పనిచేసే టెక్నీషియన్లు, హెల్పర్లు ఎక్కువగా రేడియేషన్‌కు గురవుతూ ఉంటారు. రేడియేషన్‌ ప్రభావం మూలంగా స్పెర్మ్‌కౌంట్‌ తగ్గుతుంది.

సెల్‌ టవర్స్‌: వీటికి చేరువగా నివసించేవారికీ స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గుతుంది.

Untitled-2-copy.gif

అలవాట్ల ద్వారా...

కొన్ని అలవాట్ల వల్ల కూడా వృషణాలు వేడెక్కి, వీర్యవృద్ధి క్షీణిస్తుంది. అవేంటంటే...

బిగుతైన జీన్స్‌: ఎక్కువ సమయాల పాటు గాలి చొరబడని జీన్స్‌ ప్యాంట్లు ధరించడం వల్ల, వృషణాల దగ్గర వేడి పెరిగిపోయి, ఆ ప్రభావం వీర్య ఉత్పత్తిని దెబ్బతీస్తుంది. వృషణాల ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి మించి ఒక్క డిగ్రీ పెరిగినా, వృషణాలు 30 నుంచి 40 శాతం మేరకు డ్యామేజీ అవుతాయి.

కూర్చుని పని చేయడం: ఎక్కువ సమయాల పాటు కూర్చుని పని చేయడం వల్ల వృషణాలకు గాలి సోకే వీలుండదు, కాబట్టి ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత పెరిగి వృషణాలు దెబ్బతింటాయి.

వేడి నీటి స్నానం: వేడి నీటి స్నానం కొంత మేరకు నష్టం కలిగిస్తుంది. ఒంటి మీద పోసుకోవడం వల్ల నష్టం ఉండకపోయినా, ఆ వేడినీళ్లు టెస్టి్‌సకు నేరుగా తగిలితే నష్టం తప్పదు. అలాగే వేడి నీటితో నింపిన బాత్‌ టబ్‌లో మునిగి ఉండడమూ మంచిది కాదు.

ఒడిలో ల్యాప్‌టాప్‌: ఒడిలో ల్యాప్‌టాప్‌ పెట్టుకుని పని చేసే అలవాటును మానుకోవడం మేలు.

బైక్‌ జర్నీ: ఎక్కువ దూరాల పాటు గేర్‌ బైక్‌ మీద ప్రయాణించే సమయంలో, పెట్రోల్‌ ట్యాంకుకు, సీటు దగ్గరగా ఉండడం వల్ల టెస్టిస్‌ ఒరుసుకుపోతూ ఉంటాయి. ఇలా రోజులో రెండు, మూడు గంటలు ప్రయాణించవలసిన అవసరం ఉన్నవాళ్లు స్కూటీ లాంటి వెహికల్‌ను ఎంచుకోవడం ఉత్తమం.

చికిత్సలతో : హెయిర్‌ లాస్‌ చికిత్సలో వాడే కొన్ని మందుల ప్రభావం వల్ల టెస్టోస్టిరాన్‌ ఉత్పత్తి తగ్గి, వీర్యకణాల సంఖ్య క్షీణించే అవకాశం ఉంటుంది.

health02pix-data-path.gif

ధూమపానం, మద్యపానం: ధూమపానంతో సూక్ష్మరక్తనాళాలు డ్యామేజ్‌ అవుతాయి. ఫలితంగా టెస్టి్‌సకు రక్తప్రసరణ కుంటుపడుతుంది. అలాగే సిగరెట్లలోని రసాయనాలు హార్మోన్ల ఉత్పత్తిని అస్తవ్యస్థం చేస్తాయి. అలాగే మద్యపానంతో శరీరంలోని హార్మోన్లు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. కాబట్టి ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండాలి.

నిద్రలేమి: రాత్రుళ్లు ఎక్కువ సమయాలు మేలుకోవడం వల్ల ప్రొలాక్టిన్‌ హార్మోన్‌ పెరిగి, మిగతా హార్మోన్ల ఉత్పత్తి తగ్గి వీర్యకణాల ఉత్పత్తి సన్నగిల్లుతుంది.

పోషక లోపం: ఎండ సోకకపోవడం వల్ల విటమిన్‌ డి లోపం, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల విటమిన్‌ బి12 లోపాలు కూడా స్పెర్మ్‌ కౌంట్‌ క్షీణకు దారి తీస్తాయి.

iStock-1128459526.gif

నియంత్రణ ఇలా....

  • కూరగాయలు, పండ్లను ఒకటికి రెండు సార్లు ఎక్కువ నీళ్లతో కడిగి శుభ్రం చేసుకుని తీసుకోవాలి.

  • బిగుతైన దుస్తులకు బదులుగా గాలి చొరబడే వీలున్న ప్యాంట్లు, లోదుస్తులు దరించాలి.

  • ప్లాస్టిక్‌ ప్యాకెట్లలో ఉండే ప్యాకేజ్‌డ్‌ పదార్థాలు తినకూడదు.

  • రోజూ 8 గంటలకు సరిపడా నిద్ర పోవాలి.

  • ఇంటి భోజనానికే ప్రాధాన్యం ఇవ్వాలి.

  • గోరువెచ్చని నీళ్లతోనే స్నానం చేయాలి.

  • దురలవాట్లకు దూరంగా ఉండాలి.

  • ప్లాస్టిక్‌కు బదులుగా స్టీలు, గాజుతో తయారైన పాత్రలను ఉపయోగించాలి.

  • సురక్షితమైన ‘బిపిఎ ఫ్రీ’ ప్టాస్టిక్‌ ఉత్పత్తులనే పదార్థాల నిల్వకు ఉపయోగించాలి.

  • పదార్థాలను స్టీలు బాక్సుల్లో పార్సిల్‌ చేయించుకోవాలి.

  • ఎక్స్‌రే, లేదా రేడియేషన్‌ విభాగాల్లో పనిచేసే వాళ్లు రేడియేషన్‌ సోకకుండా ప్రొటెక్షన్‌ యాప్రాన్స్‌ ధరించాలి.

చికిత్సలున్నాయి

వీర్యకణాల సంఖ్యను సరిదిద్దాలంటే, హెచ్చుతగ్గులకు లోనైన హార్మోన్లను సరిదిద్దుకోవాలి. టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రోజన్‌, ప్రొలాక్టిన్‌ హార్మోన్లను సాధారణ స్థాయికి తీసుకువచ్చే చికిత్సతో స్పెర్మ్‌ కౌంట్‌ మెరుగు పడుతుంది. కొందర్లో థైరాయుడ్‌ హార్మోన్‌ సమస్యలూ ఉంటాయి. వాటిని కూడా సరిదిద్దుకోవాలి. మరికొందర్లో విటమిన్‌ డి, విటమిన్‌ బి12 లోపాల మూలంగా స్పెర్మ్‌ కౌంట్‌ తగ్గవచ్చు. కాబట్టి ఆ లోపాలను కూడా సరి చేసుకోవాలి.

సేంద్రీయ ఉత్పత్తులేనా?

మనం కొంటున్న సేంద్రీయ ఉత్పత్తులన్నీ నిజంగానే సేంద్రీయమైనవేనా? నిజానికి పంట భూమిలోని పురుగుమందులు, ఎరువు అవశేషాలు పూర్తిగా అంతరించాలంటే, అందుకు కనీసం మూడేళ్ల పాటు ఎటువంటి ఎరువులు, పురుగు మందుల వాడకం లేకుండా పంటలను పండించి, ఆ తర్వాతి పంటలనే వాడుకోవడం మొదలుపెట్టాలి. అలాగే పొరుగు పొలాల ప్రభావం పడకుండా వాటికి దూరంగా పంటలను సాగు చేయాలి. కానీ ఈ జాగ్రత్తలన్నీ ఎంతమంది పాటిస్తూ ఉంటారు? కేవలం పురుగుమందులను వాడకుండా పండించిన పంటలన్నీ సేంద్రీయమైనవే అనుకుంటే పొరపాటు. పై జాగ్రత్తలన్నీ పాటించి, పండించిన పంటలే పూర్తి సేంద్రీయమైనవి.

చికెన్‌ తింటే వేడి చేయదు

మాంసాహారంలో ప్రధానంగా చికెన్‌ శరీరానికి వేడి అనీ, దానికి దూరంగా ఉండేవాళ్లు ఎక్కువ. కానీ ఇది అపోహ మాత్రమే! నిజానికి చికెన్‌ తినడం వల్ల విటమిన్‌ బి12 లోపం తలెత్తదు. కాబట్టి వీర్యకణాల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది.

సిట్రస్‌ పళ్లు మేలు

నిమ్మజాతి పండ్లు తినడం వల్ల స్పెర్మ్‌ కౌంట్‌ పెరుగుతుంది. కాబట్టి నిమ్మ, బత్తాయి, నారింజ పండ్లు తరచూ తీసుకుంటూ ఉండాలి. అలాగే అవకాడొ, పుచ్చ, జామ పండ్లలో హార్మోన్‌ బూస్టర్లు ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకుంటూ ఉండాలి.

‘సానా’ వద్దు

బరువును తగ్గించే చికిత్సలో భాగంగా స్టీమ్‌ బాత్‌ను పోలిన ‘సానా’ చికిత్సలు వాడుకలోకొచ్చాయి. కానీ సానాలో టెస్టి్‌సకు సోకే వేడి ఆవిరితో వీర్య ఉత్పత్తి తగ్గుతుంది.

dr--rahul-reddy.gif

-డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి,

ఆండ్రాలజిస్ట్‌, ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-11-22T10:52:04+05:30 IST