కృత్రిమ తీపికారకాలు మంచివేనా?

ABN , First Publish Date - 2022-12-04T12:07:39+05:30 IST

మామూలు చక్కెర, బెల్లం, తేనె లాంటి తీపి పదార్థాల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. దీనికి కారణం పిండి పదార్థాలు. ఇవి రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని పెంచుతాయి కూడా...

కృత్రిమ తీపికారకాలు మంచివేనా?

ఇంట్లో తయారు చేసే తీపి పదార్థాల్లో చక్కెరకు బదులుగా కృత్రిమ

తీపికారకాలు (artificial sweeteners) వాడవచ్చా? వీటివల్ల ఏవైనా నష్టాలుంటాయా?

మామూలు చక్కెర, బెల్లం, తేనె లాంటి తీపి పదార్థాల్లో క్యాలరీలు అధికంగా ఉంటాయి. దీనికి కారణం పిండి పదార్థాలు. ఇవి రక్తంలో గ్లూకోజు పరిమాణాన్ని పెంచుతాయి కూడా. కృత్రిమ తీపికారకాలలో క్యాలరీలు చాలా తక్కువ. అంతేకాకుండా రక్తంలో గ్లూకోజునూ పెంచవు. చక్కెరతో పోలిస్తే ఈ కృత్రిమ తీపికారకాలు తక్కువ మోతాదుల్లోనే ఎక్కువ తీయదనాన్నిస్తాయి. కాబట్టి మితంగా వాడినా తీపి సరిపోతుంది. ఆస్పార్టెమ్‌, సాకారిన్‌, సుక్రాలోస్‌, స్టీవియా మొదలైన కృత్రిమ తీపికారకాలు మార్కెట్లో లభిస్తున్నాయి. ఇవి కొన్ని రకాల జన్యుపరమైన వ్యాధులు ఉన్నవారికి, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికీ మంచిది కాదు. వారు కేవలం వైద్యుల సలహాతో మాత్రమే వీటిని వాడాలి. మిగిలిన వారు టీ, కాఫీ, ఇంట్లో తయారు చేసే చిరుతిళ్ళు (స్వీట్లు) మొదలైన వాటిలో ఈ కృత్రిమ తీపికారకాలు వాడవచ్చు. కానీ మోతాదు మించకూడదు. ఒక్కో రకమైన కృత్రిమ తీపికారకానికి ఒక్కొక్క పరిమితి ఉంటుంది. దానిని మించకుండా వాడవచ్చు. స్వీటు,్ల చిరుతిళ్ళు కేవలం వాటిలోని చక్కెర వల్ల మాత్రమే కాకుండా వాటిలోని కొవ్వు, పిండి పదార్థాల వల్ల కూడా క్యాలరీలను ఎక్కువ కలిగి ఉంటాయి. కాబట్టి చక్కెర ప్రత్యామ్నా యాలు వాడినంత మాత్రాన స్వీట్లు ఆరోగ్యకరమైనవిగా మారిపోవు. ఎప్పుడైనా ఎటువంటి ఆహారమైనా ఎవరైనా మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.

- శ్రీనివాస పట్నాయక్‌, విశాఖపట్టణం

మేము రోజు రాత్రిళ్లు జొన్న రొట్టెలే తినేందుకు ఇష్టపడతాం. జొన్న రొట్టెలు అన్ని వయసుల వారూ తినొచ్చా?

బియ్యం, గోధుమల ప్రత్యామ్నాయంగా జొన్నలను అన్నంగానూ, జొన్న రొట్టెల్లానూ వాడవచ్చు. వందగ్రాముల జొన్నల్లో దాదాపు 330 క్యాలరీలు, 11 గ్రాముల ప్రోటీన్లు, 70 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. జొన్నల్లో పీచుపదార్థం కూడా ఎక్కువే. జొన్నల్లోనూ, ఈ పిండిలోనూ విటమిన్‌ బి1, బి6, కాపర్‌, ఐరన్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌, పొటాషియం, జింక్‌ మొదలైన పోషకాలుంటాయి. ఈ పోషకాలన్నీ శరీరంలోని జీవవ్యవస్థలు సరిగా పనిచేయడానికి, బలమైన నరాలకు, చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు, ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గించేందుకు ఇలా వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. జొన్నల్లో గ్లూటెన్‌ అనే పదార్థం లేకపోవడం వల్ల గోధుమలు పడనీ వారికి, గ్లూటెన్‌ ఎలర్జీ ఉన్నవారికీ కూడా జొన్న రొట్టెలు మంచి ప్రత్యామ్నాయం. జొన్నలు అందరికీ మంచిదే. అన్ని వయసుల వారు రోజు వారీ ఆహారంలో వాడుకోవచ్చు.

- సుశీల, బెంగళూరు

మా పాపకు రెండేళ్లు. మంచి ఆహారపు అలవాట్లు నేర్పడం ఎలా?

రెండేళ్ల వయసు దగ్గరపడేకొద్దీ పిల్లల ఆహారపు అలవాట్లు మారుతూ ఉంటాయి. ఎదుగుదల వేగంలో మార్పులు రావడం వల్ల ఆకలి మందగిస్తుంది కూడా. ఆటలమీదే ధ్యాస ఉంటుంది కాబట్టి ఆహారాన్ని ఇష్టంగా తీసుకునే అవకాశాలు తక్కువ. రెండు నుంచి నాలుగేళ్ల వయసు పిల్లల ఆహారపు అలవాట్లను గమనించేప్పుడు వారు ఒకరోజు తీసుకునే ఆహారాన్ని బట్టి వారి ఆకలిని నిర్ణయించకుండా వారమంతా ఎలా తింటున్నారో గమనించాలి. వారికొక్కరికే విడిగా ఆహారం ఇవ్వకుండా కుటుంబ సభ్యులెవరైనా వారితో కలిసి ఆహారం తీసుకోవాలి. పిల్లలు ఇంట్లోవారి ఆహారపు అలవాట్లను, వారు ఆహారం గురించి చెప్పే మాటలను బట్టి కూడా కొన్ని రకాల ఆహార పదార్థాలపై మక్కువ లేదా అయిష్టత ఏర్పరచుకుంటారు. వారికోసం ప్రత్యేకమైన ఆహారాన్ని వండకుండా కుటుంబమంతా తీసుకునే ఆహారాన్నే వారికి ఇవ్వాలి. వారి ఆకలిని బట్టి మాత్రమే ఆహారం ఇవ్వాలి. ఒకవేళ తినకపోతే బలవంతపెట్టడం, బెదిరించడం, ఏవైనా ఇష్టమైన వస్తువులు ఆశచూపడం లాంటి పద్ధతులు మానుకోవాలి. నిర్దేశించిన సమయాల్లో మాత్రమే ఆహారాన్ని ఇవ్వాలి. ఆ సమయంలో తినలేదు కాబట్టి ఓ గంట తరువాత వారు కోరిన ఆహారాన్ని ఇవ్వడం అనేది అలవాటు చెయ్యకూడదు. తిరిగి నిర్దేశిత సమయంలోనే ఆహారాన్ని ఇవ్వాలి. ఈ వయసులో పిల్లలకు కొత్త రుచులను కొత్త ఆహార పదార్థాలను అలవాటు చెయ్యాలంటే ఆ కొత్త పదార్థ్ధాన్ని కనీసం పదిహేను సార్లైనా రుచి చూసిన తరువాత కానీ ఇష్టపడేందుకు అవకాశం లేదు అన్నది గుర్తుంచుకోవాలి. ఒకసారి వద్దన్నా ఇంకోసారి ఆ పదార్థాన్ని తినిపించేందుకు ప్రయత్నించాలి.

- మధువని, నాగర్‌కర్నూల్

Updated Date - 2022-12-04T12:08:21+05:30 IST