SALT: ఉప్పు డబ్బా తీసేయండి ప్లీజ్‌!.. లేదంటే..!

ABN , First Publish Date - 2022-12-05T11:17:32+05:30 IST

మాంచిగా ఉప్పూ, కారం, మసాలా దట్టించిన ఆహారం తినడానికి కూర్చుంటాం. కొందరికి ఆ ఉప్పు కూడా సరిపోదు. డైనింగ్‌టేబుల్‌ మీద ఉండే ఉప్పు డబ్బా తీసుకుని అన్నం మీద జల్లేసుకుంటారు! మరికొందరికి

SALT: ఉప్పు డబ్బా తీసేయండి ప్లీజ్‌!.. లేదంటే..!
ఉప్పు డబ్బా తీసేయండి ప్లీజ్‌!

అన్నం తినేటప్పుడు అదనంగా వేసుకునే ఉప్పు ముప్పే

వాషింగ్టన్‌, డిసెంబరు 4: మాంచిగా ఉప్పూ, కారం, మసాలా దట్టించిన ఆహారం తినడానికి కూర్చుంటాం. కొందరికి ఆ ఉప్పు కూడా సరిపోదు. డైనింగ్‌టేబుల్‌ మీద ఉండే ఉప్పు డబ్బా తీసుకుని అన్నం మీద జల్లేసుకుంటారు! మరికొందరికి పెరుగన్నంలో ఉప్పు పడకపోతే తిన్నట్టు ఉండదు. మీరు కూడా అలాగే చేస్తారా? చేయొద్దని.. డైనింగ్‌ టేబుల్‌ మీద ఉండే ఉప్పు డబ్బాను అర్జెంటుగా అక్కణ్నుంచీ తీసేయాలని.. ‘ద అమెరికన్‌ కాలేజ్‌ ఆప్‌ కార్డియాలజీ’ పరిశోధకులు బతిమాలుతున్నారు. వండిన పదార్థాల్లో వేసిన ఉప్పు మాట ఎలా ఉన్నా.. తినేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకోనివారికి గుండెపోటు, హృద్రోగాలు, పక్షవాతం వచ్చే ముప్పు తగ్గిందని వారి అధ్యయనంలో తేలింది. యూకేలో బయోబ్యాంక్‌కు చెందిన 1,76,750 మంది పేషెంట్ల ఆహారపుటలవాట్లను, వారి ఆరోగ్య సమస్యలను 11.8 సంవత్సరాలపాటు పరిశీలించారు. అదనంగా ఉప్పు వేసుకున్న 7 వేల మందికి గుండెపోటు రాగా, రెండు వేల మంది పక్షవాతం బారిన పడ్డారు. ‘‘వ్యక్తుల జీవనశైలి ఎలా ఉన్నా, ఇప్పటికే ఇతరవ్యాధులున్నా.. భోజనం చేసేటప్పుడు అదనంగా ఉప్పు వేసుకోనివారిలో హృద్రోగ సమస్యలు చాలా తక్కువ ఉన్నట్టు మేం గమనించాం’’ అని స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసిన్‌ (న్యూ ఆర్లీన్స్‌) ప్రొఫెసర్‌ డాక్టర్‌ లు చీ స్పష్టం చేశారు. ఇలా విడిగా ఉప్పు వేసుకోవడం మానేసిన వారికి అధికరక్తపోటు, హృద్రోగాల ముప్పు తగ్గినట్టు ఆయన వెల్లడించారు.

డ్యాష్‌ డైట్‌ అంటే..?

డ్యాష్‌ డైట్‌ అంటే.. డయటరీ అప్రోచెస్‌ టు స్టాప్‌ హైపర్‌ టెన్షన్‌ అని అర్థం. ఈ డైట్‌లో భాగంగా ఆహారపదార్థాల్లో వేసే ఉప్పు తగ్గిస్తారు. పంచదార, సంతృప్త కొవ్వులు ఉండే పదార్థాలు తినడం బాగా తగ్గిస్తారు. దీంతోపాటు.. పండ్లు, కూరగాయలు, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, ఎండు ఫలాలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుంటారు.

5 గ్రాములు

ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. 5 గ్రాముల ఉప్పులో ఉండే 2300 మిల్లీగ్రాముల సోడియం మన శరీర అవసరాలకు చాలు. కానీ, మన ఆహారపు ఆలవాట్ల కారణంగా రోజుకు సగటున 10 గ్రాముల ఉప్పు తింటామని అంచనా. ప్యాకేజ్డ్‌ ఆహారపదార్థాల్లో ఉప్పు మోతాదు చాలా ఎక్కువ. కాబట్టి పిల్లలకు పండ్లు తినడం నేర్పించాలి.

ఉప్పు.. మితంగా మంచిదే!

అధికరక్తపోటు భయంతో చాలా మంది ఉప్పును బాగా తగ్గించేస్తారు. అది కూడా మంచిది కాదు. మనశరీరంలో ద్రవాలను సమతూకంగా ఉంచడంలో సోడియం పాత్ర చాలా కీలకమైనది. మనం తినే ఉప్పులో ఉండే సోడియం 40 శాతం, క్లోరిన్‌ 60 శాతం ఉంటాయి. సోడియానికి నీటిని ఆకర్షించే గుణం ఉంటుంది. ఉప్పు ఎక్కువగా తింటే.. అందులో ఉండే సోడియం అది రక్తనాళాల్లో ఎక్కువగా ద్రవాలు చేరడానికి కారణమవుతుంది. దీనివల్ల రక్తపోటు పెరిగిపోతుంది. అందుకే ఉప్పు తగ్గించాలని రక్తపోటు బాధితులకు వైద్యులు సూచిస్తారు.

Updated Date - 2022-12-05T11:17:33+05:30 IST