గోవాలో ఖాతా తెరవని టీఎంసీ

ABN , First Publish Date - 2022-03-10T21:34:15+05:30 IST

స్వయంగా మమతా బెనర్జీయే రెండు సార్లు గోవాకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక పార్టీకి చెందిన బెంగాల్ నేతలు గోవాలోనే మకాం వేసి తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కించారు..

గోవాలో ఖాతా తెరవని టీఎంసీ

పనాజీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మూడోసారి ఘన విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ.. అదే ఉత్సాహంతో బెంగాల్ దాటి విస్తరించేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా త్రిపుర, గోవా రాష్ట్రాలను మొదటగా ఎంచుకుని విపక్ష పార్టీల్లోని లీడర్లను తమ పార్టీలో చేర్చుకుంటూ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. గోవా కాంగ్రెస్‌లోని కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగింది. ఈసారి ఎన్నికల్లో టీఎంసీ బాగానే ప్రభావం చూపుతుందేమో అన్నంత హడావుడి జరిగింది.


స్వయంగా మమతా బెనర్జీయే రెండు సార్లు గోవాకు వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక పార్టీకి చెందిన బెంగాల్ నేతలు గోవాలోనే మకాం వేసి తరుచూ ఏవేవో కార్యక్రమాలు చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కించారు. అయితే ఇది కొంత వరకు ఓట్లను సమీకరించినప్పటికీ ఒక్క సీటు గెలవలేకపోయారు. 40 స్థానాలున్న అసెంబ్లీలో మమతా బెనర్జీ పార్టీ అసలు ఖాతానే తెరవలేకపోయింది. ఓట్లు మాత్రం 5.21శాతం సంపాదించింది (సాయంత్రం 3 గంటల వరకు తేలిన లెక్క ప్రకారం). వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్న మమతా బెనర్జీకి గోవా ఫలితం నిరాశనే మిగిల్చింది.

Read more