Arvind Kejriwal: సూరత్‌లో అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌ షోపై రాళ్ల దాడి

ABN , First Publish Date - 2022-11-28T19:16:03+05:30 IST

గుజరాత్ ఎన్నికల (Gujarat Election) ప్రచారంలో భాగంగా సూరత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) నిర్వహించిన

Arvind Kejriwal: సూరత్‌లో అరవింద్ కేజ్రీవాల్ రోడ్‌ షోపై రాళ్ల దాడి
Arvind Kejriwal

సూరత్: గుజరాత్ ఎన్నికల (Gujarat Election) ప్రచారంలో భాగంగా సూరత్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) నిర్వహించిన రోడ్ షోలో భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో ఓ రాయి ఆయన వైపు దూసుకొచ్చింది. ఈ ఘటన తర్వాత ఆప్ అభ్యర్థి అల్పేష్ కత్రియా మాట్లాడుతూ ఆ రాయిని బీజేపీ గూండాలే విసిరారని ఆరోపించారు. ప్రజలు కేజ్రీవాల్‌కు పుష్పాలు చూపిస్తూ ఆహ్వానిస్తుంటే, బీజేపీ గూండాలు రాళ్లు విసిరుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ దాడిపై కేజ్రీవాల్ మాట్లాడుతూ.. తానేం తప్పు చేశానని వారు నా కన్ను పగలగొడతారని ప్రశ్నించారు. తాను స్కూళ్లు, ఆసుపత్రులు కట్టిస్తానని చెబుతున్నానని అన్నారు. కావాలంటే మీరు (బీజేపీ) చేసిన పనేంటో చూపించాలని, అంతేకానీ ఇలా ఆడపోసుకోవడం, దాడులకు పాల్పడడం తగదని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్ చీఫ్ గోపాల్ ఇటాలియా ట్విట్టర్‌లో ఓ వీడియోను షేర్ చేస్తూ రాయి దాడిలో ఓ చిన్నారి గాయపడినట్టు పేర్కొన్నారు. కతర్‌గామ్ అసెంబ్లీ స్థానాన్ని కోల్పోతామన్న భయంతోనే బీజేపీ ఈ రోజు తన బహిరంగ సభలో రాళ్లు విసిరిందని, ఆ రాయి తగిలి ఓ చిన్నారికి గాయమైందని పేర్కొన్నారు.

గుజరాత్‌లో తమ పార్టీకి మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని కేజ్రీవాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 182 స్థానాలకు గాను 92 స్థానాల్లో ఆప్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ అంటే భయం వల్ల మహిళలు, యువత బయటకు చెప్పలేకపోవచ్చు కానీ వారు ఓటు వేసేది తమకేనని ఢిల్లీ సీఎం చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-11-28T19:16:39+05:30 IST