పంజాబ్ ఎన్నికలు: ఓడిపోయిన తండ్రీకొడుకులు

ABN , First Publish Date - 2022-03-10T23:53:46+05:30 IST

పంజాబ్‌లో ఈసారి సీనియర్ నేతలంతా ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ ఒకేసారి ఓడిపోవడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్...

పంజాబ్ ఎన్నికలు: ఓడిపోయిన తండ్రీకొడుకులు

చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తండ్రీకొడుకులు ఇద్దరూ ఓటమి పాలయ్యారు. శిరోమణి అకాలీదళ్ నేత, మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్‌తో పాటు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ పరాజయం పాలయ్యారు. పంజాబ్‌కు ఐదుసార్లు ముఖ్యమంత్రి అయిన ప్రకాష్ సింగ్ బాదల్, లంబి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కుడియాన్ చేతిలో ఘోర ఓటమి పాలయ్యారు. ఇక సుఖ్‌బీర్ సైతం ఆప్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. జలాలాబాద్ నుంచి పోటీ చేసిన ఆయనను ఆప్ అభ్యర్థి జగ్‌దీప్ కాంబోజ్ ఓడించారు.


పంజాబ్‌లో ఈసారి సీనియర్ నేతలంతా ఓటమి పాలయ్యారు. ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అందరూ ఒకేసారి ఓడిపోవడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, ప్రస్తుత ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ, పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. ఇలా వరుస పెడుతూ సీనియర్లంతా ఓటమి పాలయ్యారు. పంజాబ్ సీనియర్లందరినీ జూనియర్లైన ఆప్ అభ్యర్థులు ఓడించారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపును వీరి ఓటమిని ప్రస్తావిస్తూ ‘పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. ఆమ్ ఆద్మీలు గెలిచారు’ అంటూ నెటిజెన్లు ట్రోల్స్ వేస్తున్నారు.

Read more