Gujarat Polls : ఏడోసారి గెలవాలన్న కలల సాకారం బీజేపీకి అంత తేలిక కాదు!

ABN , First Publish Date - 2022-11-22T13:43:59+05:30 IST

గుజరాత్‌లో వరుసగా ఏడోసారి గెలవాలని భారతీయ జనతా పార్టీ (BJP) కలలు కంటోంది. ఈ కలలను సాకారం చేసుకోవడం కోసం

Gujarat Polls : ఏడోసారి గెలవాలన్న కలల సాకారం బీజేపీకి అంత తేలిక కాదు!
Gujarat Assembly Elections

న్యూఢిల్లీ : గుజరాత్‌లో వరుసగా ఏడోసారి గెలవాలని భారతీయ జనతా పార్టీ (BJP) కలలు కంటోంది. ఈ కలలను సాకారం చేసుకోవడం కోసం, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) మాదిరిగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించింది. కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించింది. గడచిన తొమ్మిది నెలల నుంచి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. అంతటితో ఆగకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రమనే సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. మరోవైపు హిందుత్వ బలాన్ని కూడా ఉపయోగించుకుంటోంది. అయితే 2007లో వచ్చినట్లుగా అత్యధిక ఓట్ల తేడాతో ఆ పార్టీ గెలిచే అవకాశాలు లేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

డిసెంబరు 1, 5 తేదీల్లో జరిగే గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధాన పోటీదారులు. ఆమ్ ఆద్మీ పార్టీ చాప క్రింద నీరులా పట్టణ ప్రాంతాల్లో చొచ్చుకుపోతోందని కొందరు చెప్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌కు సంప్రదాయ ఓటర్ల అండదండలు ఉన్నాయంటున్నారు. అయితే ఆరుసార్లు అంటే 27 సంవత్సరాల నుంచి అధికారంలో ఉండటం వల్ల బీజేపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు భయం పట్టుకుంది. దీంతో పాటిదార్లను మచ్చిక చేసుకోవడం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్ర నేత అమిత్ షా (Amit Shah) ఇటీవల ఓ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మళ్లీ భూపేంద్ర పటేల్‌నే ముఖ్యమంత్రిగా కొనసాగిస్తామని చెప్పారు. అంటే ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించారన్నమాట. బీజేపీ ఈ విధంగా సీఎం అభ్యర్థిని అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రకటిస్తుందన్న సంగతి తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇసుదాన్ గధ్వీ (Isudan Gadhvi)ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. పంజాబ్‌లో ఈ విధంగా ప్రకటించి భారీ విజయాన్ని సాధించింది. కాంగ్రెస్ (Congress) మాత్రం ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకూడదని నిర్ణయించుకుంది.

2017లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో బీజేపీ (BJP) విజయం సాధించినప్పటికీ, 182 స్థానాల్లో 99 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగింది. కాంగ్రెస్ 77 స్థానాలతో బలపడింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) దూకుడుగా ప్రచారం చేస్తూ, బీజేపీని దీటుగా సవాలు చేయగలిగేది తానేనని చెప్పుకుంటోంది. అయితే ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాత్రమే ఉందని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.

పాటిదార్లను బుజ్జగించే యత్నాలు

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)కి సామాన్య ప్రజానీకంలో మంచి పేరు ఉండటం, పాటిదార్లకు రిజర్వేషన్ల కోసం జరిగిన ఆందోళనకు నాయకత్వం వహించిన హార్దిక్ పటేల్ (Hardik Patel) బీజేపీలో చేరిపోవడం ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమని చెప్తున్నారు. 2017లో పాటిదార్లు (Patidars) బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పోలింగ్ బూత్ స్థాయి వరకు సంస్థాగతంగా బలపడటం, డబుల్ ఇంజిన్ అభివృద్ధి, అమిత్ షా (Amit Shah) వ్యూహాలు బీజేపీకి కలిసివచ్చే మరికొన్ని అంశాలని చెప్తున్నారు.

స్థానిక పటిష్ట నాయకత్వం ఏదీ?

అయితే బీజేపీకి బలహీనతలు లేకపోలేదు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా బలమైన నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన విజయ్ రూపానీ (Vijay Rupani), భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) ఆ స్థాయిలో తమ సత్తాను నిరూపించుకోలేకపోతున్నారు. వీరిద్దరినీ మినహాయించి వేరొకరైనా అటువంటి సత్తాను చాటుకోవడం లేదు. అంటే ఆ పార్టీకి స్థానిక నాయకత్వం బలంగా లేకపోవడం ఓ బలహీనతగా కనిపిస్తోందని కొందరు చెప్తున్నారు.

ధరాభారం, అవినీతి ఆరోపణలు

బీజేపీ నేతృత్వంలోని గుజరాత్ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ అవినీతి ఆరోపణలు చేస్తున్నాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, ఆర్థిక ఒడుదొడుకులు సామాన్యులను వేధిస్తున్నాయి. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో లోపాలను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలకు విస్తృత స్థాయిలో వివరిస్తోంది. వీటన్నిటి ప్రభావం ఓటర్లపై పడుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది.

వామపక్షాల రికార్డును బీజేపీ సమం చేయబోతోందా?

సీపీఎం నేతృత్వంలోని వామపక్షాలు పశ్చిమ బెంగాల్‌లో వరుసగా ఏడుసార్లు విజయం సాధించి రికార్డు సృష్టించాయి. ప్రస్తుతం గుజరాత్‌లో ప్రతిపక్షాలు బలహీనంగా ఉండటంతో ఆ రికార్డును బీజేపీ సమం చేస్తుందనే వాదన కూడా ఉంది. ఇండియా టీవీ-మాట్రిజ్ ఒపీనియన్ పోల్ ఫలితాలు బీజేపీకి కొంత వరకు ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. రాష్ట్రంలో ఓటు వేసే హక్కును మొదటిసారి పొందిన యువ ఓటర్లలో 47 శాతం మంది బీజేపీకి ఓటు వేస్తారని ఈ ఫలితాలు చెప్తున్నాయి. వీరిలో 32 శాతం మంది కాంగ్రెస్‌కు, 15 శాతం మంది ఆమ్ ఆద్మీ పార్టీకి, ఆరు శాతం మంది ఇతరులకు ఓటు వేస్తారని తెలిపాయి. 182 స్థానాలున్న ఈ రాష్ట్రంలో బీజేపీకి 104 నుంచి 119 వరకు, కాంగ్రెస్‌కు 53 నుంచి 68 వరకు, ఆమ్ ఆద్మీ పార్టీకి సుమారు ఆరు స్థానాలు లభించవచ్చునని అంచనా వేశాయి.

భారత్ జోడో యాత్ర బీజేపీకి కలిసొస్తోందా?

బీజేపీకి ఇటువంటి పరిస్థితి ఉండటం వెనుక కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) ప్రభావం కూడా ఉందని కొందరు విశ్లేషకుల భావన. ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులంతా ఈ యాత్రలో పాల్గొంటుండటంతో ఈ ఎన్నికలపై దృష్టి సారించలేకపోతున్నారని చెప్తున్నారు.

బీజేపీలో లుకలుకలు

ఎన్నికల తరుణంలో బీజేపీ నేతల మధ్య అసమ్మతి సెగలు తీవ్రంగా ఉండటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. కేంద్రంలో బలమైన నాయకత్వం ఉండటం వల్ల ఇన్నాళ్లూ అంతఃకలహాలను పైకి కనిపించకుండా సర్దుబాటు చేయగలిగారని, కానీ అత్యంత కీలక సమయంలో ఈ కలహాలు బయటపడుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రజా తీర్పు స్పష్టంగా లేకపోతే, హంగ్ అసెంబ్లీ పరిస్థితి వస్తే, మెజారిటీని సాధించేందుకు బీజేపీ చాలా కష్టపడవలసివస్తుంది. 2002 నుంచి బీజేపీ గెలుస్తున్న స్థానాల సంఖ్య వరుసగా తగ్గుతుండటం గమనార్హం. 2002లో 127 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ 2007లో 117కు తగ్గిపోయింది. 2012నాటికి 116కు తగ్గి, 2017లో 99తో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇదే ధోరణి కొనసాగుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

బీజేపీ ఎన్నడూ గెలవని స్థానాలు

27 ఏళ్ళపాటు అధికారంలో ఉన్నప్పటికీ బీజేపీ, భారతీయ జన సంఘ్ కొన్ని స్థానాల్లో విజయాన్ని దక్కించుకోలేకపోతున్నాయి. అవి ఏమిటంటే, బోర్సాద్ (ఆనంద్ జిల్లా), ఝగడియా (భరూచ్), వ్యార (తపి), భిలోడ (ఆరావళి) (1995లో మాత్రమే గెలిచింది), మహుద (ఖేద), అంక్లవ్ (ఆనంద్), డనిలిండ (అహ్మదాబాద్), గర్బడ (దహోద్ జిల్లా). ఇదిలావుండగా, ఖేద్‌బ్రహ్మ, డాంటా, జస్దాన్, ధోరాజీ వంటి నియోజకవర్గాల్లో బీజేపీకి కొన్నిసార్లు విజయం, మరికొన్నిసార్లు పరాజయం ఎదురవుతోంది.

ప్రస్తుతం గుజరాత్‌లో ముక్కోణ పోటీ నెలకొంది. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దాదాపు 182 నియోజకవర్గాలకు అభ్యర్థులను నిలిపింది. 2017 శాసన సభ ఎన్నికల్లో 36 నియోజకవర్గాల్లో అభ్యర్థులు 5,000 కన్నా తక్కువ ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఈ స్థానాలపై అన్ని పార్టీలు దృష్టి సారించాయి. ఏఐఎంఐఎం కూడా ఈసారి ఈ ఎన్నికల బరిలోకి దిగింది. దీంతో ఓట్లు చీలిపోతాయని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. ఈ పరిణామాలు బీజేపీకి కూడా ఇబ్బందికరమేనని కొందరు అంటున్నారు. పోటీ చేసే అవకాశం రాని అభ్యర్థులు స్వతంత్రులుగా బరిలో దిగుతుండటం పార్టీలకు పెద్ద తలనొప్పిగా మారింది.

అమిత్ షా రికార్డు పదిలం

2007లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో అమిత్ షా 2.36 లక్షల ఓట్ల ఆధిక్యంతోనూ, నరోత్తమ్ పటేల్ 3.47 లక్షల ఓట్ల ఆధిక్యంతోనూ గెలిచారు. 2012లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య తగ్గిపోయింది. కాబట్టి వీరిద్దరి రికార్డులకు ఇప్పటికిప్పుడు సవాల్ ఎదురయ్యే పరిస్థితి లేదని తెలుస్తోంది.

- యెనుముల పల్లి వేంకట రమణ మూర్తి

Updated Date - 2022-11-22T13:48:23+05:30 IST

Read more