PM Modi: ప్రతి బూత్‌లోనూ బీజేపీనే గెలిపించాలి

ABN , First Publish Date - 2022-11-21T03:07:53+05:30 IST

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీజేపీనే గెలిపించాలని ప్రధాని మోదీ గుజరాత్‌ ప్రజలకు పిలుపిచ్చారు.

PM Modi: ప్రతి బూత్‌లోనూ బీజేపీనే గెలిపించాలి

పోలింగ్‌ రోజున భారీగా తరలిరండి

నరేంద్ర రికార్డులను భూపేంద్ర బద్దలుకొట్టాలి

గుజరాత్‌ ప్రచారంలో మోదీ పిలుపు

వెరావల్‌/ధోరాజీ, నవంబరు 20: అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో బీజేపీనే గెలిపించాలని ప్రధాని మోదీ గుజరాత్‌ ప్రజలకు పిలుపిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన ఆదివారం సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించి పూజలు చేశారు. వెరావల్‌, ధోరాజీల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. గిర్‌ సోమనాథ్‌ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో కాంగ్రెసే గెలిచింది. ఈ దఫా వీటిపై మోదీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ‘పోలింగ్‌ రోజున ప్రజలు పోలింగ్‌ కేంద్రాలకు పెద్దఎత్తున తరలిరావాలి. ఓటింగ్‌ శాతానికి సంబంధించి గత రికార్డులను అధిగమించాలి. బీజేపీకి మాత్రమే ఓటేయాలని నేను అనడం లేదు. కానీ ప్రజాస్వామ్య పండుగలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని కోరుతున్నాను. ఇదే సమయంలో బీజేపీనే గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.’ అని కోరారు.

మళ్లీ బీజేపీయే విజయం సాధిస్తుందని మీడియా, సర్వేలు చెబుతున్నాయన్నారు. మెజారిటీలో సీఎం భూపేంద్ర పటేల్‌ గత రికార్డులు బద్దలు కొట్టడం చూసేందుకే తరచూ ఇక్కడకు వస్తున్నానని చెప్పారు. నరేంద్ర రికార్డులను భూపేంద్ర బద్దలు కొట్టాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తరచూ కరువుల కారణంగా ఒకప్పుడు గుజరాత్‌ను పెద్దగా పట్టించుకునేవారు కాదని.. ఇప్పుడు ఉత్తర భారతం నుంచి అన్ని ఎగుమతులూ గుజరాత్‌ రేవుల గుండానే సాగుతున్నాయని చెప్పారు. రాష్ట్ర రేవులు భారత పురోభివృద్ధికి ద్వారాలుగా మారాయన్నారు.

రాహుల్‌పై విసుర్లు

కేసులు, ఆందోళనలతో నర్మదా డ్యాం ప్రాజెక్టును ‘నర్మదా బచావో ఆందోళన్‌’ నాయకురాలు మేధా పాట్కర్‌ మూడు దశాబ్దాలకు పైగా అడ్డుకున్నారని భారత్‌ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌గాంధీ అలాంటి వ్యక్తితో కలిసి పాదయాత్ర ఎలా చేస్తారని మోదీ ప్రశ్నించారు. ‘ఎడారి భూములున్న కచ్‌, కథియవాడ్‌ ప్రాంతం దాహార్తి తీర్చడానికి నర్మదపై సర్దార్‌ సరోవర్‌ డ్యాం తలపెడితే పాట్కర్‌ కోర్టుకెళ్లి అడ్డుకున్నారు. గుజరాత్‌ ప్రతిష్ఠను దెబ్బతీసి ప్రపంచ బ్యాంకు నిధులు రాకుండా చేశారు. శనివారం ఓ కాంగ్రెస్‌ నేత (రాహుల్‌) పాట్కర్‌తో కలిసి పాదయాత్ర చేయడం మీరంతా చూసే ఉంటారు. ఓట్లడగడానికి కాంగ్రెస్‌ నేతలు వస్తే ఏ నైతిక హక్కుతో అడుగుతారని ప్రశ్నించండి’ అని సూచించారు. నీటి కొరతను అధిగమించడానికి బీజేపీ ప్రభుత్వం 20 ఏళ్లు కష్టపడిందన్నారు. చెక్‌డ్యాముల నిర్మాణం, కొత్త బావులు, చెరువులు తవ్విందని.. పైపులైన్‌ నెట్‌వర్క్‌ ద్వారా కచ్‌-కథియవాడ్‌ ప్రాంతం మొత్తానికీ ఇవాళ నీరందుతోందని గుర్తుచేశారు.

Updated Date - 2022-11-21T09:06:08+05:30 IST