ఇంకా మంత్రులు ఇక్కడేనా?

ABN , First Publish Date - 2022-11-03T04:23:36+05:30 IST

ఉప ఎన్నిక వేళ మునుగోడులో అర్ధరాత్రి హంగామా చోటుచేసుకుంది.

ఇంకా మంత్రులు ఇక్కడేనా?

మునుగోడులో తిష్టపై రాజగోపాల్‌రెడ్డి అభ్యంతరం

ఆర్వో కార్యాలయం ఎదుట ధర్నా.. ఠాణా వద్ద నిరసన

బీజేపీ నేతలు, కార్యకర్తల బైండోవర్‌!

అర్ధరాత్రి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి సంజయ్‌

హైదరాబాద్‌, చండూరు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉప ఎన్నిక వేళ మునుగోడులో అర్ధరాత్రి హంగామా చోటుచేసుకుంది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య చౌటుప్పల్‌ వద్ద దాడులు జరగ్గా.. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ధర్నాలు చేశారు. దాంతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ అర్ధరాత్రి హుటాహుటిన పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుని, తదుపరి కార్యాచరణపై సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఎన్నికల నియమావళి ప్రకారం మంగళవారం సాయంత్రమే ప్రచారం ముగిసినా.. టీఆర్‌ఎస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఇక్కడే ఉన్నారంటూ రాత్రి 9.30 సమయంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి చండూరులో రిటర్నింగ్‌ అధికారి(ఆర్వో) కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మునుగోడులో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ప్రచారం ముగిసినా స్థానికేతరులు ఇక్కడే తిష్టవేసుకుని కూర్చోవడంపై మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు డబ్బులు, మద్యం పంచుతూ అరాచకాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఎస్పీ రెమారాజేశ్వరికి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఆర్వో కూడా తన ఫిర్యాదును పట్టించుకోవడం లేదన్నారు. ఆ తర్వాత ఆయన నేరుగా పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైఠాయించి, ధర్నాకు దిగారు.

రాత్రి 11.30 సమయంలో నల్లగొండ, కోదాడ డీఎస్పీలు నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి అక్కడికి చేరుకుని, రెండు గంటల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆయన తన ఆందోళనను విరమించుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే మునుగోడులో ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తలను బైండోవర్‌ చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అర్ధరాత్రి హుటాహుటిన హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అందుబాటులో ఉన్న నేతలతో ఆయన భేటీ అయ్యారు.

Updated Date - 2022-11-03T04:23:58+05:30 IST
Read more